logo

పోలీసులపైనా కపట ప్రేమే

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు.

Published : 30 Apr 2024 06:37 IST

రక్షకుల సంక్షేమాన్ని అటకెక్కించిన జగన్‌ సర్కారు

రానున్నది మన ప్రభుత్వమే. వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. మీకు రావాల్సిన బకాయిలన్నీ మొత్తంగా చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం.

ప్రతిపక్ష నేతగా 2019 ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. కాన్వాయ్‌ వెంట పోలీసులును పరుగులు పెట్టించి.. తన భద్రత పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేశారు. కాని వారికి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో మాత్రం అనేక కొర్రీలు పెడుతున్నారు. జగన్‌ పాలనలో అన్నివిధాలా నష్టపోయామని, ఆరోగ్యం సైతం దెబ్బతిందని పలువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, దానవాయిపేట: జిల్లాలోని మొత్తం 1,785 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా జనాభా పరిధిని బట్టి మరో 250 నుంచి 350 మంది వరకు సిబ్బంది అవసరమని ఆ శాఖ ఉన్నతాధికారుల అంచనా. ఆ క్రమంలో ఉన్న యంత్రాంగంతోనే నడిపించాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో నిత్యం విధుల్లో ఉండాల్సి రావడం.. రాత్రి విధులు నిర్వర్తించాల్సిన వారు పగటి పూట కూడా విధులకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ బహిరంగ సభలు జరిగిన జిల్లా పోలీసులను అక్కడికి విధులకు పంపడం ఈ ప్రభుత్వంలో అలవాటుగా మారింది. కనీసం వారాంతపు సెలవు కూడా లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురువుతున్నారు. సిబ్బందిలో 25 శాతం మంది అనారోగ్యానికి గురై అనేక సమస్యలతో బాధపడుతూ మెడికల్‌ లీవ్‌లు పెడుతున్నారు.

ప్రజా ఉద్యమాలకు.. బందోబస్తులకు

రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన మొదలు పోలీసులుకు తీవ్ర అవస్థలు మొదలయ్యాయి. ప్రజల నుంచి వైకాపా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అన్ని పాంత్రాల్లో ఉద్యమాలు ఉద్ధృతమయ్యాయి. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఉద్యమం జరిగినా మన జిల్లా నుంచి అక్కడికి పోలీసులు వెళ్లి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. అత్యవసర సెలవులూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

వారాంతపు సెలవు ముణ్నాళ్ల ముచ్చట

అన్ని పభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరి పోలీసులుకు వారాంతపు సెలవు అవసరమని, కచ్చితంగా తాను అమలు చేస్తానని ఎన్నికల ముందు జగన్‌ ఘనంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసులుకు వారాంతపు సెలవును ప్రకటించారు. రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లలో ఒకటి రెండు నెలలు ఇది సక్రమంగానే అమలు జరిగింది. సిబ్బంది ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. మూడో నెలకే అదికాస్త అటకెక్కింది.

మర్చిపోయిన ఆరోగ్య భద్రత..

  • పోలీసుల ఆరోగ్య భద్రతకు గాను జిల్లాలో ఆరు ఆసుపత్రుల్లో సిబ్బంది చికిత్స పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆయా ఆసుపతులకు పాత బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుతం వారు పోలీసులుకు వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారు. అనుమతి ఉన్న కొన్నింటిలో అవసరమైన చికిత్స పొందే సౌకర్యం లేకపోవడంతో ఇతర ఆసుపత్రులలో నగదు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు.
  • జీపీఎఫ్‌, భద్రతా రుణాలు సకాలంలో మంజూరు కావడంలేదు. వాటికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో పలువురు ఉద్యోగులు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ‌
  • ఏసీబీ, ఏజెన్సీ, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులుకు ఇచ్చే అదనపు చెల్లింపులు, ప్రోత్సాహకాల్లో కోత విధించడంతో ఆయా ప్రాంతాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‌
  • పెండింగ్‌లో ఉన్న డీఏలు, బోనస్‌లు కోసం ఎదురుచూపులే మిగిలాయి. పీఆర్‌సీ పెంచినా అమలు నోచుకోలేదు. పాత పీఆర్‌సీలో కోత విధించారు.

ఎన్నికల వేళ ఎర..

రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పోలీసులకు ఎన్నికల నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. అయిదేళ్లుగా పోలీసు అధికారుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్‌ ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంచిన సరెండర్‌ లీవ్‌లకు సంబంధించిన కొంత మొత్తాన్ని ఇటీవలే వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీసులకు వారి ఖాతాల్లో నగదు జమ కావడంతో ఆశ్చర్యపోయారు. జిల్లా పోలీసు అధికార, సిబ్బందిలో కొందరికి ఒకటి, మరికొందరికి రెండు సరెండర్‌ లీవులకు సంబంధించి మొత్తాలు జమ చేశారు. మరి కొందరికి పెండింగ్‌లో ఉంచడంతో వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని