logo

బహిరంగ మార్కెట్‌కు తరలిన ధాన్యం

జిల్లాలో రబీ సీజన్‌లో పండిన ధాన్యం బహిరంగ మార్కెట్‌కు తరలిపోయింది. ఎన్నికల వేళ కావడంతో పౌరసరఫరాల సంస్థకు ధాన్యాన్ని విక్రయిస్తే.. డబ్బులు త్వరగా వస్తాయో.. రావోనని.. భావించిన రైతులు పండిన ధాన్యాన్ని మిల్లర్లు, మధ్యవర్తులకు అమ్మేశారు.

Published : 23 May 2024 05:14 IST

పౌరసరఫరాల సంస్థ కొన్నది 25,842 టన్నులే
మే 31తో మూతపడనున్న కొనుగోలు కేంద్రాలు
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌ 

ధాన్యాన్ని కళ్లం నుంచి సేకరిస్తున్న సిబ్బంది

జిల్లాలో రబీ సీజన్‌లో పండిన ధాన్యం బహిరంగ మార్కెట్‌కు తరలిపోయింది. ఎన్నికల వేళ కావడంతో పౌరసరఫరాల సంస్థకు ధాన్యాన్ని విక్రయిస్తే.. డబ్బులు త్వరగా వస్తాయో.. రావోనని.. భావించిన రైతులు పండిన ధాన్యాన్ని మిల్లర్లు, మధ్యవర్తులకు అమ్మేశారు. బహిరంగ మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండటం, సేకరించిన వెంటనే సొమ్ము చెల్లిస్తుండటంతో ప్రైవేటు వ్యక్తులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయిస్తే.. రవాణా, గోనె సంచుల కొరత, తేమ శాతం వంటి కొర్రీలతో  ఇబ్బంది పడలేక రైతులు బహిరంగ మార్కెట్‌ వైపు మొగ్గు చూపారు. రబీలో 75 శాతానికి పైగా సాధారణ రకం వరి విత్తనాలు సాగు చేశారు. దీనిలో  బొండాలు రకం ఎక్కువ  విస్తీర్ణంలో  పండించారు.


ప్రభుత్వం కొన్నది చాలా తక్కువ..

కాకినాడ జిల్లాలో ఏప్రిల్‌ 6 నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 214 ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో రబీలో 5 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీనిలో  1.92 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం నాటికి 14 మండలాల పరిధిలో 79 కేంద్రాల ద్వారా 25,843 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో కేంద్రాలన్నీ ఖాళీగా దర్శమిస్తున్నాయి.


అరకొర చెల్లింపులు..

జిల్లాలో ఇప్పటికి 3,068 మంది రైతుల నుంచి రూ.56.44 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరించారు. ఇప్పటికి రూ.17.25 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. చాలాచోట్ల ధాన్యం సేకరించి 21 రోజులు గడిచినా ఇప్పటికీ రైతుల ఖాతాలకు సొమ్ము జమ కాలేదు. గత ఖరీఫ్‌లో ధాన్యం సేకరించిన నాలుగు, అయిదు రోజుల వ్యవధిలోనే చెల్లింపులు చేశారు. రబీలో మాత్రం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వచ్చేనెల 1 నుంచి ఖరీఫ్‌నకు సన్నద్ధం కావాల్సి ఉంది. వైకాపా ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ, బీమా, పంట నష్టపరిహారం వంటి సాయం విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. ఇప్పుడు రబీ ధాన్యాన్ని సేకరించినా, సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.


అక్కడి  మార్కెట్‌పైనే ఆసక్తి..

సాధారణ రకం ధాన్యం 75 కేజీల బస్తాకు ప్రభుత్వం రూ.1,637 చొప్పన చెల్లిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో 75 కేజీల బస్తా రూ.1,650 పలకడంతో, వారికే విక్రయించడానికి మొగ్గు చూపారు. బొండాలు రకం ధాన్యం ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉండటంతో మిల్లర్లు, మధ్యవర్తులు వీటిని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయినా, నూకలు రవాణా చేస్తున్నారు. దీంతో బొండాలు రకం ధాన్యాన్ని మరపట్టించి, నూకలు తయారు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొండాలు రకం ధాన్యానికి మంచి డిమాండ్‌ ఉంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు బొండాలు రకం ధాన్యాం ద్వారా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్‌ రైస్‌ను ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రబీలో పండిన ధాన్యానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు కన్నా, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర ఉండటంతో రైతులు వీరికి ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. గొల్లప్రోలు, గండేపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, శంఖవరం, తొండంగి మండలల్లో సన్న రకాలు రబీలో ఎక్కువగా సాగు చేశారు. వీటికీ మార్కెట్‌లో మంచి ధర రావడంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.


నెలాఖరు వరకు  కొనుగోళ్లు
-ఎం. బాలసరస్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, కాకినాడ 

జిల్లాలో ఈనెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యాన్ని సేకరిస్తాం. ప్రతి గింజా కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ధాన్యం నిల్వలు ఉంటే సంప్రదించాలి. జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో 886903111 ఫోను నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం.  బహిరంగ మార్కెట్‌లో మంచి ధర ఉండటంతో రైతులు అక్కడ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువకు కొంటున్నారు. రైతులకు కనీస మద్ధతు ధర కల్పనకే కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నాం. సేకరించిన ధాన్యానికి వీలైనంత త్వరగా సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు