logo

మేమున్నామని.. నిజం గెలవాలని..

తెదేపా అధినేత చంద్రబాబు ఆక్రమ అరెస్టుతో ఆగిన గుండెల వెనుక ఉన్న కన్నీళ్లు తుడిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కదిలివచ్చారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు మంగళవారం ఏలూరు జిల్లాలో ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు.

Updated : 27 Mar 2024 05:33 IST

భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి
మృతుల కుటుంబాలకు పరామర్శ
రెండు నియోజకవర్గాల్లో తొలిరోజు పర్యటన

జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో స్థానికులతో మాట్లాడుతూ..
నిజం గెలవాలంటూ పిడికిలి బిగించి నినదిస్తున్న భువనేశ్వరి

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, కొయ్యలగూడెం, గ్రామీణ, జంగారెడ్డిగూడెం, పట్టణం, గ్రామీణ : తెదేపా అధినేత చంద్రబాబు ఆక్రమ అరెస్టుతో ఆగిన గుండెల వెనుక ఉన్న కన్నీళ్లు తుడిచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కదిలివచ్చారు. మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామన్న భరోసా ఇచ్చేందుకు మంగళవారం ఏలూరు జిల్లాలో ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాల్లో అయిదుగురు మృతుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నేనున్నానని ధైర్యం చెప్పారు.    వారికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని..భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలబడుతుందని భరోసా నింపారు. చంద్రబాబు  పంపిన భరోసా పత్రాన్ని ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆమె రాజమహేంద్రవరం నుంచి కొయ్యలగూడెం మండలం ఎర్రంపేటకు చేరుకున్నారు అక్కడ చాండ్ర చినకన్నయ్య కుటుంబాన్ని కలిసి వారికి ధైర్యం చెప్పారు. అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే మండలం కన్నాయగూడెం వాసి దర్శిపోము వెంకటలక్ష్మి నివాసం వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసానిచ్చారు. అనంతరం బయ్యనగూడెంలో మార్గాని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలోని భీమడోలు వెంగయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మాట ఇచ్చి ప్రసంగించారు. అనంతరం జంగారెడ్డిగూడెంవాసి నల్లజర్ల కృష్ణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అక్కడ నుంచి పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో రాత్రి బస చేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని, మురళి, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేశ్‌కుమార్‌, పోలవరం కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు, పోలవరం తెదేపా ఇన్‌ఛార్జ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం మారుతీనగర్‌లో నల్లజాల కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ..

అడుగడుగునా ఆప్యాయత.. భారీ ఎత్తున మహిళలు, అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి భువనేశ్వరిని ఆప్యాయంగా ఆహ్వానించి యాత్రకు తమ సంఘీభావం తెలిపారు. ఎర్రంపేట రాక మునుపే మహిళలు అక్కడికి చేరుకుని ఆత్మీయంగా ఆహ్వానించారు. మీరు అధైర్య పడకండి.. మేం చంద్రబాబుతోనే ఉన్నాం’ అంటూ భువనేశ్వరికి భరోసా నిచ్చారు. 

భీమడోలు వెంకయ్య కుటుంబ సభ్యులకు భరోసా పత్రాన్ని అందిస్తూ..

నేటి యాత్ర ఇలా.. బుధవారం ఉదయం 9.30కు జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి బయలుదేరి 10.30కి టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం చేరుకుంటారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు.  మధ్యాహ్నం 1.15కి  తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో మృతుల కుటుంబాలను కలుస్తారు.  మధ్యాహ్నం 3 గంటలకు పెంటపాడు మండలం పడమర విప్పర్రు, సాయంత్రం 4కు నిడమర్రులో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వెళ్తారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని