logo

ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం

నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి.

Published : 10 May 2024 05:18 IST

అధికార పార్టీ నేత.. ఆధునికీకరణ అంటే ఇదేనా?
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

గరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. ఇన్ని రూ.కోట్లు ఖర్చుపెట్టినా.. చినుకుపడి మురుగు ముంచెత్తితే మాది బాధ్యత కాదు అనేలా చేశారు. సుబ్రహ్మణ్య మైదానం.. చారిత్రక వేదికకు ఆధునిక హంగులంటూ బాకా ఊది చివరకు రాజకీయ సభలకు వేదికగా మార్చేశారు. అదిగదిగో గ్లో గార్డెన్‌ అన్నారు.. ఆ వెలుగులు చూడాలంటే ప్రవేశ రుసుం లేనిదే లోపలకు పంపరు. ఎన్నికల వేళ కదా.. కాస్త తక్కువ రుసుం. మళ్లీ అధికారంలోకి వస్తే బాదుడే బాదుడు.

ఇదీ నగరంలో అధికార పార్టీ నేత చెబుతున్న అభివృద్ధి. అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని నిత్యం ఆ మంత్రం జపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధం. చేసిన పనులు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకపోగా పరోక్షంగా అధికార పార్టీ నాయకులకు ఆదాయ మార్గాలుగా మారాయి. అయిదేళ్ల వైకాపా పాలనలో నగరాన్ని శాశ్వత ప్రాతిపదికన     సమస్యలు పరిష్కరించకపోగా వ్యాపార దృక్పథంతో ఆలోచించి అభివృద్ధిని పక్కదారి పట్టించారు. నగరంలో సుమారు రూ.వంద కోట్ల వరకు నిధులతో తలపెట్టిన పనులు ఎవరికి ప్రయోజనం అన్నట్టుగా మారాయి. మరి దీన్ని అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించకపోవడాన్ని ఏమనాలి? ఇదీ.. నగరవాసుల ప్రశ్న.

వద్దని విన్నవించినా చారిత్రక వేదిక మార్చేశారు..

స్వాతంత్రోద్యమానికి ప్రతీకగా నిలిచిన సుబ్రహ్మణ్యం మైదానాన్ని చరిత్ర ఆనవాలుగా వదిలేయాలని, నిర్మాణాలు చేపట్టకూడదంటూ మేధావులు విన్నవించారు. ఎవరి మాట వినకుండా నిర్మాణం చేపట్టారు. సుబ్రహ్మణ్యం మైదానాన్ని ఆధ్మాత్మిక, సాంస్కృతిక వేదికగా మారుస్తానని, కళాకారులు ఉచితంగా ప్రదర్శన చేసుకోవచ్చని అధికార పార్టీ నేత ఊదరగొట్టారు. దీనికితోడు పాత సినిమాలు వేస్తానని ప్రకటించారు. తీరా ఓపెన్‌ థియేటర్‌ ఏర్పాటుకు ప్రాజెక్టు కావాలంటే మళ్లీ రూ.80 లక్షలు వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి. ఇదికాక మరో రూ.2 కోట్లతో పనులు పూర్తి చేయాల్సి ఉంది. చివరకు అధికార పార్టీ నేత ఎన్నికల వేళ వైకాపా రాజకీయ సభలకు ఈ వేదికను వినియోగించుకున్నారు.  

వెలుగులు చూడాలన్నా వెచ్చించాల్సిందే..

నగరంలో లాలాచెరువు రోడ్డులో గ్లోగార్డెన్‌ పేరుతో ఏర్పాటు చేసిన పార్కుకు ప్రస్తుత రుసుం రూ.20గా నిర్ణయించారు. వివిధ రకాల జంతువుల మోడళ్లలో కాంతి వంతమైన బల్బులు ఏర్పాటు చేసి అలంకరించారు. ఈ పార్కులో కూడా అడుగు పెట్టాలంటే రుసుం చెల్లించక తప్పని పరిస్థితి. ఇక ఎన్నికలైన తర్వాత వీటి రుసుం పెంచేందుకు ఆలోచన చేస్తున్నారు.

ముంపు సమస్య వదిలేసి ఎందుకీ వృథా ఖర్చు

నగరంలో ముంపు ప్రాంతాల్లో అలంకరణ చేసి నిధులు వృథా చేశారు. వివిధ కూడళ్ల వద్ద సుమారు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు వెక్కిరిస్తున్నాయి. దేవీచౌక్‌, పుష్కరఘాట్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రధాన గేటు, ఏవీఏ రోడ్డు తదితర కూడళ్ల వద్ద రోడ్డు మధ్యలో అలంకరణ పేరుతో రాళ్లు వేశారు. ఏడాది పూర్తిగా గడవకముందే అవి పైకి లేచిపోతున్నాయి. దీనికి తోడు దేవీచౌక్‌ కూడలి వద్ద రోడ్డు మధ్య ఏర్పాటు చేసిన లైటింగ్‌ విధానంపై పూర్తి స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో కేవలం అలంకరణ పేరుతో లైట్లు వేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా విద్యుత్తు దీపాలు ఉండగా, అందం కోసం మాత్రమే నిధులు వెచ్చించడంపై వ్యతిరేకిస్తున్నారు. చిన్న చినుకు పడినా ఈ ప్రాంతాన్ని ముంపు సమస్య పట్టిపీడిస్తుండగా అది వదిలేసి.. ఇప్పుడు అలంకరణ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ స్థలంలో పార్కు.. ప్రవేశానికి మాత్రం టికెట్‌

కంబాలచెరువు పార్కును సుమారు రూ.13 కోట్లతో ఆధునికీకరించారు. ఒకప్పుడు ఉదయం, సాయంత్రం వాకర్స్‌కు అందుబాటులో ఉండే ఈ పార్కు ప్రస్తుతం లోపలకు వెళ్లాలంటే రూ.30 చెల్లించాలి. అదీ సాయంత్రం 6 గంటల లోపైతేనే.. ఆరు దాటితే రూ.50. లోపల ఆటపాటలు ఒక్కొక్క దానికి ఒక్కో రేటు నిర్ణయించారు. ఇద్దరు పిల్లలతో ఓ కుటుంబం పార్కులోకి వెళ్లి ఆస్వాదించాలంటే కనీసం రూ.వెయ్యి ఖర్చు చేయక తప్పదు. అన్నింటికీ రేటే. ప్రభుత్వ స్థలంలో.. ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసి పార్టీ నేతకు విధేయుడైన గుత్తేదారునికి తక్కువ లీజుకు పార్కును కట్టబెట్టారు. నగరం మధ్యలో ఇది ఉండడం వల్ల వివిధ పనులపై వచ్చిన వారంతా పనులు ముగించుకొని కాసేపు సేద తీరేందుకు వచ్చేవారు. సాయంత్రం అయ్యేసరికి ఆహ్లాదం కోసం ఈ పార్కుకు వచ్చేవారూ ఎక్కువే. ప్రస్తుతం ఈ పార్కుకు రావాలంటే జేబునిండా డబ్బులు నింపుకొని వెళ్లాలి. మరి దీన్ని అభివృద్ధి అని ఎలా అంటారు.?

అనాలోచిత పనులతో రూ.లక్షల నష్టం

నగరంలో ప్రధాన వ్యాపార కూడలైన మెయిన్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ విధానం ఏర్పాటు చేసి, కొద్ది రోజుల్లోనే వాటిని  తొలగించారు. దీంతో నగరపాలక సంస్థకు భారీగా ఆస్థి నష్టం ఏర్పడింది. వాస్తవానికి కోటగుమ్మం నుంచి డీలక్స్‌ సెంటర్‌ వరకూ ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయించినప్పటికీ పనులు చేపట్టలేదు. కనీసం రోడ్డును ఆనుకొని కాలువ నిర్మించాల్సి ఉండగా ఆ పనులూ పక్కన పెట్టారు. ఇవేమీ కాదని కేవలం సెంట్రల్‌ లైటింగ్‌ విధానం తీసుకొచ్చారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో వాటిని ఏర్పాటు చేశారు. ఇంతలో వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ వద్ద వాహనాలను పార్కింగ్‌ చేయడంతో సమస్య మరింత పెరిగింది. దీంతో సెంట్రల్‌ లైటింగ్‌ తొలగించారు. దీంతో రూ.40 లక్షలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని