logo

రూ.కోట్ల సామగ్రిని కొట్టేస్తున్నారు..!

తిరుపతి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రారంభించిన అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే సామగ్రి, వస్తువుల కొనుగోలుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అవి దొంగల పాలవుతున్నాయి. నిర్వహణ లోపమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.

Published : 01 Apr 2023 03:13 IST

అవిలాల చెరువు నుంచి అక్రమంగా తరలింపు

అడవిని తలపిస్తున్న అవిలాల చెరువు

తిరుపతి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ప్రారంభించిన అవిలాల చెరువు సుందరీకరణ పనులు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికే సామగ్రి, వస్తువుల కొనుగోలుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అవి దొంగల పాలవుతున్నాయి. నిర్వహణ లోపమే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.

ఈనాడు-తిరుపతి : అవిలాల చెరువు 169 ఎకరాల పరిధిలో ఉంది. తిరుపతి ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కు అందుబాటులో లేదన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అవిలాల చెరువును ఆధ్యాత్మిక ఎకో పార్కుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జలవనరులశాఖ అధికారులు చెరువు నిర్వహణ బాధ్యతలు తితిదేకు అప్పగించారు. రూ.18.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు 2018లో తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఆ తర్వాత ఏపీ అర్బన్‌ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీయూజీ అండ్‌ బీసీఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి అనుగుణంగా తొలి దశలో రూ.80.14 కోట్లు, రెండో దశలో రూ.100.99 కోట్లు ఖర్చవుతుందని ఏపీయూజీ అండ్‌ బీసీఎల్‌ ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతిపాదనలపై అప్పటి ముఖ్యమంత్రి సమీక్షించి తొలి దశ ప్రతిపాదిత పనులకు ఆమోదించారు. పనులు చేపడుతున్న సమయంలోనే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇక్కడ ఎటువంటి శాశ్వత కట్టడాలు నిర్మించకూడదని ఆదేశాలు ఇచ్చారు. న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ప్రతిపాదలను రూ.46 కోట్లకు కుదించారు.

తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సిమెంటు దిమ్మెలు

దొరికింది   తరలిస్తున్నారు..

ఆధునికీకరణ కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ఒక్కొక్కటిగా దొంగిలిస్తున్నారు. సుందరీకరణలో భాగంగా చెరువు లోపల చుట్టూ నడక మార్గం సిద్ధం చేశారు. ఇందుకోసం సిమెంటు దిమ్మెలు.. ప్రహరీకి గ్రానైట్‌ రాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ పనుల కోసం సుమారు రూ.20 కోట్ల మేరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం సామగ్రిని ఒక్కొక్కటిగా తొలగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇందుకోసం సిమెంటు దిమ్మెలను ముందుగా ప్రహరీ వద్ద వేసి ఆ తర్వాత రహదారిని వైపు మళ్లిస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్లలో నింపి తీసుకెళ్తున్నారు. చుట్టుపక్కల వారు మురుగునీటిని పైపుల ద్వారా చెరువులోకి వదులుతున్నారు. దీంతో దుర్గంధంగా తయారవుతోంది.

రక్షణ ఏదీ..

2019లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అవిలాల చెరువు అభివృద్ధి పనులు చేసేందుకు తుడా ముందుకొచ్చింది. ఇందుకోసం తితిదేకు లేఖ రాసింది. నిర్వహణతో పాటు పనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరగా తొలుత నిరాకరించగా ఆ తర్వాత ఒప్పుకొంది. ఇదే సమయంలో ఎన్‌జీటీ అక్కడ పనులు చేపట్టే అంశంపై తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు. అప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు చెరువు నిర్వహణపై దృష్టిసారిస్తే సామగ్రి చోరీని అడ్డుకోవడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు ఆస్కారం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని