logo

వైకాపా ఎమ్మెల్యే స్టేటస్‌ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్‌ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.

Published : 05 May 2024 03:45 IST

సీతానగరం: రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్‌ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు. బాధితుడు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి వైద్యచికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. బాధితుడు తరుణ్‌ తెలిపిన వివరాలిలా.. రాజానగరం మండలం జి.యర్రంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు. అదే సమయంలో జనసేనకు చెందిన కొందరు జెండాలు పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి జై జనసేన, జై పవన్‌కల్యాణ్‌ అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి ముందుకెళ్లారు. ఇదంతా వీడియో రికార్డింగ్‌ చేసి కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. పలు చరవాణి వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తున్న అదే వీడియోను సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన వరదా తరుణ్‌(23) అనే జనసేన పార్టీకి చెందిన యువకుడు శనివారం తన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. దీనిపై గుర్రుపెట్టిన వైకాపా నాయకులు ఉదయం నుంచి తరుణ్‌ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. గ్లాస్‌ వర్కు చేసుకునే తరుణ్‌ పనిమీద సీతానగరం వచ్చాడు. ఈనేపథ్యంలో ఇనుగంటివారిపేట వైకాపాకు చెందిన కొండాటి దుర్గాప్రసాద్‌ ఫోన్‌ చేసి ఎమ్మెల్యే స్టేటస్‌ ఫోన్‌లో ఎందుకు పెట్టావు.. చంపేస్తానంటూ బండబూతులు తిట్టాడని తరుణ్‌ వాపోయాడు. పని పూర్తిచేసుకుని ఊళ్లోకి వెళ్లగానే అందరూ చూస్తుండగానే దారికాచి దుర్గాప్రసాద్‌ నాపై దాడికి దిగి కొడుతుండగా పరిసరాల్లో ఉన్న నలుగురూ వచ్చి అడ్డుకుంటుంటే వాళ్లనీ కూడా చంపుతానంటూ బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గ్రామంలోని ఒక వైకాపా నాయకుడు ప్రోత్సాహంతోనే దుర్గాప్రసాద్‌ దాడికి దిగాడని వారి నుంచి తనను రక్షించాలని బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్టేటస్‌గా పెట్టిన వీడియోను బాధితుడు పోలీసులకు అందించాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్నామని దీనిపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని