logo

వైకాపాకే వంతపాడిన యంత్రాంగం

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ  ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు.

Published : 27 Apr 2024 02:36 IST

అధికార పార్టీ నేతల రాళ్ల దాడి ఘటనలో.. తెదేపా కార్యకర్తలపై కేసులు
అందులోనూ కుట్ర కోణం!

వంద మీటర్ల నిబంధన దాటి వచ్చి మరీ రాళ్లు విసిరిన వైకాపా కార్యకర్తలు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ  ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం వైకాపాకే వంత పాడుతున్నారు. వైకాపా, తెదేపాలు పరస్పరం దాడి చేసుకున్నా తెదేపా శ్రేణులపైనే కేసులు నమోదు చేయడం, అందులోనూ కుట్ర కోణం దాగి ఉండటాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. చంద్రగిరి తెదేపా, వైకాపా అభ్యర్థులు పులివర్తి నాని, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల నామినేషన్ల సందర్భంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో తెదేపా కార్యకర్తలపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ శ్రేణులు రెచ్చగొట్టేలా వ్యవహరించి మొదట రాళ్ల దాడికి పాల్పడినా వారిలో ఒక్కరిపైనా కేసు నమోదు చేయలేదు. వంద మీటర్ల నిబంధనలను దాటి కార్యాలయ గేటు వద్దకు చొచ్చుకొచ్చి గందరగోళం సృష్టించి భయాందోళనలు రేకెత్తించారని, పోలీసులు, సిబ్బంది విధులకు అడ్డుతగిలారని.. 144 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ గుంపులుగా వచ్చారని చంద్రగిరి తహసీల్దారు మారుతి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

పోలింగ్‌ రోజు అడ్డుకునేందుకా?: ఆందోళన ఘటనలో తెదేపాకు చెందిన వారిపైనే కేసులు పెట్టడం.. ఎవరు, ఎంతమంది అని వెల్లడించకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై తెదేపా వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాటిని అడ్డంపెట్టుకుని పోలింగ్‌ రోజున బయటకు రాకుండా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నాయి. ప్రధానమైన వ్యక్తులను ఈ కేసులో ఇరికించేందుకే అలా కేసు కట్టారంటున్నారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు