logo

ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు శాపం

మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు.

Published : 18 Apr 2024 06:13 IST

వ్యవసాయ క్షేత్రంలోనే నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు

మామిడికుదురు, న్యూస్‌టుడే: మండలంలోని మగటపల్లి శివారులో సుమారు 40 ఎకరాల దాళ్వా వరి పంట చేలకు నెల రోజులుగా నీరు అందక పూర్తిగా నెర్రెలు తీయడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు పశువులకు వదిలేశారు. ఈ పాపం ఎవరిది జగనన్నా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నీరందిస్తామంటే నమ్మి వరి సాగు చేస్తే ఇందులో చాలా వరకు పంట ఎందుకూ పనికిరాకుండా పూర్తిగా ఎండిపోయిందని వాపోతున్నారు. మిగతా చేలు కూడా నిస్తేజంగా మారడంతో పశువులకు మేతగా మేపాల్సిన దుస్థితి ఎదురైందని బాధిత రైతులు నామన నాగేశ్వరరావు, భూపతి శ్రీను, బల్ల జగదీశ్‌, గోగి గోపాలకృష్ణ తదితరులు వాపోయారు. పంట సాగుకు ముందు సొంత ఖర్చులతో 9 కిలోమీటర్ల మేర కాలువను బాగు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. సాగునీరు అందడం లేదని జలవనరుల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా చుక్క నీరు కూడా రాకపోవడంతో చేలన్నీ నెర్రెలు తీసి సర్వనాశనమయ్యాయన్నారు. పంట చేతికి వస్తుందనుకుంటే నీటి ఎద్దడి కారణంగా పెట్టుబడి కూడా దక్కని దయనీయ పరిస్థితి ఎదురైందని, తామెలా బయటపడాలని ఆవేదన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని