logo

జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?

నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు.

Published : 26 Apr 2024 02:12 IST

సగం సంఘాలకు అందని ఆసరా
అటకెక్కిన వైఎస్‌ఆర్‌ అభయహస్తం

16వ వార్డులో మహిళా సంఘ సభ్యుల సమావేశం

రాయదుర్గం, న్యూస్‌టుడే: నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని పథకాలకు ఎన్నిమార్లు బటన్‌లు నొక్కినా మహిళల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడటం లేదు. రాయదుర్గం పట్టణంలో మెప్మా పరిధిలో మొత్తం 1,375 మహిళా సంఘాలు ఉన్నాయి. 2023-24వ ఆర్థిక సంవత్సరంలో 651 సంఘాలకు రూ.79.37 కోట్ల మేర రుణాలిచ్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో బ్యాంకు లింకేజీ పథకం కింద తీసుకున్న  స్వయం ఉపాధి రుణాలకు రూ.5లక్షల దాకా వడ్డీ మినహాయింపు ఉండేది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మినహాయింపును రూ.3లక్షలకు కుదించటంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు.

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం కింద పట్టణంలో 791 సంఘాలకుగాను కేవలం 300 సంఘాలకు మాత్రమే రుణమాఫీ వర్తించింది. మిగిలిన సంఘాల మహిళలు  కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన మహిళల స్వావలంబనకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ చేయూత కింద ఏటా రూ.18,750 మంజూరు చేస్తుండగా పట్టణంలో ఈ ఏడాది ఒక్కరికి జమ చేయలేదు. వీధి వ్యాపారులకు జగనన్నతోడు కార్యక్రమం కింద మంజూరు చేసే రూ.10వేల ఆర్థిక సాయం నేటికీ పలువురికి అందలేదు. వైఎస్‌ఆర్‌ బీమా పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.లక్ష ఇస్తామని వైకాపా నాయకులు ఊదర గొడుతున్నారు. మరణించిన రోజు దహన సంస్కారాలకు రూ.10వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి.

చేయూత అందలేదు

వైఎస్‌ఆర్‌ చేయూత మంజూరుకు బొటనవ్రేలి సంతకం తీసుకుని నెల కావస్తున్నా రూ.18,750 నేటికీ ఖాతాకు జమకాలేదు. నేడు, రేపు అని వాలంటీర్లు చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ రావటంతో ఆ డబ్బులు వస్తాయా రావా అనే సందేహం నెలకొంది.

పార్వతి, కోటవీధి, రాయదుర్గం


జగనన్నతోడు రాలేదు

తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తున్నా. గత ఏడాది జగనన్న తోడు కార్యక్రమం కింద రూ.10వేలు మంజూరు చేశారు. ఆ డబ్బు బ్యాంకుకు వెనక్కి చెల్లించా. ప్రస్తుతం రూ.20వేలకు దరఖాస్తు చేస్తే బ్యాంకరు నేడు, రేపు అంటూ తిప్పుకొంటున్నారు.  

పద్మావతి, రాజీవ్‌గాంధీ కాలనీ, రాయదుర్గం


పథకం ఆపేశారు

గతంలో అభయహస్తం పథకం కింద 60ఏళ్ల తర్వాత ప్రతి మహిళకూ పింఛను కోసం ఏటా రూ.365 చెల్లించాం. గతంలో మూడేళ్లపాటు డబ్బు చెల్లించాం. రెండేళ్ల నుంచి ఈ పథకాన్ని ఆపేశారు. కనీసం మేము చెల్లించిన డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. 

దుగ్గెమ్మ, వీధి వ్యాపారి, రాయదుర్గం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని