logo

ఉచిత బియ్యం హుళక్కేనా..?

పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్రంలో మంగళం పాడారా..? ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.కిలో బియ్యంతోపాటు కేంద్రం సమకూర్చే ఉచిత బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఏప్రిల్‌ నుంచి ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులు అసలు ఈ పథకం ఉన్నట్లా, లేనట్లా అనే మీమాంసలో పడ్డారు.

Published : 28 Jun 2022 02:20 IST

న్యూస్‌టుడే, ముమ్మిడివరం

రేషన్‌ దుకాణం వద్ద ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజనలో ఉచిత బియ్యం పంపిణీ (పాత చిత్రం)

పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్రంలో మంగళం పాడారా..? ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.కిలో బియ్యంతోపాటు కేంద్రం సమకూర్చే ఉచిత బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఏప్రిల్‌ నుంచి ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులు అసలు ఈ పథకం ఉన్నట్లా, లేనట్లా అనే మీమాంసలో పడ్డారు.

* కొవిడ్‌ నేపథ్యంలో ఆహార భద్రత సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన (పీఎంజీకేవై) పథకాన్ని తీసుకువచ్చింది. విడతల వారీగా ఈ పథకాన్ని పొడిగిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం, సెప్టెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. జిల్లాలో ఏప్రిల్‌ నుంచి అంటే మూడు నెలలుగా ఈ పథకంలో పేదలకు బియ్యం పంపిణీ జరగడం లేదు. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.కిలో బియ్యం పంపిణీ జూన్‌ నెలకు సంబంధించి ఈ నెల 17వ తేదీతో ముగిసింది. జులై నెలకు సంబంధించి ఎండీయూల ద్వారా బియ్యం పంపిణీకి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ దుకాణాలకు రవాణా ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అందించే బియ్యం మాత్రం ఇంతవరకు రేషన్‌ దుకాణాలకు చేరలేదు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.కిలో బియ్యం ఇంటింటికీ వాహనాల ద్వారా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసే ఉచిత బియ్యం 18వ తేదీ నుంచి నెలాఖరు వరకు రేషన్‌ దుకాణాల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ జరగకపోవడంతో కార్డుదారులు ఈ నెలా ఉచిత బియ్యానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడు నెలలు.. 21 వేల మెట్రిక్‌ టన్నులు..

కోనసీమ జిల్లాలో 5,36,846 రేషన్‌ కార్డులు ఉండగా.. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికే 7 వేల మెట్రిక్‌ టన్నుల బ్యియం పేదలకు పంపిణీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదే స్థాయిలో ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సిన నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి 21 వేల మెట్రిక్‌ టన్నుల బియాన్ని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది.

ఆ ఊసేలేదు..

కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉచిత బియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు పీఎంజీకేవై పథకాన్ని అమలు చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ కదలికలేవీ కనిపించడం లేదు. గడిచిన రెండు నెలల్లో పౌరసరఫరాల శాఖ వద్ద నిల్వలు లేకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూపాయికే కిలో బియ్యం మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిల్వలు పెరిగాయి. రబీ ధాన్యం 60 శాతానికిపైగా సేకరించడం, మిల్లర్లు వాటిని సీఎంఆర్‌కు ఇవ్వడంతో బియ్యం కొరత లేదని అధికారులు చెబుతున్నారు. గడిచిన ఏప్రిల్‌, మే నెలలతోపాటు ప్రస్తుత జూన్‌కు కలిపి సుమారు 21 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం రేషన్‌ దుకాణాలను సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయితే డీలర్లు లబ్ధిదారులకు ఉచిత బియ్యం అందించడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనిపై ఏవిధమైన స్పష్టత లేకపోవడంతో పథకం అయోమయంలో పడింది.

ఎలాంటి ఆదేశాలు రాలేదు..

ఉచిత బియ్యంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. గోదాముల్లో బియ్యం నిల్వల విషయంలో ఇబ్బంది లేదు. ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వస్తే వెంటనే రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తాం.

- ఆర్‌.తనూజ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని