logo

అడకత్తెరలో ఆరోగ్యశ్రీ రోగులు

ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా గాడితప్పాయి. ఈహెచ్‌ఎస్‌ సేవలను నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎప్పుడో ఆపేశారు.

Updated : 23 May 2024 04:06 IST

రాష్ట్రంలో అలుముకున్న ఆరోగ్య అభద్రత
ఎంతకూ బిల్లులివ్వని ప్రభుత్వం
దోపిడీకి మార్గాలు ఎంచుకున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు

చిత్తూరు వైద్యం, గూడూరు, న్యూస్‌టుడే : ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా గాడితప్పాయి. ఈహెచ్‌ఎస్‌ సేవలను నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఎప్పుడో ఆపేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఎంతకూ ఇవ్వకపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు, చివరకు ఉద్యోగులు సైతం ఆరోగ్య అభద్రతను ఎదుర్కొంటున్నారు. అత్యవసర వైద్యం అవసరమైనవారు అప్పుల పాలవడం.. చెల్లించలేని వారి ప్రాణాల మీదకు రావడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సకాలంలో వైద్యం చేయించుకోలేక కొందరు వాయిదాలు వేసుకుంటున్న దుస్థితి నెలకొనడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

ఉమ్మడి జిల్లాలో 46 ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండగా తిరుపతిలోనే 36 ఉన్నాయి. ఇక్కడే పెద్దఎత్తున శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అటు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్సలు ఆపేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ వార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రోగులను ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. లేకుంటే డబ్బు చెల్లించి వైద్యం పొందండంటూ స్పష్టం చేస్తున్నారు.

రూ.60 వేలు అదనం

గూడూరు ప్రాంతానికి చెందిన వృద్ధురాలు కిందపడటంతో తుంటి ఎముక విరిగింది. తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇక్కడ రెండు రోజులు ఉంచుకుని బిల్లు రూ.20 వేలు వేసి ఆరోగ్యశ్రీ చికిత్స కుదరదని చెప్పేశారు. చివరకు నాయుడుపేటలో సర్జరీ చేయించగా రూ.60 వేల బిల్లు చెల్లించాల్సి వచ్చింది.

భారం ఇలా..

ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ కుదరదంటూనే ఓవైపు బిల్లులు చేసుకుంటూ అదనపు దోపిడీలకు తెరతీస్తున్నాయి. రోగుల నుంచి సాధారణ శస్త్రచికిత్సలకు రూ.20 వేలకు పైగా అదనంగా వసూలు చేస్తున్నారు. జబ్బును బట్టి ఇది మరింత పెరుగుతోంది. గది అద్దెలు వసూలు చేయడం, రోగుల సహాయకులకు భోజనం పెట్టకపోవడం, రవాణా ఛార్జీలు చెల్లించకపోవడం, మందులు రోగుల చేతే కొనిపించడం వంటివి చేస్తూ ఆర్థికంగా భారం మోపుతున్నారు.

బకాయిలు రూ.115 కోట్లు

ఉమ్మడి జిల్లాలోని ఆసుపత్రులకు రూ.115 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఏడాదిగా వారికి బకాయిలు చెల్లించని ప్రభుత్వ తీరుతో క్రమంగా శస్త్రచికిత్సలు వదిలేశారు. వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన ఆసుపత్రిలోనూ ఇదేతీరుగా శస్త్రచికిత్సలు మానేయడం గమనార్హం.

స్టంట్‌ కోసం రూ.90 వేల అప్పు

తిరుపతిలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగి గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా ఆరోగ్యశ్రీ కింద చేయలేమని స్పష్టంచేశారు. రోగి భార్య, కుమార్తె రూ.20 వేలు ముందుగా చెల్లించడంతో చికిత్సలు ప్రారంభించారు. రూ.7 వేలతో ఎక్స్‌రే, రక్త, మూత్ర తదితర పరీక్షలు చేశారు. ఇలా ఒక్కరోజులోనే రూ.16 వేల బిల్లు వేశారు. మరో రూ.70 వేలు చెల్లిస్తే చికిత్సలు పూర్తవుతాయని తెలియజేయగా తప్పని పరిస్థితుల్లో అప్పుచేసి స్టంట్‌ వేయించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు