logo

డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే అనంత అభివృద్ధి

వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్‌షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు.

Updated : 06 May 2024 07:20 IST

హంద్రీనీవాతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
కేంద్రమంత్రి అమిత్‌షా, చంద్రబాబు హామీ

కేంద్రమంత్రి అమిత్‌షాకు జ్ఞాపిక అందజేస్తున్న తెదేపా  అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్‌షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. హంద్రీనీవాతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ను ఇంటికి పంపి మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆదివారం జరిగిన ఎన్డీయే కూటమి సభలో అమిత్‌షా, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత సాయంత్రం అనంతపురం నగరంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.  అనంతపురం జిల్లా తన మనసుకు దగ్గరగా ఉంటుందన్నారు. జిల్లాకు ఎప్పుడు వచ్చినా ప్రజాస్పందన బ్రహ్మండంగా ఉంటుందన్నారు. మిమ్మల్ని చూసి ఎండలు భయపడుతున్నాయన్నారు.

హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి బీకే పార్థసారథి, ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్‌తో కలిసి అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్‌షా, చంద్రబాబు, పరిటాల సునీత, మధుసూదన్‌రెడ్డి, పరిటాల శ్రీరామ్‌, భాజపా, జనసేన నాయకులు

జగన్‌ అంటేనే దోపిడీ

ధర్మవరం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘జగన్‌ ఈ మధ్య క్లాస్‌వార్‌ అంటున్నారు. అయితే అది క్లాస్‌వార్‌ కాదు క్యాష్‌వార్‌. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా లిక్కర్‌స్యామ్‌ చేస్తున్నాడు. రూ.70 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.200 పెంచి నాశనం చేస్తున్నాడు. జె బ్రాండ్లు తీసుకొచ్చి ప్రాణాలు తీస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను ఇష్టారీతిన దోచేశాడు. తెదేపా అధికారంలోకొస్తే మీ ఊర్లో ఇసుకు మీరే ఉచితంగా తీసుకునేలా చేస్తాం. 

అనంత సభలో మాట్లాడుతున్న చంద్రబాబు,  ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి ప్రసాద్‌

హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తాం

‘‘జగన్‌ ప్రభుత్వంలో రైతులకు అసలు డ్రిప్‌ పరికరాలు ఇవ్వడం లేదు. గతంలో 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించాం. తెదేపా మళ్లీ అధికారంలోకి రాగానే పథకాన్ని పునఃప్రారంభిస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చే బాధ్యత తీసుకుంటాం. పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి విదేశాలకు ఎయిర్‌కార్గో ద్వారా పంటలను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించేలా చేస్తాం.’ అని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు.

కేతిరెడ్డికి గుడ్‌నైట్‌ చెప్పాలి

ధర్మవరంలో కేటురెడ్డి ఉన్నాడు. గుడ్‌మార్నింగ్‌ రెడ్డికి ఇప్పుడు శాశ్వతంగా గుడ్‌నైట్‌ చెప్పాలి. ఎర్రగుట్టను దోచేశాడా లేదా? ముదిగుబ్బలో ఉప్పలపాడు ఇసుక రీచ్‌లో ఇసుక తవ్వి బెంగళూరుకు తరలించిన దుర్మార్గుడు కేతిరెడ్డి అన్నారు.


పరిటాల శ్రీరామ్‌ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా..

పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గాన్ని భాజపాకు కేటాయించాం. ధర్మవరం తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్‌ అందరి కోసం పనిచేస్తున్నారు. సత్యకుమార్‌ కోసం పెద్ద మనసుతో త్యాగం చేశారని పేర్కొన్నారు. శ్రీరామ్‌ త్యాగాన్ని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుదన్నారు. ప్రభుత్వం రాగానే తగిన గుర్తింపు ఇస్తామన్నారు. శ్రీరామ్‌ను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ధర్మవరం సభకు హాజరైన తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని