logo

ఈనెల రేషన్‌ సరుకులు ఇంకా అందలే

జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్‌ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్‌ సరకుల పంపిణీ జరుగుతుంది.

Published : 17 May 2024 05:42 IST

నేటితో గడువు ముగుస్తున్నా మందకొడిగా పంపిణీ

రేషన్‌ సరకుల పంపిణీ
(దాచిన చిత్రం)

జిల్లాలో ప్రస్తుత నెలకు సంబంధించి రేషన్‌ సరకుల పంపిణీ కొన్ని మండలాల్లో వేగంగా జరగడం లేదు. ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీకి నేటితో(శుక్రవారం) గడువు ముగుస్తున్నప్పటికీ సరకులు అందించాల్సిన కార్డులు ఇంకా వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ రేషన్‌ అందే పరిస్థితి లేదు. పలు మండలాల్లో పంపిణీ ఇంకా రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలోనూ ఉంది.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి మొత్తం 5,74,907 రేషన్‌ కార్డులున్నాయి. ప్రతి నెల 1 నుంచి 17వ తేదీ వరకు 364 ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్‌ సరకుల పంపిణీ జరుగుతుంది. ప్రస్తుత నెలలో మాత్రం పంపిణీ ప్రక్రియ ముందు నుంచి మందకొడిగానే సాగుతూ వచ్చింది. గురువారం ఉదయం నాటికి 5,13,532 కార్డులకు సంబంధించి సరకుల పంపిణీ జరగగా.. ఇంకా 61,375 కార్డులు మిగిలి ఉన్నాయి. ప్రతి నెలా 1 నుంచి 10 తేదీ వరకు రోజుకు 8 నుంచి 9 శాతం మేరకు సరకుల పంపిణీ జరుగుతుండగా.. చివరి వారం రోజులు రోజుకు నాలుగు శాతంలోపు జరుగుతుంది. ప్రస్తుత నెలలో అధిక ఉష్ణోగ్రతలు.. మరోపక్క ఎన్నికలు.. కొన్నిసార్లు సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడం తదితర కారణాలతో అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. దీనికితోడు ప్రక్రియను మండల స్థాయిలో పర్యవేక్షించే పౌరసరఫరాల అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో చాలామంది ఎండీయూ ఆపరేటర్లు సరకుల పంపిణీలో నిర్లక్ష్యం చేశారు. కొందరు ఆపరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సక్రమంగా సరకులు ఇవ్వలేదని పలువురు చెబుతున్నారు. ఈ నెల 13న పోలింగ్‌ కారణంగా ఆ రోజు సరకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఒక రోజే గడువు ఉండటంతో మిగతా కార్డుదారులందరికీ సరకు అందే పరిస్థితి లేనందున గడువు పెంచాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.

రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో 12 మండలాలు

జిల్లాలో గురువారం ఉదయం నాటికి సగటున 89.32 శాతం మాత్రమే రేషన్‌ సరకుల పంపిణీ జరిగింది. 19 మండలాలకుగాను 12 చోట్ల తక్కువ శాతం జరిగింది. గోపాలపురం మండలంలో 21,529 కార్డులకుగాను 18,089 కార్డులకు ఇవ్వగా.. ఇంకా 3,440 కార్డులకు అందించాల్సి ఉంది. ఇక్కడ 84.02 శాతమే పంపిణీ జరిగి రెడ్‌జోన్‌లో ఉంది. కొవ్వూరు మండలంలో 86.29 శాతం, బిక్కవోలు 86.66, గోకవరం 86.75, కోరుకొండ 86.79, పెరవలి 87.14, రాజానగరం 87.58, సీతానగరం 87.63, కడియం 88.24, అనపర్తి 88.30, దేవరపల్లి 88.90, చాగల్లు మండలంలో 89.16 శాతం చొప్పున సరకుల పంపిణీ జరిగి ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉన్న మండలాల్లో ఒక్కరోజులో మిగతా రేషన్‌ కార్డులన్నింటికీ సరకులు ఇచ్చే పరిస్థితి లేనందున గడువు పొడిగించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. లబ్ధిదారులందరికీ సరకులు అందేలా గడువు పెంచే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని