logo

పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం

ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 25 Apr 2024 05:06 IST

వైద్యులు వేళకు రాకపోవడంతో నిరీక్షిస్తున్న రోగులు

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి రోజూ 400 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఇన్‌పేషెంట్లు, గర్భిణులు మరో 50 మంది వరకు ఉంటారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఇదే పెద్దాసుపత్రి. ఇక్కడ ఓపీ వైద్య సేవలు మినహా, ఎలాంటి ప్రత్యేక వైద్య సదుపాయం లేదు. రోగులను పరీక్షించి చూడటం కష్టమే. రక్త పరీక్షల పరంగా ప్లేటులేట్ల లాంటి పరీక్షలు లేవు. ఇటీవల ఆ పరీక్షకు సంబంధించి యంత్రం వచ్చినా, అందుబాటులోకి తేలేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అత్యవసర వైద్యం కోసం రోగులను అనంతపురం రెఫర్‌ చేస్తున్నారు.

ఐదేళ్లలో మెరుగు పడని సదుపాయాలు

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి గత తెదేపా ప్రభుత్వం 50 పడకల సామర్థ్యంతో కొత్త భవనాన్ని నిర్మించింది. అప్పట్లో మెరుగ్గా వైద్య సేవలు అందించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలాంటి వైద్య సేవలు మెరుగు పర్చలేదు. కనీసం పూర్తి స్థాయిలో వైద్యులను నియమించలేదు. ఇక్కడ పని చేస్తున్న ఓ వైద్యుణ్ని రాజకీయ కారణాలతో బదిలీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కనీసం వార్డుల్లోని పరుపులపై దుప్పట్లను ఏర్పాట్లు చేయలేని దుస్థితి. రోగులు ఇంటి నుంచే దుప్పట్లను తెచ్చుకుని పరుచుకోవాల్సి వస్తోంది. ఐదేళ్లలో తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పించింది లేదు. ఆసుపత్రి స్థాయికి తగినట్లు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చింది లేదు.

 వైద్యులు వేళకు రావడమూ కష్టమే

ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. 10 మంది వైద్యులు ఉండగా, నిర్దేశిత సమయానికి వారు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సగటున నెలలో 20 రోజులపాటు ఉదయం 10 గంటల తరువాతనే ఓపీ సేవలు ప్రారంభం అవుతాయి. అది కూడా మధ్యాహ్నం 12:30 నుంచి 1గంట వరకే. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు ఒక్క రోజూ కూడా అందిన సందర్భాలు లేవు. రాత్రివేళ అత్యవసరంగా వైద్యం కోసం వచ్చే వారికి నర్సులు సేవలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని