logo

బడికి జీవం పోశారు

ఆ గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చేరుతున్నారు.. సమీపంలో ప్రైవేటు బడులున్నా వెళ్లరు. బడి తమదన్న భావన.. ఉపాధ్యాయుల అంకితభావం వెరసి పదో తరగతిలో ఉత్తమ మార్కులు తోడు ఆటల్లోనూ రాష్ట్రస్థాయిలో తలపడుతున్నారు.

Updated : 02 Jun 2023 04:05 IST

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్థులు
ఫలితాల్లోనూ ముందున్న పాఠశాల

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు

పెళ్లకూరు, న్యూస్‌టుడే : ఆ గ్రామంలోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చేరుతున్నారు.. సమీపంలో ప్రైవేటు బడులున్నా వెళ్లరు. బడి తమదన్న భావన.. ఉపాధ్యాయుల అంకితభావం వెరసి పదో తరగతిలో ఉత్తమ మార్కులు తోడు ఆటల్లోనూ రాష్ట్రస్థాయిలో తలపడుతున్నారు. ఇలా అందరూ కలిసి బడికి జీవంపోసి మాఊరు- మాబడి అని గర్వంగా చెప్పుకొంటున్నారు.

పెళ్లకూరు మండలం తాళ్వాయపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను 2017లో ప్రారంభించారు. ఆ ఏడాది 21 మంది విద్యార్థులు నాయుడుపేటలో చదువులు ఆపేసి ఇక్కడే చేరారు. నాలుగేళ్లు వందశాతం ఫలితాలు సాధించారు. 2021-22లో ఆంగ్ల బోధనకు మారగా 90% ఫలితాలు సాధ్యమయ్యాయి. ఈ ఏడాది 26 మందికి 26 మంది ఉత్తీర్ణులయ్యారు. దయాకర్‌ అనే విద్యార్థి రాష్ట్రస్థాయిలో ప్రతిభా పురస్కారం దక్కించుకున్నారు. గతేడాది చందన అనే బాలికకు ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చింది. ఈ ఏడాది ముగ్గురు మంచి మార్కులు సాధించారు. ఉదయం, సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు, పరీక్షలు, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బోధన ఉంటోంది. అదనంగా ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సరేసరి.

ఉన్నత పాఠశాల కోసం గ్రామస్థులు పోరాటమే చేశారని చెప్పాలి. 1.5 కి.మీ దూరంలోనే నాయుడుపేటలో బడి ఉందని, వీలు కాదని ఉన్నతాధికారులు తేల్చిచెప్పినా వినలేదు. రోడ్డెక్కారు.. అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. పట్టుబట్టి సాధించుకున్నారు. వారే స్థల సేకరణ బాధ్యత తీసుకుని అప్పట్లో డీఈవోగా ఉన్న మువ్వా రామలింగం తోడ్పాటుతో జడ్పీ ఏర్పాటును గట్టెక్కించారు. ఇందుకోసం అమరావతి వరకు వెళ్లారు. హెచ్‌ఎంగా చంద్రగిరి చలంబాబు బాధ్యతలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. బడికి ఏదికావాలన్నా స్థానికుల భాగస్వామ్యంతో చేపట్టారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం, తాగునీటి ప్లాంట్‌ వంటివి సమకూర్చారు.

ఊరు : తాళ్వాయపాడు
విద్యార్థులు:227
ఉపాధ్యాయులు :11

బడిని తాత్కాలికంగా ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. గదుల కొరత, సోషల్‌ ఉపాధ్యాయుడు లేకున్నా ఫలితాల్లో ముందు నిలిచారు. జడ్పీ పాఠశాల కోసం 5 ఎకరాల భూమి తీసుకున్నారు. నాడు-నేడులో రూ.1.10 కోట్లు కేటాయించగా 9 గదుల నిర్మాణం, వంటగది, మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. మాజీ సర్పంచి గంగాబత్తిన అనురాధ, ప్రస్తుత సర్పంచి కుమారి కల్పన, మాజీ ఎంపీపీ కట్టా బాలసుబ్రహ్మణ్యం తదితరులు పార్టీలకతీతంగా సహకరిస్తున్నారు.


అందరి సహకారంలో ఫలితాలు

బడి కోసం గ్రామస్థులు ముందుంటారు.. హైస్కూల్‌ మంజూరైన తర్వాత పిల్లలను చేర్చడం మొదలు, మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కోసం వారివంతు సాయం చేస్తున్నారు. అందుకే ఫలితాల్లో ముందు వరుసలో నిలిచాం. ఈ ఏడాది పదో తరగతిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితం వచ్చింది.

చంద్రగిరి చలంబాబు, హెచ్‌ఎం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని