logo

బాబు భరోసా.. జగన్‌ రుసురుస

ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్‌ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు.

Updated : 07 May 2024 07:16 IST

తెదేపా హయాంలో వరుస కట్టిన కంపెనీలు
ఆ అక్కసుతో తరిమికొట్టిన ముఖ్యమంత్రి
వైకాపా పాలనలో పరిశ్రమల ఏర్పాటుకు సంస్థల వెనకడుగు
ఈనాడు-తిరుపతి, చిత్తూరు  

ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్‌ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. నాడు బాబు హయాంలో పరిశ్రమ స్థాపన కోసం ముందుకు వచ్చిన పలు సంస్థలు వైకాపా హయాంలో వెనుదిరిగాయి. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి.

తెదేపా హయాంలో భళా

టీసీఎల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న నాటి సీఎం చంద్రబాబునాయుడు (పాతచిత్రం)

రాష్ట్ర విభజన తర్వాత విపత్కర సమయంలో చంద్రబాబు తిరుపతి కేంద్రంగా మధ్య, భారీ తరహా పరిశ్రమలు తెచ్చారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శ్రీవేంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌(ఈఎంసీ-1)కి 2015 అక్టోబరులో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా చంద్రబాబు శంకుస్థాపన చేయించారు. ఇక్కడ సెల్‌కాన్‌, కార్బన్‌ వంటి పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పక్కనే ఈఎంసీ-2ని తీసుకువచ్చారు. ఇక్కడ డిక్సన్‌, మునోత్‌ వంటి అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.

శ్రీసిటీ పరిధిలోని చిన్నపాండూరు పరిధిలో రూ.1800 కోట్ల పెట్టుబడితో అపోలో టైర్స్‌ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అనేక అడ్డంకులు వచ్చినా  అధిగమించారు.

విమానాశ్రయం సమీపంలోని వికృతమాల పరిధిలో 158 ఎకరాల్లో టీసీఎల్‌ సంస్థకు 2018 డిసెంబరులో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.2200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పరిశ్రమలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి.

డిక్సన్‌ పరిశ్రమలో తొలి ఉత్పత్తిని నాటి సీఎం చంద్రబాబుకు అందజేస్తున్న సిబ్బంది (పాతచిత్రం)

సత్యవేడు పరిధిలోని మాదన్నపాలెంలో 632.96 ఎకరాల్లో హీరో మోటార్స్‌ పరిశ్రమ ఏర్పాటు చేశారు.  రూ.1600 కోట్ల పెట్టుబడితో ద్విచక్ర వాహనాలు, వాటి విడి భాగాలు తయారవుతున్నాయి.  2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండేళ్లకు హీరో మోటార్స్‌ సంస్థ తమ తొలి ఉత్పత్తిని బయటకు తెచ్చింది.

ఉపాధి అవకాశాలిలా..

తెదేపా హయాంలో ఏర్పాటైన ఈఎంసీ-1, 2, ఇతర పరిశ్రమల్లో 60 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.


వైకాపా జమానాలో ఢీలా..

హిల్‌టాప్‌ సెజ్‌కు భూమిపూజ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ (పాతచిత్రం)

  • శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఇనలగూరులో అపాచీ సంస్థ రూ.800 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు చేసేందుకు 2022 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభంకానుందని చెప్పారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.
  • చిల్లకూరు మండలం మన్నెగుంట ప్రాంతంలో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 2021లో సుమారు 860 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ సుమారు రూ.7500 కోట్ల పెట్టుబడితో 2500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు భూమి ఏపీఐఐసీ పేరుతో మ్యుటేషన్‌ కాలేదు. దీంతో ఇక్కడ పరిశ్రమ స్థాపన జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
  • వికృతమాల పరిధిలో చంద్రబాబు హయాంలో రిలయన్స్‌ సంస్థ భారీ పెట్టుబడులతో పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చింది. ఇందుకోసం సుమారు 130 ఎకరాలు కేటాయించారు. అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమ ఏర్పాటు కాకుండా వెనుదిరిగింది.
  • ఈఎంసీ-2 పరిధిలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటుకు పరిశ్రమలు ముందుకు రాలేదు. పారిశ్రామికవేత్తలపై తమకు అనుకూలమైన వ్యక్తులకు పనులు కేటాయించాలన్న ఒత్తిళ్లతోపాటు ప్రభుత్వ విధానంతో పరిశ్రమ స్థాపన ఆలస్యం చేస్తూ వచ్చారు.

అపాచీ సంస్థకు కేటాయించిన భూమి వద్ద ప్రస్తుత పరిస్థితి

ఉపాధి గల్లంతిలా..

ఉమ్మడి జిల్లాలోని ఎలక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తితో 30 వేల మందికి నేరుగా, మరో 60 వేల మందికి వివిధ మార్గాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగ యువత ఉపాధి కోసం చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిక్సిన్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి తదితరులు

వైకాపా హయాంలో పట్టించుకుంటేగా..

గంగవరం మండలం గండ్రాజుపల్లి పారిశ్రామికవాడలో కుర్లాన్‌ సంస్థ పరుపుల పరిశ్రమ  స్థాపించేందుకు తెదేపా హయాం లో ముందుకొచ్చింది. 2017లో 65 ఎకరాలు కేటాయించగా రూ.500 కోట్ల పెట్టుబడితో 1,250 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. అనంతరం స్థల వివాదం వచ్చింది. దీని పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ కనీసం ప్రయత్నించకపోవడంతో ప్రతిపాదన దశకే పరిమితమైంది.

ఎనిమిది సంస్థల నిరాసక్తత

కుప్పం నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని తెదేపా హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. పరిశ్రమల స్థాపనకు భూసేకరణ కోసం అధికారులను పరుగులు పెట్టించారు. రూ.3వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బ్రిటానియా, ఆదిత్యా బిర్లా, వైష్ణవి మెగా ఫుడ్‌పార్క్‌, తిరుపూర్‌ గార్మెంట్స్‌ వంటి ఎనిమిది సంస్థలు ఆసక్తి చూపాయి. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చలేదు.

ఎయిర్‌స్ట్రిప్‌ ఊసు మరచి..

ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతి చేసేందుకు శాంతిపురం మండలం రామాపురం వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ నిర్మాణానికి 2019 జనవరిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో భూములు సేకరించి కొందరు రైతులకు పరిహారం ఇచ్చారు. జగన్‌ పాలనలో  ఎయిర్‌స్ట్రిప్‌ గురించి పట్టించుకోలేదు.

పరిశ్రమ తెలంగాణకు..

తెదేపా హయాంలో గంగవరం పారిశ్రామికవాడలో రూ.727 కోట్లతో టెక్రాన్‌ సంస్థ బ్యాటరీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. వైకాపా వచ్చిన తర్వాత అది తెలంగాణకు వెళ్లిపోయింది.

శంకుస్థాపనలతో సరి..

  • పుంగనూరు మండలం ఆరడిగుంట వద్ద రూ.165 కోట్లతో ఫెర్రో అల్లాయ్‌ పరిశ్రమకు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి శంకుస్థాపన చేసినా ఉత్పత్తి దిశగా అడుగులు పడలేదు.
  • సుగాలిమిట్ట వద్ద రూ.57 కోట్లతో జిక్సిన్‌ సంస్థ పెట్టుబడులు పెడుతుందని భూమిపూజ చేశారు. పుంగనూరులో రూ.4,640 కోట్లతో జర్మనీకి చెందిన పెప్పర్‌ మోషన్‌ సంస్థ విద్యుత్తు బస్సులు, ట్రక్కులు తయారు చేసేందుకు ముందుకొచ్చిందని ప్రగల్బాలు పలికారు. ఈ రెండింటికీ మోక్షం కలుగలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని