logo

ఇల్లూ లేదు.. సొమ్మూ రాదు..!

అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు కష్టమైనా శ్రమపడి కూడబెట్టి.. బంధువుల దగ్గర అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ.. సొంత గూడు సమకూరుతుందనే కొండంత ఆశతో ప్రభుత్వానికి ముందస్తుగా డబ్బుకట్టారు.

Published : 31 Jul 2023 05:40 IST

అల్లవరం మండలం బోడసకుర్రు వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయం

అద్దె భారం నుంచి తప్పించుకునేందుకు కష్టమైనా శ్రమపడి కూడబెట్టి.. బంధువుల దగ్గర అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ.. సొంత గూడు సమకూరుతుందనే కొండంత ఆశతో ప్రభుత్వానికి ముందస్తుగా డబ్బుకట్టారు. అలాంటి వారికోసం ఇళ్లు నిర్మించి ఇప్పటికే ఏళ్లవుతున్నా.. లబ్ధిదారులకు అప్పగించకపోగా కట్టిన సొమ్ము కూడా తిరిగివ్వలేదు. ఇళ్లు ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్, మండపేట, రామచంద్రపురం

జిల్లాలో ఇలా..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పట్టణ పేదలకు అల్లవరం, రామచంద్రపురం, మండపేట గ్రామాల్లోని టిడ్కో గృహ సముదాయంలో మొత్తం 9,808 ఇళ్లు నిర్మించారు. వీరికి గత ప్రభుత్వ హయాంలో కేటాయించి 365 చ.అడుగులకు రూ.50 వేలు, 430 చ.అ. రూ.లక్ష వరకు కట్టించుకున్నారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇళ్లను అప్పగించే సమయానికి సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తరువాత రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో వాటి నిర్మాణం గాలికొదిలేశారు. అప్పట్నుంచి కేవలం అమలాపురం పురపాలిక పరిధిలో నిర్మించిన ఇళ్లను మాత్రమే పూర్తిగా లబ్ధిదారులకు అందించారు. రామచంద్రపురం, మండపేట గ్రామాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వనేలేదు.

మూడు పట్టణాలు.. 9,808 ఇళ్లు

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్‌ ఇళ్ల పథకం కింద టిడ్కో(పట్టణ మౌలిక సదుపాయల కల్పన సంస్థ) ద్వారా షేర్‌వాల్‌ సాంకేతికతతో ఇళ్లకు అంకురార్పణ జరిగింది. వీటి నిర్మాణాలను గత ప్రభుత్వ హయాంలోనే 80 శాతం వరకు పూర్తిచేశారు. మరికొద్ది రోజుల్లో పూర్తిచేసి పంపిణీ చేద్దామనుకునే సమయానికి ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులకు ఇప్పటికీ అందనేలేదు. జిల్లావ్యాప్తంగా 9,808 ఇళ్లు నిర్మించారు. వారిలో ఇప్పటివరకు 5,020 గృహాలు మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారు.

చెల్లించాల్సింది రూ.15.10 కోట్లు

జిల్లావ్యాప్తంగా టిడ్కో గృహాలకు ముందస్తుగా సొమ్ము కట్టిన వాళ్లలో ఇళ్లు అప్పగించనివారికి సుమారు రూ.15.10 కోట్లు తిరిగి చెల్లించాల్సిఉంది. వీరిలో అత్యధికంగా రామచంద్రపురం పట్టణలోనే 1,088 మంది ఉన్నారు. వీరిలో అనేక మందికి పలు కారణాలతో ఇళ్ల మంజూరు నిలిపేశారు. వీరందరికీ సుమారు రూ.9.90 కోట్లు తిరిగి చెల్లించాల్సిఉంది. మండపేటలో 960 మంది లబ్ధిదారులకు గృహాల మంజూరు ఆగింది. వారికి రూ.4.80 కోట్లు తిరిగి చెల్లించాలి. అమలాపురం పురపాలిక పరిధిలో 72 మందికి రూ.42లక్షలు తిరిగి ఇవ్వాల్సిఉంది.

2,120 మంది ఎదురుచూపులు..

జిల్లాలోని మూడు పురపాలికల పరిధిలో ఇళ్లకోసం తాము చెల్లించిన డబ్బులు కూడా ఇప్పటికీ తిరిగిరాని లబ్ధిదారులు 2,120 మంది ఉన్నారు. వీరు చెల్లించిన రూ.15 కోట్లకుపైగా సొమ్ము ఈ మూడు పురపాలికల నుంచి తిరిగి చెల్లించాలి. వీరెవరికీ టిడ్కో ఇళ్లు రావని ఇప్పటికే తేల్చేశారు. తాము డబ్బులు కట్టినా ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా.. కనీసం సమాధానం చెప్పేవారే కరవయ్యారని వాపోతున్నారు. పురపాలికల్లో అడిగితే తమకు సంబంధం లేదని, టిడ్కో అధికారులను అడగాలని అక్కడి అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. లబ్ధిదారులు చెల్లించిన డబ్బును టిడ్కోకు చెల్లించామని, వాళ్లనుంచి వెనక్కిస్తానని చెబుతున్నారు.

మారిన లబ్ధిదారులు..

గత ప్రభుత్వ హయాంలోనే టిడ్కో గృహాలకు అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి వారి నుంచి ముందస్తుగా కొంత మొత్తం డబ్బు కట్టించుకున్నారు. వీరికి ఇళ్లప్పగించే సమయానికి ప్రభుత్వం మారడంతో అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి లబ్ధిదారుల జాబితాను తారుమారు చేశారని.. డబ్బులు చెల్లించినవారు ఆరోపిస్తున్నారు. ఈ మూడు పురపాలికల పరిధిలో నాయకులకు అనుకూలంగా ఉన్నవారి పేర్లు జాబితాలో చేర్చారనే ఆరోపణలున్నాయి. పాత ప్రభుత్వంలో ఉన్న లబ్ధిదారులను అనేక సాంకేతిక, రాజకీయ కారణాలను సాకుగా చూపి తప్పించారు. ఇప్పటివరకు వారు కట్టిన సొమ్ము మాత్రం వెనక్కివ్వడం లేదు. ఓపక్క ఇళ్లు దక్కలేదనే అవేదన.. మరోపక్క అప్పుచేసి కట్టిన సొమ్ముకు వడ్డీలు కట్టలేక, ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లకు అద్దె చెల్లించలేక నానాపాట్లు పడుతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సొమ్ము తక్షణం చెల్లించాలని, లేదంటే ఉద్యమబాట పట్టాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నాం

అమలాపురం పురపాలిక పరిధిలో 72 మంది టిడ్కో లబ్ధిదారులకు రూ.42 లక్షల చెల్లించాల్సిఉంది. సమస్యను మంత్రి విశ్వరూప్‌ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికిసైతం తీసుకువెళ్లాం. త్వరలోనే ఆ నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చెల్లించే ఆలోచన కూడా చేస్తున్నాం. త్వరలోనే ఇచ్చేలా చర్యలు చేపడతాం.

అయ్యప్పనాయుడు, పురపాలిక కమిషనర్‌, అమలాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు