logo

పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు

పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్‌ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి..

Published : 02 May 2024 05:35 IST

పండు టాకులపై జగన్‌ సర్కారు కక్ష
ఉదయం నుంచే పింఛనుదారుల నిరీక్షణ
బుధవారం సాయంత్రానికి ఖాతాల్లో జమ
హడావుడిగా బ్యాంకు మిత్రలతో పంపిణీ

జన్నావాళ్లమిట్టలో  పింఛను పంపిణీ చేస్తున్న బ్యాంకుమిత్రలు

  • పింఛను ఎప్పుడిస్తారో తెలియక, సరైన సమాధానం చెప్పేవారు లేక బుధవారం ఉదయమే పెనుమూరులోని సచివాలయం వద్దకు పలువురు వృద్ధులు, దివ్యాంగులు చేరుకుని నిరీక్షించారు.
  • పింఛను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారన్న సమాచారంతో బ్యాంకులకు సెలవని తెలియక పుంగనూరు స్టేట్‌ బ్యాంకు వద్ద పలువురు పింఛనుదారులు బుధవారం ఉదయం నిరీక్షించారు.
  • కుప్పంలో సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. సిబ్బంది వచ్చాక బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని, ఖాతాలు లేని వారికి ఇంటి వద్దనే ఇస్తారనడంతో వారు వెనుదిరిగారు.
  • యాదమరి మండలం కాశిరాళ్ల సప్తగిరి గ్రామీణ బ్యాంకులో పింఛను సొమ్ము జమ చేయడంతో, బ్యాంకుకు సెలవు ఉన్నా వెంటనే పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించడంతో బ్యాంకుమిత్రలు నగదు తీసుకుని గ్రామాల్లో ఆధార్‌, బయోమెట్రిక్‌ విధానంతో పంపిణీ చేశారు.

పింఛన్ల పంపిణీలో విధానం మారినా వైకాపా ప్రభుత్వ తీరు మాత్రం మారలేదు.. ఎలాగోలా పింఛన్లు ఆలస్యం చేసి ఆ అపవాదును ప్రతిపక్షాలపై నెట్టాలనే కుట్రతో ఈ ప్రక్రియలను ప్రభుత్వం నానాటికీ ఆలస్యం చేస్తోంది.. గత నెల గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేసి మండుటెండలో అవ్వాతాతలు, దివ్యాంగులను అష్టకష్టాలు పెట్టిన వైకాపా సర్కారు.. ఇప్పుడు వారి కష్టాన్ని మరింత రెట్టింపు చేసింది.

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే:పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్‌ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. బుధవారం జిల్లాలో 63,500 మందికి (80 శాతం) పంపిణీ చేశారు. పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాల్లో బుధవారం సాయంత్రానికి నగదు జమ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఉన్నపళంగా బ్యాంకుమిత్రలను గ్రామాలకు పంపిణీ ఖాతాల్లోని పింఛను, ఆధార్‌ సంఖ్య నమోదు చేసి, బయోమెట్రిక్‌ విధానంతో హడావుడిగా నగదు పంపిణీ చేశారు. ఈ విషయం తెలియక బుధవారం ఉదయం నుంచే పలువురు వృద్ధులు, దివ్యాంగులు సచివాలయాలకు వెళ్లారు. నగదు బ్యాంకు ఖాతాల్లోకే జమవుతుందని సిబ్బంది చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు.

నడవలేని తనకెందుకు ఇవ్వరు

ఈమెను చూస్తేచాలు బ్యాంకుకు వెళ్లి పింఛను సొమ్ము తెచ్చుకునే స్థితిలో ఉందో లేదో తెలుస్తుంది. ఐరాల మండలం ఇరువారం గ్రామానికి చెందిన సరోజ వృద్ధాప్య పింఛను కోసం గ్రామంలోని సచివాలయం వద్దకు కష్టపడి వెళ్తే బ్యాంకులో వేశామని తెలిపారు. దీంతో ఆమె తనకు బ్యాంకు బుక్‌ లేదని, బ్యాంకులో వేస్తే ఎలా తెచ్చుకోవాలని రోదించింది.

సచివాలయాలకు పరుగులు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: పింఛను నగదు కోసం వృద్ధులు, వితంతువులకు అవస్థలు తప్పలేదు. లబ్ధిదారులు స్థానిక సచివాలయాల వద్దకు బుధవారం పరుగులు తీశారు. కార్యాలయం తెరవకముందే సచివాలయాల వద్దకు వృద్ధులు చేరుకున్నారు. వారిని వెనక్కి పంపకుండా పింఛన్లు ఇచ్చామని చప్పిడిపల్లె, లక్కనపల్లె సచివాలయ ఉద్యోగులు సమాధానమిచ్చారు. బ్యాంకు ఖాతాలు కల్గిన లబ్ధిదారులు కూడా సచివాలయానికి రావడంతో వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో మీరు బ్యాంకుకెళ్లి పింఛను తీసుకోవాలని వెనక్కి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని