logo

మాట తప్పావ్‌.. మడం తిప్పావ్‌..

వైకాపా పాలనలో అంగన్‌వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు  ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు.

Updated : 09 May 2024 05:40 IST

హామీలు నెరవేర్చలేదని జగన్‌పై అంగన్‌వాడీల మండిపాటు
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం

వైకాపా పాలనలో అంగన్‌వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు  ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కారించాలంటూ అనేక రూపాల్లో ఆందోళనలు చేసినా కనికరించలేదు. విసిగిపోయి చివరకు కేంద్రాలకు తాళాలు వేసి రోడ్డెక్కే పరిస్థితిని కల్పించారు. నేటికీ తమ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజమహేంద్రవరం నగరంలోనే 150 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో టీచర్లు, సహాయకులు కలిసి 300 మంది ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణలో ఇచ్చే వేతనం కంటే అంగన్‌వాడీలకు అదనంగా రూ.వెయ్యి పెంచుతామని వాగ్దానం చేసినప్పటికీ అమలు జరపలేదు. తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్‌కు రూ.13,600, సహాయకురాలికి రూ.9 వేలు వేతనం చెల్లిస్తుండగా ఇక్కడ మాత్రం రూ.11,500, రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు.

వి.ఎల్‌.పురంలోని ఎంపీ భరత్‌రామ్‌ కార్యాలయ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు (పాత చిత్రం)


ఉద్యోగ విరమణ చేసినవారి పరిస్థితి దుర్భరం  

చాలా రాష్ట్రాల్లో అంగన్‌వాడీ సిబ్బంది 80 ఏళ్లయినా ఉద్యోగ విరమణ లేకుండా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం లేదు. 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది రాజమహేంద్రవరం నగరంలోనే 250 మంది వరకు ఉండగా ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధిలేదు. ఉద్యోగ విరమణ సమయంలో కార్యకర్తలకు రూ.50 వేలు, సహాయకురాలికి రూ.20 వేలు చొప్పున ఇచ్చారే తప్ప ఇతర ప్రయోజనాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆర్థిక భారం, రాజకీయ ఒత్తిళ్లు

ఒకపక్క నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు అద్దె బిల్లులు, ఇతర బకాయిలు సకాలంలో రాక కేంద్రాల నిర్వహణ భారంగా మారింది. వీటికితోడు పనిఒత్తిడి పెరిగినప్పటికీ సౌకర్యాలు కల్పించకపోవడం.. రాజకీయ జోక్యం తదితర వాటితో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు.


సమ్మెబాట పట్టినా..

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని.. చివరికి ఇటీవల 42 రోజుల పాటు సమ్మె చేపట్టారు. చర్చల అనంతరం సమ్మె కాలంలో వేతనాలు ఇచ్చేందుకు, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచేందుకు, సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తూ మృతిచెందితే ఇచ్చే పరిహారాన్ని పెంచేందుకు ఇలా కొన్ని అంగీకరించినప్పటికీ వేతనాలు పెంచే విషయంలో స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉన్న టీఏ బకాయిలు, ఇతర బిల్లులు ఇవ్వలేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి అన్ని యాప్స్‌లను ఒకే యాప్‌గా మార్చాలని కోరినా అదీ జరగలేదు.  


ప్రభుత్వపరంగా సహాయం లేదు
- సి.హెచ్‌.సత్యభామ, విశ్రాంత అంగన్‌వాడీ కార్యకర్త  

రూ.4,200 వేతనంలో ఉద్యోగ విరమణ చేశాం. కనీసం సర్వీసు పింఛను అయినా ఇప్పించాలని కోరుతూ అనేకసార్లు స్పందన కార్యక్రమాల్లో అర్జీలు అందించినా ఫలితంలేదు. మానసికంగా, శారీరకంగా అలసిపోయి ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయం లేక ఇబ్బందులు పడుతున్నాం.


అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం
- ఎం.ఎస్‌.మణి

ఏన్నో ఏళ్లు సేవలందించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారంలేక ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్నవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రిటైర్డు అయిన వారికి ప్రతినెలా వృద్ధాప్య పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరినప్పటికీ ఇప్పటివరకు మాకు ఎటువంటి సహాయం అందటంలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని