logo

సాగు పడిపోయింది జగన్‌.. సాగనంపేందుకు ‘అనంత’ సిద్ధం

అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 18 Apr 2024 06:02 IST

ఏటా తగ్గిపోతున్న వేరుసెనగ పంట విస్తీర్ణం
వైకాపా ప్రభుత్వ ప్రోత్సాహం కరవు
రైతుల పరిస్థితి దయనీయం
అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే

అనంతపురం జిల్లా అంటేనే గుర్తొచ్చేది వేరుసెనగ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పంట పండించేది అనంత జిల్లాలోనే.. ఇక్కడి రైతులకు ప్రధాన పంట వేరుసెనగ. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పంట సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విత్తన కేటాయింపుల్లోనూ జగన్‌ ప్రభుత్వం కోత విధించింది. తెదేపా హయాంలో సాగు తగ్గలేదు. వర్షాభావంతో పంట ఎండిపోతే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులు జిల్లాలోనే ఉంటూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలకు నీరు అందించి... రెయిన్‌గన్ల ద్వారా పంటకు రక్షకతడులు అందించి ఆదుకున్నారు. ఐదేళ్లలో వైకాపా సర్కారు వేరుసెనగ రైతును నిర్లక్ష్యం చేసింది.

రాయితీల్లో దగా

గతంలో రైతులకు వేరుసెనగ విత్తనం రాయితీతో అందించేవారు. టెండర్లు పిలిచి ధర నిర్ణయిస్తారు. తర్వాత రాయితీ ఎంతన్నది ప్రకటించేవారు. రెండూ ఇంచుమించి ఒకటిగా ఉండేవి. సుమారు 33 శాతం రాయితీతో ఏటా 5లక్షల క్వింటాళ్ల నుంచి 6 లక్షల క్వింటాళ్లు పంపిణీ అయ్యేది. వైకాపా ప్రభుత్వం విత్తన రాయితీని 40 శాతానికి పెంచింది. ఇక్కడే తిరకాసు ఉంది. టెండరు ధరలు భారీగా పెంచింది. అంటే విత్తన ధర పెంచి.. రాయితీ ఏమి ఇచ్చినట్లు అని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కర్షకులకు కాకుండా విత్తన ఏజెన్సీలకు జగన్‌ సర్కారు వత్తాసు పలికింది.

గతంలో పకడ్బందీగా కొనుగోళ్లు, నిల్వ, పంపిణీ

తెదేపా ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయ్యేవి. పంటను ఏపీ ఆయిల్‌ఫెడ్‌, ఏపీ మార్కెట్‌ఫెడ్‌, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేవి. పంటంతా మిల్లులకు తరలించి... ప్రాసెసింగ్‌ చేసి సిద్ధం చేసేవారు. సీజన్‌ రాగానే ఆ విత్తనమే సరఫరా చేసేవారు. తర్వాత ఏపీ సీడ్స్‌కు పంట సేకరణ బాధ్యతలు అప్పగించారు. రైతు వద్దనే కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అనంతరం మండల కేంద్రాల్లోని గోదాముల్లో నిల్వ చేసి రైతలకు పంపిణీ చేసేవారు. వైకాపా పాలనలో నాసిరకం విత్తనం పంపిణీ, ధరల పెంపు... రైతుకు మూడు బస్తాలే ఇవ్వడంతో ఎకరాకు విత్తనం చాలడం లేదు. రాయితీ ఇచ్చామని చెప్పుకోడానికి తప్ప రైతులకు ప్రయోజనం లేదు. మూడేళ్ల నుంచి వైకాపా ప్రభుత్వం గ్రామస్థాయిలో రాయితీ విత్తనం పంపిణీ చేసినా రైతులు ఆసక్తి చూపలేదు. రెండేళ్లలో విత్తన పంపిణీ పరిశీలిస్తే ఒక ఏడాది కూడా 2 లక్షల క్వింటాళ్లు దాటలేదు.

గతేడాది ఎండిపోయిన వేరుసెనగ పంట

అప్పుడిచ్చారు.. ఐదేళ్లలో ఎగ్గొట్టారు

ఉమ్మడి జిల్లాలో అతివృష్టి, అనావృష్టితో వేరుసెనగ పంట దెబ్బతింటే.. తెదేపా ప్రభుత్వం రైతులను ఆదుకుంది. పంటనష్ట పరిహారం, బీమా అందించింది. నష్ట పరిహారం కింద 12,04,693 మంది రైతులకు రూ.1,599.76 కోట్లు అందించారు. 2014లో 5,79,640 మందికి రూ.567.33 కోట్లు, 2016లో 6,25,053 మందికి రూ.1,032.43 కోట్లు పరిహారం చెల్లించారు. బీమా పథకంలో భాగంగా 2014లో 47,627 మంది రైతులకు రూ.25.62 కోట్లు, 2015లో 1,85,194 మందికి రూ.109.66 కోట్లు, 2016లో 5,07,662 మందికి రూ.419.06 కోట్లతో పాటు అదే ఏడాదిలో ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకం కింద 11,201 మంది రైతులకు 19.20 కోట్లు ఖాతాలకు జమ చేశారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పంటనష్ట పరిహారం, బీమా పథకాలను గాలికొదిలేసింది. రైతు భరోసా కింద ఏటా ఒక్కో రైతుకు రూ.7,500 ఇస్తున్నారు. పంట నష్టం, బీమా కంటితుడుపుగా అందించి చేతులు దులుపుకోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెదేపా హయాంలో..

అనంత నలుమూలల్లో ఎక్కడ చూసినా కనుచూపు మేర వేరుసెనగ పంట కనిపించేది. మార్కెటింగ్‌తో పాటు గిట్టుబాటు ధరలు ఉండేవి. అప్పట్లో వేరుసెనగ కాయల నుంచి నూనె తీసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. రాయితీతో విత్తనం అందించేవారు.

మొత్తం రైతులు: 5,50,000

వైకాపా పాలనలో..

ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం వేరుసెనగ రైతులను గాలికొదిలేసింది. విత్తనం కొరతతోపాటు నాసిరకంగా ఉండేవి. రాయితీలో సర్కారు దగా చేసింది. మార్కెటింగ్‌ సౌకర్యం, గిట్టుబాటు ధర దక్కక లేదు. ఉమ్మడి జిల్లాలో పండించిన పంటను కర్ణాటకలోని బళ్లారి, చెళ్లికెర, ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని మార్కెట్లలో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. పంట నష్ట పరిహారం, బీమా పథకాలను అరకొరగా అందించి చేతులు దులుపుకొంది జగన్‌ సర్కారు.

ప్రస్తుతం మొత్తం రైతులు: 2,53,000

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 4 లక్షల నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగు అయ్యేది. వేరుసెనగ రైతును అప్పటి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది.

45 రోజులు దాటినా జమ ఏదీ?

గతేడాది వర్షాభావ పరిస్థితులతో వేసిన పంట సర్వం కోల్పోవడంతో అన్నదాతలు అప్పుల పాలయ్యారు. దీంతో అనంతపురం జిల్లాలో 1,69,970 మంది రైతులకు రూ.251.2 కోట్లు.. శ్రీసత్యసాయి జిల్లాలో 1,17,005 మంది రైతులకు రూ105.03 కోట్లు పరిహారం మంజూరైంది. ఈమేరకు ఈఏడాది మార్చి 6న సీఎం జగన్‌ బటన్‌ నొక్కారు. 45 రోజులు గడిచిపోయింది.. ఇప్పటికీ ఒక్క పైసా జమ కాలేదు. దీంతో కార్యాలయాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసమే పరిహారం మంజూరు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.


పెట్టుబడీ చేతికందలేదు

ఆత్మకూరు: మండలంలోని పి.కొత్తపల్లికి చెందిన వెంకటేశులు స్వగ్రామంలోనే నాలుగేళ్లుగా 11 ఎకరాలు కౌలుకు తీసుకొని రబీలో వేరుసెనగ సాగు చేస్తున్నారు. 2023 డిసెంబరులో 10 క్వింటాళ్ల విత్తనం వేశారు. ఈ ఏడాది మార్చిలో పంటకోసి నూర్పిడి చేయగా పెట్టుబడీ దక్కలేదు. వచ్చిన అరకొర పంటను విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా పంటను విక్రయించేందుకు ప్రయత్నించగా దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. చేసేది లేక కర్ణాటక రాష్ట్రం బళ్లారికి పంటను తీసుకువెళ్లి విక్రయించుకున్నారు. రూ.2.4 లక్షల పెట్టుబడి పెడితే రూ.2 లక్షలే చేతికొచ్చింది. నాలుగు నెలలు కష్టపడి పంట సాగు చేసినా రూ.40 వేలు నష్టాన్ని చవిచూశారు.


సాయమందకుంటే కష్టమే

అనంతపురం గ్రామీణం: మండలంలోని ఎన్‌ఎన్‌ కుంటకు చెందిన కృష్ణనాయక్‌ ఏటా అప్పులు చేసి ఐదు ఎకరాల్లో వేరుసెనగ పంట సాగు చేస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంట దిగుబడి ఏమాత్రం రాలేదు. సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందడం లేదు. ఈ పరిస్థితుల్లో ముగ్గురు పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒక అమ్మాయిని వివాహం చేశారు. మరో అమ్మాయిని చదివించడానికి అప్పులు చేస్తున్నారు. కుమారుడి ఆరోగ్యం కూడా సరిగా లేదు. గతంలో పంట నష్టపరిహారం, బీమా వచ్చేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రూ.17 వేలు బీమా వచ్చింది. నాలుగేళ్లు వరుసగా నష్టాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం ఆదుకోలేదు. రైతులకు ప్రభుత్వ సాయం అందకుంటే పంటల సాగు చేయడం కష్టమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని