logo
Published : 30/11/2021 06:29 IST

చెరువును చుట్టేసి పట్టాగా ఇచ్చేసి


ఇటీవల పంగిడి చెరువులో యంత్రాలతో చదును చేస్తున్న వైనం

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, జగ్గంపేట, గ్రామీణం : దస్త్రాల్లో ప్రభుత్వ చెరువుగా చూపుతోంది. అధికారుల నుంచీ అది ప్రభుత్వ భూమి అనే మాట వినిపిస్తోంది. ఈ చెరువులో చేపల పెంపకానికి మత్స్యకార సొసైటీకి లీజుకు ఇచ్చి పంచాయతీకి ఆదాయం సమకూరగా.. ఈ చెరువు బాగుకు ఉపాధి నిధులూ వెచ్చించినట్లు లెక్కలున్నాయి. కానీ ఇది డి-పట్టాగా.. జిరాయితీ మెరకగా ధ్రువీకరిస్తూ రెవెన్యూ అధికారులు రాసిచ్చిన పత్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపిస్తున్నాయి.

ఏది నిజం..? రూ.కోట్ల విలువైన భూమి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నా.. అధికారులు కఠిన వైఖరి అవలంబించడం లేదు. రాజకీయం ప్రైవేటు పక్షాన చక్రం తిప్పడమే దీనికి కారణమనేది సుస్పష్టం.

ప్రభుత్వ దస్త్రాల్లో...

జగ్గంపేట మండలం రామవరంలో సర్వే నంబరు 61లో 9.19 ఎకరాల పంగిడి చెరువుగా ఉంది. ఇది ప్రభుత్వ దస్త్రాల్లో సాగుకు పనికి రానిదిగా, ఎవరి అనుభవంలో లేని ప్రభుత్వ భూమిగా ఉంది. జల వనరుల శాఖ దస్త్రాల్లో మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుగా ఉంది.

ప్రైవేటు వ్యక్తుల పత్రాల్లో...

‘సర్వేనంబరు 61లో 9.19 ఎకరాలు డి-నమూనా పట్టా రీత్యా దాట్ల సత్యనారాయణరాజుకు 1961లో దఖలు పడింది. ఆయన చనిపోగా ఆ భూమి అతని భార్య సబ్బయ్యమ్మ స్వాధీన హక్కు భుక్తంలో ఉంది. సదరు భూమి జిరాయితీ మెరక భూమి అని’ తహసీల్దారు లేఖాసంఖ్య: రిఫ్‌ (బి) 735/2008 ఇచ్చినట్లుగా ధ్రువీకరణ. ఇదే కాక, తమ పేరిట ఫెయిర్‌ అడంగల్‌ నకలు కాపీలను సుబ్బయ్యమ్మ కుటుంబీకులు చూపుతున్నారు.

మరి... ఈ కథేంటి..

? ఉపాధి పనులు చేశారు: 2010-11లో ఉపాధి హామీ.. పని సంఖ్య (వర్క్‌ కోడ్‌): 040421815017050060 కింద జల వనరులశాఖ పరిధిలో చిన్న సాగునీటి వనరు పంగిడి చెరువు సమగ్ర పునరుద్ధరణ పనులు చేపట్టారు. కూలీలతో మట్టి తవ్వించి ఉపాధి కల్పించి రూ.3,18,286 వెచ్చించి పనులు పూర్తి చేశారని ఉపాధి దస్త్రాల్లో చూపారు.

? చేపల పెంపకానికి లీజు: 1.7.2010 నుంచి 30.06.2013 వరకు పంగిడి చెరువును చేపల పెంపకానికి శ్రీకృష్ణవేణి సంజీవయ్య ఎస్సీ ఫిషర్‌మెన్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. ఈక్రమంలో అప్పటి పెద్దాపురం డీఎల్పీవో కె.పి.చంద్రశేఖర్‌ లేఖా సంఖ్య 641/2010/ఎ2, తేదీ: 20.09.2010న పంగిడి చెరువు వేలం కనిష్ఠ ధర రూ.9 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

నాయకుడి భరోసా

జాతీయ రహదారి పక్కనే పంగిడి చెరువు ఉంది. ఇక్కడ ఎకరా రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో దీని స్వరూపాన్ని మార్చి స్థిరాస్తి వ్యాపారానికి తెరలేపాలనేది కొందరి వ్యూహం. స్థానిక నాయకుడి భరోసాతో ఇటీవల పొక్లెయిన్లు రంగంలోకి దింపి చదును చేపట్టారు. ఇందుకు అనుమతులూ లేవు. స్థానిక అభ్యంతరాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదులతో పనులు ఆగాయి. ఈ భూమిలో వరి, కంది, అరటి సాగు చేయడం గమనార్హం.

అది ప్రభుత్వ చెరువే

రెవెన్యూ రికార్డుల ప్రకారం రామవరంలో పంగిడి చెరువుగా ఉంది. 9.19 ఎకరాల్లో ఉన్న ఈ చెరువు ప్రభుత్వ పోరంబోకు.. రెవెన్యూ రికార్డుల్లో మార్పులేమీ జరగలేదు. ఆక్రమించుకున్న వాళ్లు మాకు 1961 నాటి పట్టా ఉందని చూపుతున్నారు. ఈ వివాదం ఆర్డీవో పరిధిలో ఉంది. చెరువులో పనులు జరగకుండా ఆపించాం.

- సరస్వతి, తహసీల్దారు, జగ్గంపేట

రామవరంలో అన్యాక్రాంతమైన పంగిడి చెరువు

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని