logo

ఈ ఏడాదీ అత్తెసరు వసతులేనా..!

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేసి అక్కడే ఇంటర్మీడియట్‌ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్‌ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.

Published : 23 May 2024 05:05 IST

హైస్కూల్‌ ప్లస్‌లో ఫలితాలు మైనస్‌

అల్లవరం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నత్తనడకన సాగుతున్న జూనియర్‌ కళాశాల తరగతి గదుల నిర్మాణం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేసి అక్కడే ఇంటర్మీడియట్‌ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పిన వైకాపా సర్కార్‌ వాటిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఈ పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరిన విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నాô్థÛకంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు

డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 21 మండలాల పరిధిలో జడ్పీ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేశారు. వీటిలో రెండేళ్ల క్రితం బాలికల జూనియర్‌ కళాశాలలను ప్రారంభించారు. ప్రారంభంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభించి, వీటి నిర్వహణను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించారు. కాని వారికి కావాల్సిన వసతులు కల్పించలేదు.

సౌకర్యాలు శూన్యం

హైస్కూల్‌ ప్లస్‌లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రయోగాల్లో సాధన చేసేందుకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. సమీపంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో సాధన చేయించారు. ప్రయోగ పరీక్షలను సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇతర కళాశాలల్లో నిర్వహించారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. బోధనకు సరిపడా నిపుణులైన అధ్యాపకులు లేకపోవడం, అందుబాటులో ఉన్న పీజీటీ ఉపాధ్యాయులతోనే హైస్కూల్‌ ప్లస్‌లో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. ఇవన్నీ వీరి ఉత్తీర్ణతపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో  జిల్లా వ్యాప్తంగా ఈ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం చతికలపడింది.


ఉన్నవాటిని పట్టించుకోలేదు..  మళ్లీ కొత్తవి

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 21 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా చేసి బాలికల జూనియర్‌ కళాశాలలుగా మార్పు చేశారు. వీటిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించలేక పోయారు. ఇవి చాలవన్నట్లు కో-ఎడ్యుకేషన్‌ అందించేందుకు మరో 10 కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కనీసం ఈ విద్యా సంవత్సరం అయినా పూర్తి స్థాయి వసతులు కల్పిస్తారని ఆశగా ఎదురు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులకు వైకాపా సర్కార్‌ మళ్లీ మొండి చేయే చూపనుంది. ఇప్పటి వరకు బాలికల కళాశాలల్లో వస్తున్న ఘోరమైన ఫలితాలను చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి కైనా ప్రభుత్వం హైస్కూల్‌ ప్లస్‌లో పూర్తి స్థాయి వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు.


లోపిస్తున్న ప్రణాళిక

హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలు పొందిన బాలికల విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పరీక్షల వరకు గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇంటర్‌ బోర్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్‌ కళాశాలలకు జూన్‌ 1వ తేదీ నుంచి అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రారంభం అవుతుంది. ఈలోపే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టి తరగతులు ప్రారంభిస్తారు. త్రైమాసిక పరీక్షలు, దసరా సెలవులు, అర్ద సంవత్సర పరీక్షలు, సంక్రాతి సెలవులు, ప్రీ ఫైనల్స్, ప్రాక్టికల్స్, పబ్లిక్‌ పరీక్షల అనంతరం మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుంది.ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కాని హైస్కూల్‌ ప్లస్‌లో ఉన్న బాలికల జూనియర్‌ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు కాని పరిస్థితి నెలకొంది. తరగతులు ప్రారంభం నుంచి దసరా సంక్రాంతి సెలవుల్లో వ్యత్యాసం ఉంటోంది. జూన్‌1 తర్వాత ప్రవేశాలు చేపట్టి ఆలస్యంగా తరగతులు ప్రారంభిస్తున్నారు. విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సెలవులు ఉన్న అన్ని రోజులు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నారు.దీంతో పాఠ్యాంశాలు సకాలంలో పూర్తి కావడం లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు