logo

దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్‌ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్‌ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.

Updated : 28 Mar 2024 04:50 IST

ప్రజాగళం బహిరంగ సభల్లో ధ్వజమెత్తిన తెదేపా అధినేత చంద్రబాబు

వెంకటేగౌడ వైరస్‌కు మందు అమరనాథరెడ్డి

నగరి నియోజకవర్గం అంతటా అరాచకం

 పలమనేరులో ప్రసంగిస్తున్న చంద్రబాబు


 ఎమ్మెల్యే చెవిరెడ్డి  గ్రామస్థుల చేరిక

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్‌ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్‌ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.
‘పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రజలకు సేవ చేయకున్నా బాగా దండుకున్నారు. ఇసుక తవ్వి బెంగళూరు పంపారు. ఏ పని చేయాలన్నా 15శాతం కమీషన్లు తీసుకున్నారు. రూ.5 కోట్ల విలువ చేసే శివాలయం భూమి మాయం చేశారు. మసీదులూ కొట్టేసే ప్రబుద్ధుడు. విలువైన భూములు వైకాపా నేతలు కొట్టేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే మీ ఇల్లు కబ్జా చేసి విద్యుత్తు బిల్లు మీకే పంపిస్తారు.

  పుత్తూరులో..

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావాలంటే అమరనాథరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెంకటేగౌడ వైరస్‌కు మందు అమరనాథరెడ్డి అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అమరనాథరెడ్డి కుటుంబం రాజీలేని పోరాటం చేసిందని.. అందుకే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పలమనేరులో రావాలని ఆకాంక్షించారు. పలమనేరులో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘అమరనాథరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 33 ఎకరాల్లో మోడల్‌ మార్కెట్‌ పూర్తి చేస్తామన్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తెదేపా హయాంలో వి.కోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా ఉర్దూ కళాశాల మంజూరు చేస్తూ జీవోలు, నిధులు ఇచ్చినా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆక్షేపించారు. కౌండిన్య నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే భూగర్భజలాలు పెరుగుతాయని 11 ఇవ్వగా.. వాటికి కూడా అధికార పార్టీ నేతలు అడ్డుపడ్డారన్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఈనాడు-తిరుపతి: నగరి నియోజకవర్గం అంతటా అరాచకం చేస్తున్నారని మంత్రి రోజాను ఉద్దేశించి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం పుత్తూరులో ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా తన వద్ద రూ.40 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపించిన  బాధితురాలు భువనేశ్వరితో చంద్రబాబు మాట్లాడారు.  
‘పవర్‌లూమ్స్‌ కార్మికులకు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని ఇదే వేదిక నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చి నిలబెట్టుకోలేదు. మాట తప్పిన సీఎం తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా. చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా. గతంలోనూ రాయితీ ఇచ్చి నేనే ఆదుకున్నా. నా మాట నిలబెట్టుకుంటా. చేనేత కార్మికులను ఆదుకుంటా’ అని వెల్లడించారు. పారిశ్రామికంగా వడమాలపేట అభివృద్ధికి 150 ఎకరాలు ఇచ్చామని తెలిపారు. నగరిలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం. నగరి, పుత్తూరుల్లోని వేసవి నీటి ట్యాంకులకు నీళ్లు రావడం లేదు. వీటిని పూర్తి చేస్తా’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: దగ్గుమళ్ల

రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపా అధినేత చంద్రబాబు  పరిపాలనా అనుభవం అవసరమని తెదేపా-భాజపా-జనసేన ఉమ్మడి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు బాగోలేవన్నారు. అప్పులతో ఏపీ అభివృద్ధి వెనుకంజలో పయనిస్తోందని, రౌడీయిజం పెరగడంతో శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదన్నారు. పలమనేరులో పట్టు పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తానని, కైగల్‌ నుంచి తాగునీటి సరఫరా కోసం చర్యలు చేపడతానని పేర్కొన్నారు.

పరిశ్రమలు తెస్తాం..

‘నిండ్ర నేటమ్స్‌ చక్కెర కర్మాగారం బకాయిలు చెల్లిస్తామని జగన్‌ మోసం చేశారు. వారికి న్యాయం చేసి చక్కెర కర్మాగారాన్ని ఎలా పునరుద్ధరించాలో పరిశీలిస్తాం. విజయపురం మండలంలో ఏపీఐఐసీ కోసం 1,500 ఎకరాలు భూమి ఇచ్చాం. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ, ఉద్యోగం రాలేదు. చెన్నైకి 60 కి.మీ.ల దూరంలో పారిశ్రామికవాడ ఉంది.  టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసి యువత చెన్నై పోకుండా ఇక్కడే ఉపాధి కల్పిస్తాం’ అని చంద్రబాబు భరోసా కల్పించారు.


‘నగరిలో ఒక జబర్దస్త్‌ ఎమ్మెల్యే ఉంది. నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తామని భువనేశ్వరి అనే మహిళ వద్ద రూ.40 లక్షలు తీసుకున్న ఆమెకు మళ్లీ ఓట్లు వేస్తారా? నగరి, తిరుపతి ఎమ్మెల్యేలు  పాదిరేడు అరణ్యాన్ని దోచుకున్నారు.  ‘వేణుగోపాల్‌సాగర్‌ ఆగిపోయింది. హంద్రీ-నీవా నిలిచిపోయింది. దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని