logo

అనంత రైతులకు జగన్‌ నవమోసాలు

రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్‌...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు.

Updated : 08 May 2024 07:25 IST

ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్‌...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో ఊరికో హామీ ఇచ్చారు. ప్రధానంగా రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. 99 శాతం హామీలు నెరవేర్చామంటూ పచ్చిగా అబద్ధాలు వల్లె వేస్తున్నారు. కొన్నింటిని అరకొరగా అమలు చేసి రైతులను నట్టేటా ముంచారు. భరోసా కింద ఏటా రూ.12,500 అని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కరవు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారు. అతివృష్టి, అనావృష్టితో కర్షకులు నష్టపోయినా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూనే ఇచ్చిన హామీలను పెన్నా నదిలో కలిపేశాడు జగన్‌. అసమర్థ, విధ్వంస పాలనకు ఓటుతో స్వస్తి పలికితేనే అనంత రైతులకు మంచి రోజులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆహారశుద్ధి కేంద్రాలు ఉత్తుత్తినే..

ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కదిరి ముదిగుబ్బ, బత్తలపల్లి, తనకల్లు ప్రాంతాల్లో టమాటా సాగుచేస్తున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్ల చాలా అవసరం. తనకల్లు వద్ద రూ.3.86 కోట్లతో టమాటా కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మాణానికి భూమి సేకరించి.. గాలికి వదిలేశారు.

ఎన్ని ఏర్పాటు చేశారు వడ్డీలేని రుణాలు ఎక్కడ?

రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2019 ఎన్నికల ముందు జగన్‌.. ప్రతి సభలో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష లోపు రుణం ఉన్నవారికి మాత్రమే సున్నావడ్డీ డబ్బులు జమ చేశారు. రెండు జిల్లాల్లో 9,88,395 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లా రైతులకు వైకాపా ప్రభుత్వం బకాయి పడింది. ఇంతలా అన్యాయం చేసి సున్నావడ్డీ గతంలో ఎవ్వరూ ఇవ్వలేదని జగన్‌ దుష్ప్రచారం చేయడం గమనార్హం.

ఆత్మహత్యలపై తప్పుడు లెక్కలు

రైతులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. బాధిత రైతు కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. నిబంధనలు పేరు చెప్పి 25 శాతం మందికి కూడా సాయం చేయలేదు. కనీసం పెట్టుబడి దక్కక.. అప్పుల భారం తాళలేక ఉమ్మడి జిల్లాలో వందలాది రైతులు బలవన్మరణం చెందారు. ప్రభుత్వం 50 మందికి మించి పరిహారం ఇవ్వలేదు. వ్యక్తిగత కారణాలతో చనిపోయారంటూ నివేదికలు తయారుచేసి పరిహారం ఎగ్గొట్టారు.

నిరంతరాయంగా అందని విద్యుత్తు

వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తానని..అధికారంలోకి వచ్చిన తర్వాత  ఒక్కరోజు కూడా నిరంతరాయంగా ఇచ్చిన పాపాన పోలేదు. రెండేళ్ల నుంచి రాత్రీ పగలు ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తున్నారు. ఈ వేసవిలో విపరీతమైన కోతలు విధించడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసులు అందిస్తున్న ఫీడర్లు 823 ఉన్నాయి.  ఏ ఒక్క ఫీడర్‌లోనూ పగటిపూట9 గంటలు ఇవ్వడం లేదు.

ప్రకృతి విపత్తుల సహాయనిధి ఎటుపోయె

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అనంత జిల్లాలో 2021లో నివార్‌ తుపాను కారణంగా వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ ఏడాదితోటు 2022లో  అతివృష్టితో టమాటా, చీనీ, దానిమ్మ, అరటి, ఆముదం పంటలు దెబ్బతిని దిగుబడి చేతికందలేదు. వేరుసెనగలో పశుగ్రాసం కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. జగనన్న ప్రభుత్వం 2022లో మాత్రమే కొన్ని పంటలకు పరిహారం చెల్లించింది.

కొందరికే ఉచిత బోర్లు

వైఎస్సార్‌ జలకళ పేరిట రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కారు. బోర్ల కాంట్రాక్టును వైకాపా ప్రజాప్రతినిధులకు అప్పగించి అవినీతిమయం చేశారు. ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా కేవలం 3,356 బోర్లు వేశారు.విద్యుత్తు కనెక్షన్‌ భారాన్ని రైతులపైనే వేశారు. ఆర్థిక భారంతో చాలామంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు.

జాడ లేని గోదాములు

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌స్టోరేజీ, గోదాములు నిర్మిస్తామని గత ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ నిర్మించలేదు. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో టమాటా, 1.20 లక్షల ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నారు. కోల్డ్‌స్టోరేజీ లేక తక్కువ ధరలకు విక్రయిస్తూ నష్టాలు మూటకట్టుకుంటున్నారు. ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు ప్రాంతాల రైతులు కొందరు కర్ణాటకకు తీసుకెళ్లి పంటను నిల్వ చేసుకుంటున్నారు.

రూ.13 వేల కోట్ల బకాయి

పెట్టుబడి సాయం కింద ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. కేంద్రం సాయంతో కలిపి రూ.13,500 ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,500. ఒక్కో రైతుకు ఏటా రూ.5 వేలు ఎగ్గొట్టారు.ఇరుజిల్లాల్లో ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రూ.13,900 కోట్ల బకాయి పడింది. ఏడాదిలో మొదటి విడత రూ.5,500, రెండో విడతలో రూ.2 వేలు ఇస్తూ జగన్‌ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇది ఏమాత్రం సరిపోవడం లేదని కర్షకులు వాపోతున్నారు.

ధరల స్థిరీకరణ నిధి ఏదీ?

రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని అనంత జిల్లా ఎన్నికల ప్రచారంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని వరి, వేరుసెనగ రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. తెదేపా హయాంలో వరి, వేరుసెనగ పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. జగన్‌ అధికారంలోకి వచ్చాక వేరుసెనగ విత్తనాలు అరకొరగా అందించారు. ఐదేళ్లలో ఒక్క ఏడాది పప్పుశగనకు ధరల స్థిరీకరణ నిధి వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇచ్చేది: 6 నుంచి 7 గంటల్లోపే..
ఎన్ని విడతల్లో: మూడు
రైతు భరోసా లబ్ధిదారులు: 5.56 లక్షలు
ఐదేళ్లలో ఒక్కో రైతు నష్టపోయింది: రూ.25,000
అతివృష్టి వచ్చింది: 2021, 2022లో
నష్టపోయిన పెట్టుబడి: రూ.10 వేల కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు