logo

వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల  ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది.

Published : 09 May 2024 04:50 IST

కన్నబాబుకు మద్దతుగా బరితెగింపు

కాకినాడ గ్రామీణ వైకాపా అభ్యర్ధి కురసాల కన్నబాబు తరఫున ప్రచారం చేస్తున్న జేఎన్‌టీయూకే అవుట్‌ సోర్సింగ్‌, కాకినాడ జడ్పీ కార్యాలయ ఉద్యోగులు

కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్‌), కరప, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల  ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోసం కాకినాడ జేఎన్‌టీయూకే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇద్దరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. కాకినాడ గ్రామీణ ప్రాంతానికి చెందిన కొప్పిశెట్టి రమణ, సుబ్బారావులు జేఎన్‌టీయూకేలో అవుట్‌ సోర్సింగ్‌ కింద గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. కాకినాడ కార్యాలయంలో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార సమావేశంలో సుబ్బారావు, 1వ డివిజన్‌ రమణయ్యపేటలో జరిగిన ప్రచారంలో రమణ హాజరై కరపత్రాలు పంచి ఓట్లు అభ్యర్థించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో జేఎన్‌టీయూకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, కాకినాడ జడ్పీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రెడ్డిపల్లి వెంకటవీర రమేష్‌ అధికార పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కురసాల కన్నబాబుకు ప్రధాన అనుచరుల్లో ఒకరిగానూ పేరొందారు. ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సహ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయన.. రెండురోజుల క్రితం వైకాపా కార్యకర్తలతో కలిసి గ్రామంలో కన్నబాబు చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ వైకాపా కోసం ప్రచారం చేశారు. ఈయన భార్య రెడ్డిపల్లి వెంకటమాధవి గ్రామ సర్పంచి. రెండునెలల క్రితం గ్రామదేవత ఆలయ ప్రారంభోత్సవ సమయంలో మాటలను ప్రతిపక్ష పార్టీ నాయకులు వక్రీకరించి చెబుతున్నారని.. తాను ఎక్కడా వైకాపా జెండా పట్టుకుని ప్రచారం చేపట్టలేదని రమేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని