logo

పాపం పాపోడు!

ఎవరైనా సమస్యల్లో ఉన్నా.. మానసిక వేదనకు గురవుతున్నా.. స్పందించి మనోధైర్యం నూరిపోసే ఆ మాస్టారు సమస్యల సుడిగుండాన్ని ఈదలేక పోయారు.

Published : 27 Sep 2022 03:08 IST


ఈశ్వరయ్య (పాత చిత్రం)

అనంతపురం(రైల్వే), న్యూస్‌టుడే: ఎవరైనా సమస్యల్లో ఉన్నా.. మానసిక వేదనకు గురవుతున్నా.. స్పందించి మనోధైర్యం నూరిపోసే ఆ మాస్టారు సమస్యల సుడిగుండాన్ని ఈదలేక పోయారు. ఎవరు కనిపించినా ‘పాపోడా..’ బాగున్నావా? అంటూ పలకరించే ఆ గొంతు ఆగిపోయింది. రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం అనంతపురంలో జరిగింది. అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు నీతి ఈశ్వరయ్య (68) సోమవారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్‌ సమీపాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈశ్వరయ్యకు భార్య మంజుల, కుమార్తెలు శిరీష, తేజస్విని ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు.  ఒక ఇంటిని విక్రయించి కొన్ని అప్పులు తీర్చారు. అరకొరగా ఉన్న అప్పులను తీర్చుతాననే ధీమాను తోటి స్నేహితులతో చెబుతూ వచ్చారు. కుమార్తెల్లో ఒకరికి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఆమెకు వైద్యం చేయిస్తూ చిన్నపిల్లలా చూసుకున్నారు. కుటుంబ సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

పేదల పక్షపాతి: పెద్దవడగూరుకు చెందిన ఈశ్వరయ్య మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పని చేశారు. 2013 మార్చిలో పదవీ విరమణ పొందారు. విద్యార్థి దశలో ఏఐఎస్‌ఎఫ్‌లో, యూటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘంలో క్రియాశీలకంగా పని చేశారు. పేదల తరఫున నిలుస్తూ పోరాటాలకు మద్దతు ఇచ్చేవారు. ఎవరు కనిపించినా ‘పాపోడా..’ బాగున్నావా? అంటూ పలకరించే వారు. ఆయన మృతి చెందిన వార్త తెలియగానే పలువురు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, ఎస్సీ, ఎస్టీ ఐకాస అధ్యక్షుడు సాకే హరి తదితరులు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని