logo

14 రేవుల్లోనూ.. ఉల్లంఘనలే

ప్రకృతి, పర్యావరణ చట్టాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్కే లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా మెలిగిన సంస్థలు, వ్యక్తులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, విక్రయాలు చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చుంది.

Updated : 23 May 2024 04:05 IST

ఇష్టారాజ్యంగా సాగిన ఇసుక తవ్వకాలు
అక్రమార్కులకు కొమ్ముకాసిన వైకాపా ప్రభుత్వం 

చిత్తూరు మండలం ఆనగల్లులో నీవా నదిలో వేసిన రోడ్డు  

ఈనాడు, చిత్తూరు: ప్రకృతి, పర్యావరణ చట్టాలంటే వైకాపా ప్రభుత్వానికి లెక్కే లేదు. ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా మెలిగిన సంస్థలు, వ్యక్తులు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, విక్రయాలు చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చుంది. తాజాగా కలెక్టర్ల ఆధ్వర్యంలో భూగర్భ గనులు, పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, సెబ్, జలవనరులు, తదితర శాఖల అధికారులతో కమిటీలు వేసి తనిఖీలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని 14 రేవులను పరిశీలించగా గడువు ముగిసిన తర్వాతా తవ్వకాలు చేశారని, అనుమతించిన విస్తీర్ణం, పరిమాణంకన్నా ఎక్కువగా ఇసుకను తరలించారని గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం అన్నింటిలోనూ కార్యకలాపాలు నిలిచిపోగా ఉల్లంఘనలపై ఎటువంటి చర్యలకు సిఫార్సు చేస్తారనే విషయం తేలాల్సి ఉంది.

జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వ్యాప్తంగా 14 రేవులకు అనుమతిచ్చారు. ఒకే ప్రాంతంలో వేర్వేరు సర్వే నంబర్లలో రెండుచోట్ల, యంత్రాలు వినియోగించకుండా స్థానికంగా ఇళ్ల నిర్మాణాల కోసమని తక్కువ విస్తీర్ణంలో ఇసుక తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. అత్యధికంగా చిత్తూరు మండలంలో ఐదు, గంగాధరనెల్లూరులో నాలుగు, పూతలపట్టు రెండు, తవణంపల్లె, కార్వేటినగరం, నగరి మండలాల్లో ఒక్కోటి చొప్పున అనుమతులు మంజూరు చేశారు. ఎక్కడా ఐదు హెక్టార్లకు మించి తవ్వకాలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. గుత్తేదారులకు మేలు చేసేందుకు ప్రభుత్వమే వాటిని రెండు ప్రాంతాలుగా విభజించింది. ఏరేవులోనూ 50,000 క్యూబిక్‌ మీటర్లకు మించి ఇసుక రవాణా చేయకూడదని స్పష్టం చేసింది. జిల్లాలోని 14 రేవుల్లో మొత్తం 53.98 హెక్టార్లలో తవ్వకాలకు అనుమతిచ్చారు.

రెండు కి.మీ. పొడవునా తవ్వకాలు

గంగాధరనెల్లూరు మండలంలోని కొట్రకోన, కొట్రకోన-1 నందనూరు, కొట్రకోన 2, ముక్కళతూరు రేవులతోపాటు చిత్తూరు మండలం ఆనగల్లు 1, బీఎన్‌ఆర్‌పేట, బీఎన్‌ఆర్‌పేట 2, ముత్తుకూరు 1, అనంతాపురంలో నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘించారు. కొట్రకోన, నందనూరు రేవుల్లో దాదాపు రెండు కి.మీ. పొడవునా తవ్వకాలు చేపట్టారు. ఒక్కోచోట 15- 20 అడుగుల లోతువరకు ఇసుక తీశారంటే ఏస్థాయిలో దోపిడీ జరిగిందో ఇట్టే అర్థమవుతుంది. ప్రతి రేవులోనూ సుమారు 1-1.50 లక్షల టన్నుల వరకు ప్రకృతి సంపదను ముఖ్యమంత్రి జగన్‌ సన్నిహిత గుత్తేదారు సంస్థలు, వ్యక్తులు తవ్వి వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు. నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా ఇసుక తీసుకోవాలనే నిబంధన ఉన్నా దాన్ని తుంగలో తొక్కారు. మధ్యలో మట్టితో రోడ్డువేసి టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుక తరలించారు. గంగాధరనెల్లూరు, చిత్తూరు మండలాల్లోని మూడు రేవులకు ఈ ఏడాది మార్చి ఎనిమిది వరకు మాత్రమే అనుమతులున్నాయి. మిగతా ఆరింటిలో ఎప్పుడో తవ్వకాలు నిలిపేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. స్థానికులు అభ్యంతరం చెబితే ఏకంగా పోలీసులు రంగంలోకి దిగి వారిని బెదిరించిన ఉదంతాలున్నాయి. ఇలా ప్రభుత్వమే అక్రమార్కులకు కొమ్ము కాసింది.  

కార్వేటినగరం మండలం ముక్కరవానిపల్లె రేవును తనిఖీ చేసి స్థానికులతో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు 

ఓజీకుప్పంలో ఫిర్యాదులు పట్టించుకోక   

నగరి మండలంలోని ఓజీకుప్పంలో ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పొరుగునే ఉన్న తమిళనాడుకు అక్రమంగా రవాణా చేశారు. పూతలపట్టు మండలం వావిల్‌తోటలో పూర్తిగా ఇసుక అయిపోవడంతో తవ్వకాలు నిలిపేశారు. కార్వేటినగరంలోని ముక్కరవానిపల్లెలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతా అక్రమ రవాణా జరిగింది. ఈ ఉల్లంఘనలపై అధికారుల బృందం ఏమని నివేదిక ఇస్తుంది? అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు