logo

సూపర్‌-6తోనే సామాజిక న్యాయం..!

అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్‌-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు.

Published : 10 May 2024 03:04 IST

కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు
అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు
తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు
‘ఈనాడు’తో తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు

ఈనాడు-తిరుపతి: అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సూపర్‌-6 పేరుతో చంద్రబాబు ప్రజల ముందుకు రాగా.. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రతిపాదించిన అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. వీటికి తోడుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు సహకారంతో రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపిస్తామని తిరుపతి భాజపా ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 50 ఏళ్లు నిండిన అర్హులకు పింఛన్లు అందిస్తామన్నారు. రూ.4 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచే అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు, పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి రూ.15 వేలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక బాధితులకు రూ.10 వేలు ఇస్తామన్నారు. చంద్రబాబు నేతృత్వంలో పవన్‌కల్యాణ్‌ సలహాల మేరకు మోదీ సహకారంతో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.

మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు

గతంలో అమృత్‌ పథకం కేంద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి ఇచ్చేవారు. నాకున్న ఐదు మున్సిపాలిటీల్లో ఏదో ఒక పథకంద్వారా వీటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాను. కేంద్రం నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాను.

రాయలసీమపై ప్రత్యేక దృష్టి..

రాయలసీమలో తాగు, సాగు నీటితోపాటు వైద్యసదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. రాయలసీమను ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం. సీమలోని కీలక పట్టణాలను అనుసంధానం చేస్తూ పారిశ్రామిక క్లస్టర్‌గా తీర్చిదిద్దుతాం.

ఉద్యోగులకు అండగా..

ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన నాకు ఉద్యోగుల సమస్యలు తెలుసు. కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్‌/జీపీఎస్‌ను పునఃసమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తాం. ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లిస్తాం. తక్కువ జీతాలు పొందే పొరుగు, ఒప్పంద ఉద్యోగులకు పథకాలు వర్తింపజేస్తాం.

కార్పొరేషన్లకు నిధులు...

అన్ని సామాజిక వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తాం. కాపుల సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ.15వేల కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి చర్యలు చేపడతాం. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయిస్తాం. కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. కమ్మ, రెడ్డి, వెలమ, ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించి సాధికారత, అభివృద్ధికి చర్యలు చేపడతాం.

కార్మికులకు ప్రత్యేకంగా..

చేనేత కార్మికుల కోసం పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తాం. మత్స్యకారులకు విఘాతంగా ఉన్న 217 జీవో రద్దు చేస్తాం. డ్రైవర్లను యాజమానులుగా చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు రూ.4లక్షల వరకు పొందే రుణాలపై ఐదు శాతం పైబడిన వడ్డీ రాయితీ అందిస్తాం. బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి ఆటో, ట్యాక్సీ, హెవీ లైసెన్సు కలిగిన ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్లకు ఏటా రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తాం. వాహనాలపై పెంచిన గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గిస్తాం. భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరిస్తాం.

ప్రణాళికతో తిరునగరి అభివృద్ధి..

తిరునగరిని స్మార్ట్‌ సిటీగా చేసేందుకు కృషి చేస్తాను. తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు తీసుకొస్తాం. రేణిగుంట-తిరుపతి రైల్వే సబ్‌వేల ఏర్పాటుకు కృషి చేస్తాను. నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే ట్రాక్‌ పూర్తి చేస్తాం. సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు పూర్తి చేస్తాం. పౌర సమాజంతో కమిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తాను. పులికాట్‌ సరస్సుపై లక్ష కుటుంబాలు ఆధారపడ్డారు. ముఖద్వారాలు తొలి ఏడాదిలోనే తెరిపిస్తా. పక్షుల శరణాలయం అటవీ ఆంక్షలను తొలగించి రహదారులు ఏర్పాటు చేస్తాం. వాకాడులో వనపాలెం నుంచి నవాబ్‌పేట వరకు షార్‌ నుంచి కొన్ని కుటుంబాలను తీసుకువచ్చి అక్కడ పెట్టారు. వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

అర్హులందరికీ పింఛన్లు..

50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు రూ.4 వేలు పింఛన్లు అందిస్తాం. సబ్‌ప్లాన్‌ నిధులు వారి అభ్యున్నతికే ఖర్చు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఇమామ్‌, మౌజన్‌లకు ప్రతి నెలా రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. క్రిస్టియన్‌ మిషనరీస్‌ ప్రాపర్టీస్‌ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం. చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు, జరూసలెం యాత్రికులకు సాయం చేస్తాం.

బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడతాం..

హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు ఎండోమెంట్‌ బోర్డు ఏర్పాటు చేస్తాం. దేవాదాయశాఖ పరిధిలో కాకుండా ప్రైవేటు ఆలయాల్లో పనిచేస్తే అర్చకులకు కనీస వేతనం ఉండేలా చేస్తాం. వార్షిక ఆదాయం రూ.50వేలపైన ఉన్న ఆలయాల అర్చకులకు కనీస వేతనం రూ.15వేలకు పెంపు. అంతకంటే తక్కువ ఉంటే నెలకు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతాం. తిరుపతితో సహా అన్ని ఆలయాల్లో పూజారితోపాటు ఒక బ్రాహ్మణుడిని ట్రస్టు బోర్డు సభ్యుడిగా నియమిస్తాం. బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం నిర్మిస్తాం. వేద విద్యను అభ్యసించిన వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని