logo

‘గుట్ట’క్కమన్నా.. ఆపేదెవరు?

అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు.

Updated : 28 Jun 2023 05:08 IST

రూ.10 కోట్ల భూమిని కబ్జా చేసిన వైకాపా నాయకులు
పక్క స్థలం ఆక్రమణకు పావులు
మీనమేషాలు లెక్కిస్తున్న యంత్రాంగం
ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ:

గుట్టను ఆక్రమించి మామిడి మొక్కలు నాటిన దృశ్యం

అది ఓ గుట్ట. చిత్తూరు నగరంలో జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. రూ.10 కోట్ల విలువైన భూమిపై స్థానిక వైకాపా నాయకులు కన్నేశారు. కబ్జా చేసి మామిడి మొక్కలు నాటినా అడగాల్సిన, అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం కళ్లప్పగించి చూస్తుందే తప్ప చర్యలు తీసుకోవడానికి మాత్రం సాహసం చేయలేదు. ఉన్నతాధికారులైనా రంగంలోకి దిగి కబ్జాకు గురైన గుట్టను ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు.

చిత్తూరు నగరానికి సమీపం నుంచే రెండు జాతీయ రహదారులు వెళుతుండటం, మరో రెండు ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం చురుగ్గా సాగుతుండటంతో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ప్రజలు ఒక ప్లాటు కొనుగోలు చేయాలన్నా అప్పటివరకూ కష్టపడి సంపాదించిన డబ్బుతోపాటు రుణం తీసుకోవాల్సి వస్తోంది. అదే అధికార పార్టీ నాయకులు చమట చుక్క చిందించకుండానే ఎకరాల కొద్దీ భూములను హస్తగతం చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ గుట్ట, మేత, ప్రభుత్వ స్థలాలను ఆగమేఘాలపై గుర్తించి రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలో మామిడి మొక్కలు నాటేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి తంతే చిత్తూరు మండలంలో జరిగింది.

కంచె వేసేందుకు యత్నాలు

సదరు గుట్ట దాదాపు ఎనిమిది ఎకరాల్లో విస్తరించగా మొదట ఓ వైకాపా నేత నాలుగు ఎకరాలు ఆక్రమించాడు. దాని చుట్టూ కంచె వేసేందుకు రాతి కూసాలు కూడా పాతారు. పొక్లెయిన్లతో ఆ ప్రాంతాన్ని చదును చేసిన తర్వాత మామిడి మొక్కలు గుట్టపై మామిడి మొక్కలు నాటారు. వాటికి నీటి సదుపాయం కల్పించేందుకు కింద నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ సైతం ఏర్పాటు చేశారంటే ఆక్రమణల విషయంలో అధికార పార్టీ నాయకులు ఎంత పకడ్బందీగా ముందుకు కదులుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడంటే..

చిత్తూరు సమీపంలోని తేనెబండ రెవెన్యూ పరిధిలో చెర్లోపల్లి పంచాయతీ కమ్మపల్లి విద్యుత్తు ఉప కేంద్రం పక్కనున్న గుట్టను స్థానిక వైకాపా నేతలు ఆక్రమించుకున్నారు. చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూమిని  ఆక్రమించకూడదని స్థానికులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా అక్రమార్కులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.  

కలెక్టర్‌, జేసీ పదేపదే హెచ్చరిస్తున్నా..

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ, మేత, పొరంబోకు ఆక్రమణలు జరగకుండా చూడాలని తహసీల్దార్లను పదేపదే కలెక్టర్‌ షన్మోహన్‌, జేసీ శ్రీనివాసులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదులు చేయించి ఆయా స్టేషన్లలో క్రిమినల్‌ కేసులు కట్టించాలని ఆదేశిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇంత సీరియస్‌గా ఉన్నా చిత్తూరు మండలంలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది మాత్రం నిర్లిప్తంగా ఉండటంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమా? లేదంటే స్థానికంగా ఉన్న అధికారులు, సిబ్బందికే తెలిసే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇంతటితో ఆగేలా లేరు..

జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో గుంట రూ.15 లక్షలకుపైగా పలుకుతోందని స్థానికులు అంటున్నారు. ఈ లెక్కన దాదాపు రూ.10 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని చెబుతున్నారు. కొంతకాలం తర్వాత మిగతా ప్రాంతాన్నీ స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. దీన్ని కూడా కలుపుకొంటే సుమారు రూ.20 కోట్ల భూమికి రెక్కలు వచ్చినట్టే.

మొక్కల కోసం ఏర్పాటు చేసిన కుళాయి

కఠిన చర్యలు తీసుకుంటాం

చిత్తూరు మండలంలో భూ ఆక్రమణలు జరిగితే అడ్డుకోవాలని స్థానిక వీఆర్వోలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చెర్లోపల్లి పంచాయతీలోని ఆక్రమణలపై కూడా విచారిస్తాం.

కిరణ్‌, తహసీల్దారు, చిత్తూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు