logo

ఏం జరుగుతోంది భగవం‘తుడా’!

తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

Updated : 29 Apr 2024 06:42 IST

చెవిరెడ్డి జమానాగా మారిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ
రూ.వందల కోట్ల లావాదేవీలన్నీ రహస్యమే

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఈ ఐదేళ్లలో సొంత జమానాగా మారిపోయిన తుడాలో అసలేం జరుగుతోందన్న ప్రశ్న అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారుల మెదళ్లను తొలిచేస్తోంది. రూ.వందల కోట్ల పందేరం అక్కడో అంతుచిక్కని రహస్యం.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తుడా ఛైర్మన్‌గా పీఠమెక్కిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదనంతరం దాన్ని ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డికి కట్టబెట్టారు. మాకు మంత్రి పదవులొద్దు.. ఇంకేమీ వద్దు.. తుడా చాలన్నట్లు వ్యవహరించారు.. ఐదేళ్లపాటు తండ్రీకుమారుల పాలనలో రూ.వందల కోట్ల నిధులు దారి మళ్లాయనేది ప్రధాన ఆరోపణ. అందుకు అనుగుణంగానే సంస్థకు సంబంధించిన ప్రతి వ్యవహారం రహస్యంగా సాగింది. వాటిని ఇప్పటికిప్పుడు ఛేదించడం అసాధ్యమని తెలిసినా తెలుసుకోవాలనే ఆత్రుత మాత్రం అందరి మదిలో ఉంది.

భూములమ్మిన సొమ్ములేవీ?

తుడా కోసం ప్రభుత్వం కేటాయించిన భూములన్నీ దాదాపు విక్రయించేశారు. సూరప్పకశం వద్ద 195 ఎకరాలు, జగనన్న టౌన్‌షిప్‌లో ప్లాట్ల విక్రయంతో రూ.430 కోట్లు సమకూరాయి. ఇందులో రూ.13 కోట్ల వరకు నాలుగు నియోజకవర్గాలకు కేటాయించారు. మిగిలిన నిధులు ఏమయ్యాయో మరి!

తుడా జీతంతో చెవిరెడ్డి సేవలో

తుడా జీతం తీసుకుంటున్న 25 మందికి పైగా ఉద్యోగులు చెవిరెడ్డి వ్యక్తిగత సేవలో తరిస్తున్నట్లు సమాచారం. ఒప్పంద విధానంలో రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనంతో నియమించుకున్న వారంతా తుడా కార్యాలయంలో భూతద్దం వేసి వెతికినా కనిపించరు.  చెవిరెడ్డి తాయిలాల పంపకం, ఎన్నికల ప్రచారం, వ్యూహ రచనలు చేయడం వంటి విధుల్లో వారు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో వాహనాలు వాడుతున్నారు.

అతిథిగృహానికి నెలకు రూ.లక్షల్లో..

తుడా పేరిట తిరుమలలోని ఓ అతిథిగృహాన్ని తితిదే నుంచి అద్దె ప్రాతిపదికన పొందినట్లు తెలుస్తోంది. ప్రతినెలా దీనికి అద్దె, నిర్వహణకు రూ.1.30 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఈ  అతిథిగృహం పూర్తిగా చెవిరెడ్డి  వ్యక్తిగతం. ఇందుకు నాలుగేళ్లుగా తుడా నిధులు వెచ్చిస్తున్నారు.

చివరకు జీతాలకూ అప్పుచేసే దుస్థితి

తుడా ఆదాయం గతంలో రూ.10-20 కోట్లు మాత్రమే ఉండేది. ప్రభుత్వం కేటాయించిన భూముల్ని తెగనమ్మడం.. పద్మావతినగర్‌, వేదాంతపురం, మామండూరు, మంగళం తదితర ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లు విక్రయించడం ద్వారా తుడా ఆస్తులు తరిగిపోయినప్పటికీ ఆదాయం మాత్రం అమాంతం పెరిగింది. అందుకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా పెంచారు. నిధులన్నింటినీ సొంత నియోజకవర్గానికి మళ్లించడంతో ఖజానా సైతం ఖాళీ అయిందని చెబుతున్నారు. ప్రస్తుతం తుడా నిర్వహణ, జీతాల చెల్లింపుల కోసం బ్యాంకుల ఓవర్‌ డ్రాప్ట్‌(ఓడీ) కోసం యత్నిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంత అభివృద్ధి జరిగిందా?

తుడా నిధులన్నీ చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించినట్లు విమర్శలున్నాయి. మొక్కల పంపిణీ, 22 వేల వరకు బెంచీల వితరణ, రూ.12-20 లక్షల విలువైన సమావేశ మందిరాల నిర్మాణం, వైద్య శిబిరాల నిర్వహణ, తుమ్మలగుంటలో క్రీడా మైదానం ఏర్పాటు, చెరువుల ఆధునికీకరణ, శ్మశానాల్లో సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రిసెప్షన్‌ సెంటర్లు, సీసీ రోడ్ల నిర్మాణం వంటివి చేపట్టినట్లు సమాచారం. ఇన్ని నిధులు వెచ్చించినా తిరుపతి గ్రామీణ, రామచంద్రాపురం మండలాల్లో రెండేళ్ల కిందట తెగిన వంతెనలకు కనీసం మరమ్మతులు చేయలేకపోయారు. పెద్ద ఎత్తున నిధులు నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీడీవో, పంచాయతీరాజ్‌ అధికారుల ఖాతాలకు జమ చేసినట్లు సమాచారం.  అయితే ఇప్పటివరకు వాటిని సద్వినియోగం చేసుకున్నట్లు యూసీలు సమర్పించలేదన్నది వాస్తవం. రూ.వందల కోట్ల అభివృద్ధి పనులకు చెవిరెడ్డి కుటుంబ సభ్యులే గుత్తేదారులన్న విమర్శలు సైతం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని