logo

భావ వ్యక్తీకరణ భేష్‌!

చదువుకుంటే.. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే.. సంతోషంగా ఉండగలం. మానసిక దృఢత్వం పెంపొందించుకుంటే.. బయట రకరకాల వేధింపులు అధిగమించగలం. ఇలా.. రకరకాల భావాలను వివిధ రీతుల్లో వ్యక్తం

Published : 07 Dec 2021 05:32 IST


చెక్కు అందుకున్న కార్తీక్‌..

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే చదువుకుంటే.. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలం. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటే.. సంతోషంగా ఉండగలం. మానసిక దృఢత్వం పెంపొందించుకుంటే.. బయట రకరకాల వేధింపులు అధిగమించగలం. ఇలా.. రకరకాల భావాలను వివిధ రీతుల్లో వ్యక్తం చేసిన విద్యార్థులకు నగదు పురస్కారాలు లభించాయి. సామాజిక పరిస్థితులు, ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ధ, బాలికావిద్య ఆవశ్యకత, బాలిక సంరక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ‘సేవ్‌ * గర్ల్‌ చైల్డ్‌’ పేరిట జిల్లా విద్యాశాఖ పాఠశాల, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించింది. జిల్లాలో వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీపడి తమ భావాలు వ్యక్తం చేశారు. పిట్టలవానిపాలెం మండలానికి చెందిన విద్యార్థులు జిల్లాస్థాయిలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రూ.5 వేలు, రూ.3 వేల నగదు బహుమతి, పురస్కారాలు అందుకున్నారు.
న్యాయ నిర్ణేతల మన్ననలు..: పర్వదినాల విశిష్టత.. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై పిట్టలవానిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కార్తీక్‌ రాసిన వ్యాసం న్యాయ నిర్ణేతల మన్ననలు అందుకుంది. జిల్లాస్థాయి పోటీలో అతడు తృతీయ స్థానం సాధించాడు. ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ అంశంపై కార్తీక్‌ గీసిన చిత్రం ప్రత్యేక బహుమతికి ఎంపికైంది. రూ.వెయ్యి చెక్కును జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి అందజేశారు. జిల్లాస్థాయిలో బహుమతి సాధిస్తానన్న తన నమ్మకం వమ్ముకాలేదని అతడు ఆనందం వ్యక్తం చేశాడు.

వ్యాసరచన.. వక్తృత్వంలో ప్రతిభ: అల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నల్లూరి లిఖిత వ్యాసరచన, వక్తృత్వంలో ప్రతిభ చాటుతోంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మెలకువలు నేర్చుకొంటూ సాధన చేస్తోంది. ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. బాలికా సంరక్షణ, బాలికా విద్య ఆవశ్యకత, తల్లిదండ్రుల నుంచి కావాల్సిన ప్రోత్సాహం తదితర అంశాలపై ఆమె వివరించిన తీరు న్యాయనిర్ణేతలను ఆకట్టుకొంది. మరోవైపు క్రీడలు, చిత్రలేఖనం తదితర పోటీల్లోనూ లిఖిత రాణిస్తోంది. కొవిడ్‌ పరిణామాలపై నిర్వహించిన ఆన్‌లైన్‌ పోటీల్లో వ్యాసరచనలో ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ రాజకుమారి చేతుల మీదుగా బహుమతులు అందుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపింది. 


జేసీ రాజకుమారి నుంచి బహుమతి అందుకొంటున్న లిఖిత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని