logo

నిజాలు చెబితే తాఖీదులు

‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్‌లోడ్‌ చేస్తే షోకాజ్‌ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.

Published : 27 Apr 2024 02:37 IST

26 మంది ఎంఈవోలు, 214 మంది హెచ్‌ఎంలకు నోటీసులు
ఉన్నతాధికారి తీరుపై సంఘాల ఆగ్రహం

డీఈవో దేవరాజుకు వినతి పత్రం అందజేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ‘ఎప్పుడూ సత్యం పలుకవలెను, అబద్ధాలు చెప్పరాదు’ అంటూ విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజాలు అప్‌లోడ్‌ చేస్తే షోకాజ్‌ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఐటీఐ సెల్‌లోని ఓ అధికారి వ్యవహార శైలిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూడైస్‌ అప్‌లోడ్‌లో జాతీయ స్థాయిలో రాష్ట్ర ర్యాంకు దిగజారిపోవడంతో సంబంధిత ఉన్నతాధికారుల కడుపుమంటకు క్షేత్రస్థాయిలో ఎంఈవోలు, హెచ్‌ఎంలను బలి చేస్తున్నారు. చివరికి ఉపాధ్యాయులతో అబద్ధాలు చెప్పించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఉన్న 31 మంది ఎంఈవో-1, 2లలో.. 26 మంది ఎంఈవోలు-2, 214మంది హెచ్‌ఎంలకు డీఈవో దేవరాజు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించడం కలకలం రేపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా అన్ని మౌలిక సౌకర్యాలు ఉన్నాయని ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ(యూడైస్‌)లో అప్‌లోడ్‌ చేయని ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. మొదట షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ సమాధానాలపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పాఠశాలల్లో ఇంటర్నెట్‌, మరుగుదొడ్లు, కుళాయిలు తదితర సౌకర్యాలు లేవని యూడైస్‌లో నమోదు చేసినందుకే నోటీసు అందుకోవాల్సి వచ్చింది. అక్కడ లేకపోయినా ఉన్నట్లు ఎందుకు నమోదు చేయలేదని జిల్లా విద్యాశాఖ వివరణ కోరింది. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థుల ప్రవేశాలు పూర్తిచేశాక వారి సంఖ్య, సౌకర్యాల కల్పన తదితర వివరాలతో సంబంధిత హెచ్‌ఎం యూడైస్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ డిసెంబరులోనే పూర్తయినా వాటిని పరిశీలించి లోపాలు చెప్పని విద్యాశాఖ.. తాజాగా నోటీసులు జారీ చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. యూడైస్‌లో క్రిటికల్‌ ఇండికేటర్స్‌ తప్పుగా నమోదు చేసినందుకు ఎంఈవో-2లు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్‌ంఎలకు తాఖీదులు జారీ చేశారు. నిజాలు దాచిపెట్టి అబద్ధాల వివరాలు అప్‌లోడ్‌ చేయని వారిపై చర్యలు తీసుకోండి లేకుంటే.. జిల్లా అధికారులపై చర్యలు తప్పవని ఐటీసెల్‌లోని రాష్ట్ర అధికారి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే తమకు ప్రయోజనాలు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల వేళ వారిని తమవైపు తిప్పుకొనేందుకే ఇలా నోటీసుల జారీ ఎత్తుగడ అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

వారిని బాధ్యులను చేస్తారా..?

ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలపై ఉన్నది ఉన్నట్లు యూడైస్‌లో నమోదుచేసిన ఎంఈవోలు, హెచ్‌ఎంలను ఎలా బాధ్యులు చేస్తారని ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నాయి. శుక్రవారం డీఈవో దేవరాజుకు ఎస్టీయూ, ఎంఈవో-2ల, ఫ్యాప్టో సంఘం నాయకులు వినతి పత్రాలు అందజేశారు. బేషరతుగా జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు సిద్ధమవుతామని నాయకులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు