logo

అక్షరాలా రూ.కోటి.. అక్రమంలో పోటీ!

అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్‌ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు.

Published : 17 May 2024 09:28 IST

ఉప్పాడ చేయూత మహిళా మార్ట్‌లో మాయాజాలం
కాకిలెక్కలతో దోచుకున్న యంత్రాంగం
ర్యాకులు, ఏసీలకు రూ.30 లక్షలట: సామాజిక భవన అడ్వాన్స్‌ రూ.50 వేలా?

ఉప్పాడలో చేయూత మహిళా మార్ట్‌

న్యూస్‌టుడే, కొత్తపల్లి: అక్రమంలో పోటీపడ్డారు.. అక్షరాలా కోటి రూపాయల నిధులను హాంఫట్‌ చేశారు.. అడిగేవారు లేరన్న ధైర్యం, అడిగినా ఏమవుతుందిలే అన్న బరితెగింపు.. కారణాలు ఏవైనా అడ్డదారిలో కథ నడిపించారు.. మహిళలు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును ‘అభివృద్ధి’ మాటున ఆరగించేయడం వారికే చెల్లింది.. ఆ వివరాలపై గోప్యత పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్‌, విజిలెన్స్‌ దృష్టి పెడితే ఆధారాలతో సహా బయటపడే అవకాశం ఉంది.
వ్యాపారాత్మకంగానూ మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయూత మహిళా మార్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ప్రతి మండలంలోని మహిళల పొదుపు సంఘాల నుంచి పెట్టుబడిగా కొంత నగదు తీసి మార్ట్‌లు ఏర్పాటు చేయాలనేది సంకల్పం. మండలానికి ఒకటి చొప్పున నెలకొల్పేందుకు కసరత్తు జరిగింది. రాష్ట్రంలోనే తొలి మహిళా మార్ట్‌ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో ప్రారంభించారు. మండలంలోని 2400 సంఘాల నుంచి సుమారు రూ.48 లక్షల వరకు పొదుపు నుంచి నగదు తీసుకుని దీనిలో పెట్టుబడి పెట్టారు. ఈ సొమ్ములే కాకుండా ఉప్పాడ, కొత్తపల్లి మహిళా సమాఖ్యల నుంచీ మరో రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొత్తం రూ.68 లక్షలతో 2022 ఆగస్టులో ఈ మార్ట్‌ ఏర్పాటు చేశారు.

పెట్టుబడిని కాగితాల్లో చూపించారు

సుమారు రూ.68 లక్షల పెట్టుబడిని పూర్తిగా ఖర్చు చేసినట్లు కాగితాల్లో చూపించారు. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళల సొమ్ము పక్కదారి పట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మార్ట్‌ ఏర్పాటుకు ఉప్పాడలోని ఓ సామాజిక భవనాన్ని ఎంపిక చేశారు. ప్రజాభవనం అయినా సరే దీనికి రూ.50 వేలు అడ్వాన్స్‌ ఇచ్చినట్టు లెక్కల్లో చూపారు. అలాగే, మార్ట్‌లో స్థిరాస్తుల కింద ఏసీలు, ర్యాక్‌లను గాను సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. క్షేత్రస్థాయిలో అందులో సగం కూడా కనిపించని దుస్థితి. ఇక రూ.25 లక్షల విలువైన సరకు ఉన్నట్లు ప్రస్తావించగా.. మార్ట్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఇలా అడుగడుగునా అక్రమాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుండటం వారికే చెల్లింది.

ఆదాయం ఏమైందో.. అప్పులు చెల్లించలేదు

మార్ట్‌ ఏర్పాటుకు మహిళ పొదుపు సంఘాల నుంచి రూ.2 వేలు చొప్పున, సమాఖ్యల నుంచి రూ.20 లక్షల వరకు తీసుకుని పెట్టుబడి పెట్టారు. వ్యాపారం పురోభివృద్ధి చెందాక.. వచ్చిన ఆదాయంలో కొంత సొమ్ము తిరిగి సంఘాలకు చెల్లిస్తామన్నారు. కానీ, సమాఖ్యల నుంచి తీసుకున్న అప్పునకు ఒక్క రూపాయి వడ్డీ కూడా చెల్లించలేదు. 2023 ఆగస్టులో మార్ట్‌ మొదటి వార్షికోత్సవం నిర్వహించగా.. ఆ ఏడాదిలో రూ.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులే బహిరంగంగా ప్రకటించారు. ఈ సొమ్ము ఏమైందో అంతుచిక్కడం లేదు. మొత్తంగా ఈ మార్ట్‌లో రూ. కోటి సొమ్ముపై స్పష్టత కరవైంది.

బలవంతపు కొనుగోళ్లు

అధికారుల వైఫల్యంతో మార్ట్‌కి ప్రజాదరణ కరవైంది. సరకుల్లో నాణ్యత లోపం, ధరల్లో వ్యత్యాసం లేకపోవడంతో ప్రజలు మార్ట్‌లో సరకులు కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. దీంతో ప్రభుత్వం గౌరవం దెబ్బతింటుందని వెలుగు యానిమేటర్లకు లక్ష్యాలు నిర్దేశించి మరీ.. స్వయం సహాయక సభ్యులతో బలవంతంగా సరకులు కొనుగోలు చేయించారు. మార్ట్‌లో సరకులు మాకొద్దని సభ్యులు వేడుకొన్నా భయపెట్టి, బెదిరించి కొనుగోళ్లకు పాల్పడ్డారు. పొదుపు ఖాతాల నుంచి నగదు తీయించి మరీ ఈ తంతు నడిపించారు.. దీనిపై అప్పట్లోనే ‘ఈనాడు’ కథనాలు ప్రచురించడంతో బలవంతపు కొనుగోళ్లు ఆపేశారు.

ష్‌.. గప్‌చుప్‌..

ఈ మొత్తం వ్యవహారం, మార్ట్‌లో ప్రస్తుత పరిస్థితి తెలుసుకునేందుకు ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా.. అధికారులు అత్యంత గోప్యత పాటించడం గమనార్హం. సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఒకరిపై ఒకరు వంతులేసుకుంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో తొలి మహిళామార్ట్‌ అయిన ఇక్కడి వ్యవహారంపై కలెక్టర్‌ దృష్టి సారించడంతో పాటు.. విజిలెన్స్‌ విచారణ చేపడితే అవినీతి వెలుగుచూసే అవకాశం ఉంది. మహిళల సొమ్ముకు భద్రత కల్పించినట్లు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని