logo

పక్కాగా ఎన్నికల నియమావళి అమలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు.

Published : 29 Mar 2024 03:05 IST

కేసుల పురోగతి తెలుసుకుంటున్న ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, చిత్రంలో ఎస్పీ జగదీష్‌

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా అధికార యంత్రాంగంతో పోలీసు వ్యవస్థ మమేకమై పనిచేస్తుందని ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ అన్నారు. వార్షిక తనిఖీ, ఎన్నికల నేపథ్యంలో కొవ్వూరు పట్టణ, గ్రామీణ, డీఎస్పీ కార్యాలయాలను గురువారం ఆయన పరిశీలించారు. కేసుల పురోగతి, స్థానిక అంశాలపై దస్త్రాలు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలు, ప్రచారాలు, ప్రలోభాలు, అనుమతులు, బందోబస్తు, నామినేషన్లు, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలో అనుసరించాల్సిన ప్రణాళికపై ఎస్పీ పి.జగదీష్‌, పోలీసు అధికారులతో మాట్లాడారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ ఏలూరు రేంజి పరిధిలోని ఆరు జిల్లాల్లో కలెక్టర్ల సమన్వయంతో ఎస్పీలు బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాలన్నారు. దీనిపై ఆయా స్థాయిల్లో శిక్షణాతరగతులు నిర్వహించామన్నారు. ఎన్నికల కోడ్‌కు ముందు డిసెంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు రేంజి పరిధిలో 639 సారా కేసుల్లో 633 మందిని అరెస్టు చేసి 40.75 లక్షలు విలువైన సారా, రూ.26 లక్షల విలువైన బెల్లపు ఊట స్వాధీనం చేసుకున్నామన్నారు. 39 గంజాయి కేసుల్లో 119 మందిని అరెస్టు చేసి రూ.62 లక్షలు విలువైన సరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.7.45 కోట్లు పట్టుకున్నామన్నారు. విలువైన ఆభరణాలు తీసుకెళ్తున్న 8 కేసుల్లో రూ.5.69 కోట్లు, ప్రలోబాలు, కానుకలు ఇస్తున్న ఘటనల్లో 16 మందిపై కేసులు పెట్టి రూ.25.75 లక్షలు విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు, పట్టణ, గ్రామీణ సీఐలు వి.జగదీశ్వరరావు, పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇసుక డ్రెడ్జింగ్‌పై దృష్టి పెడతాం..

గామన్‌, రోడ్‌కం రైలు వంతెల సమీపంలో ఇసుకను యంత్రాలతో తవ్వుతున్నారని, దీంతో వంతెనలు కుంగిపోయే పరిస్థితి ఎదురవుతోందని ఐజీ దృష్టికి తీసుకెళ్లగా, ఆ సమస్య తనకు తెలియదన్నారు. కలెక్టరు ఆదేశాల ప్రకారం నిబంధనలపై దృష్టి సారిస్తామన్నారు. డ్రెడ్జింగ్‌ విషయాన్ని ఎస్పీ పర్యవేక్షిస్తారని చెప్పారు. ఎన్నికల నియమావళికి విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని