logo

గుంటూరులో ప్రగతి పుష్పాలు

గలగలపారే కృష్ణమ్మ సవ్వడి.. సువిశాల నదీ, సముద్ర తీర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడాలేని సహజ సంపద.. అందరి ఆకలితీర్చే  ఆహార ఉత్పత్తులు.. ఆకర్షించే ప్రదేశాలు ఉమ్మడి జిల్లా సొంతం.  సుస్థిర అభివృద్ధికి దోహదంచేసే వనరుల్ని సద్వినియోగం

Updated : 10 Aug 2022 06:18 IST

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- అమరావతి ఫీచర్స్‌

గలగలపారే కృష్ణమ్మ సవ్వడి.. సువిశాల నదీ, సముద్ర తీర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడాలేని సహజ సంపద.. అందరి ఆకలితీర్చే  ఆహార ఉత్పత్తులు.. ఆకర్షించే ప్రదేశాలు ఉమ్మడి జిల్లా సొంతం.  సుస్థిర అభివృద్ధికి దోహదంచేసే వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంతో 75 ఏళ్లలో ఎంతో ప్రగతి నమోదైంది. కీలక రంగాల్లో మెరుపులు ఉన్నాయి. అభివృద్ధికి ఇంకా అవకాశాలు అనంతంగా ఉన్నాయి. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని స్వాతంత్య్ర వజ్రోత్సవాల  వేళ మననం చేసుకుంటే..


అక్షరంలో పైపైకి..

1981లో ఉమ్మడి జిల్లా అక్షరాస్యత 36.06 శాతంగా ఉండగా 2011 జనాభా లెక్కలకు వచ్చేసరికి 67.40 శాతంగా నమోదైంది. జిల్లా అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యతా శాతం 67.41తో సమానంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 48,87,813 మంది జనాభా ఉంటే అందులో 29,60,441 మంది అక్షరాస్యులుగా ఉన్నారు. పురుషుల్లో అక్షరాస్యులు 16,34,726 మంది, మహిళల్లో అక్షరాస్యులు 13,25,715 మంది ఉన్నారు. కేజీబీవీలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, కేంద్రియ విద్యాలయాలు, నవోదయాలు, రాష్ట్ర ప్రభుత్వ బడులు అక్షర ప్రగతికి దోహదపడుతున్నాయి. నరసరావుపేటలో జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటైంది. ఉన్నత విద్యకు కూడా ఇక్కడి విద్యాలయాలు భరోసా ఇస్తున్నాయి.


వైద్యానికి భరోసా..

వైద్యానికి ఉమ్మడి జిల్లా హబ్‌గా మారింది. గుంటూరు సమగ్రాసుపత్రితోపాటు తెనాలి జిల్లా ఆసుపత్రి, నరసరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలు, 21 సామాజిక ఆసుపత్రులు, 86 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నాయి. ఈ క్రమంలో మారుమూల గ్రామాలకు సైతం వైద్యసేవలు వెళ్తున్నాయి. టెలీ మెడిసిన్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 15వ తేది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమల్లోకి రాబోతుండటం మంచి పరిణామంగా ఉంది. వైద్యంతోపాటు వైద్య విద్యనందించే కళాశాలలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటయ్యాయి. మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్‌తో వైద్య సేవలు కొత్త పుంతలు తొక్కాయి. పల్నాడులో నూతన వైద్య కళాశాల నిర్మాణం జరగబోతుంది.


అభివృద్ధి.. స్వచ్ఛత బాట పట్టిన పల్లెలు..

ఆర్థిక సంఘం నిధులు.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే వివిధ పథకాల నిధులతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయి. సీసీ రోడ్లు, డ్రైయిన్లు, తాగునీటి పథకాలు, విద్యుత్తు వ్యవస్థ, కనీస మౌలిక వసతులతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు సొంత భవనాలు సమకూర్చుకున్నాయి. పల్లెలు స్వచ్ఛత బాట పట్టాయి. స్వచ్ఛభారత్‌.. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లాలో లక్షలాది వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. సత్తెనపల్లిలో 25 వేల మరుగుదొడ్లను 100 రోజుల్లోపు నిర్మించారు. చిలకలూరిపేట, నరసరావుపేట, ప్రత్తిపాడు, గురజాల, వినుకొండ తదితర నియోజకవర్గాల్లోనూ భారీగా మరుగుదొడ్ల నిర్మాణాల్ని చేపట్టారు. గ్రామాల్ని పరిశుభ్రంగా మార్చడంతోపాటు చెత్తతో సంపద సృష్టికి గ్రామాల్లో ఉపాధి నిధులతో డంపింగ్‌ యార్డులు వాటినుంచి వర్మీ ఎరువుల్ని తయారు చేస్తున్నారు. సత్తెనపల్లి మండలంలోని నందిగామ ఘనవ్యర్థాల నిర్వహణలో మిగిలిన గ్రామాలకు రోల్‌మోడల్‌గా ఉంది.


ఉపాధికి ఢోకా లేదు..

వ్యవసాయ అనుబంధ రంగాల పరిశ్రమలు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటై వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులు, సిమెంట్‌ పరిశ్రమలు, వివిధ వస్తువుల తయారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. చిన్నతరహ పరిశ్రమలు సుమారు 12 వేలు వరకు ఉండగా వాటిద్వారా సుమారు లక్షన్నర మంది ఉపాధి పొందుతున్నారు. భారీ పరిశ్రమలు 250 వరకు ఉండగా వాటి ద్వారా మరో 90 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 11 లక్షల కుటుంబాలు జాబ్‌కార్డులు కలిగి ఉండి ఇంటిపట్టునే ఉపాధి పొందుతున్నాయి.


సహజ సంపద పుష్కలత

ఇసుక, సున్నపు రాయి, డయాటో మాసియస్‌ మట్టి, రాగి, సీసం ఖనిజం, క్వార్ట్జ్‌, ఇనుమ ఖనిజం, కంకర, గ్రానైట్‌, క్రోమైటు ఖనిజం, మైకా ఖనిజం ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకమైన సహజ సంపదగా ఉంది. ప్రపంచ పర్యాటకమంతా ఇక్కడే ఉంది. బౌద్ధారామాలు, ఎంతో ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలు, ఎత్తిపోతలు, గుహలు, పక్షుల కేంద్రం, సూర్యలంకలాంటి సహజసిద్ధ సముద్ర తీరం, మడ అడవులు, బోటింగ్‌, నల్లమల అడవులు, వృత్తి కళలు ఆకర్షణీయంగా ఉన్నాయి.


ఆహార ఉత్పత్తుల అన్నపూర్ణగా..

సరిగ్గా 55 ఏళ్లక్రితం అందుబాటులోకి వచ్చిన మానవ నిర్మిత మహాసాగరం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా రూపురేఖలు మార్చింది. సాగర్‌ జలాలు పరవళ్లు తొక్కడంతో సాగు, తాగుకు భరోసా దొరికింది. వరితోపాటు మిరప, పత్తి, పసుపు, మొక్కజొన్న, జొన్న, కంది, పండ్ల తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 5.88 లక్షల హెక్టార్లులో వివిధ పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయానికి తోడుగా పాడి పరిశ్రమతోనూ ఉమ్మడి జిల్లా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. మత్య్స పరిశ్రమకు హబ్‌గా కూడా ఉమ్మడి జిల్లా ఉంది.


వేగంగా పట్టణీకరణ..

ఉమ్మడి జిల్లాలో పట్టణీకరణ వేగంగా ఉంది. 1961లో 19 శాతం మంది మాత్రమే పట్టణ జనాభాఉంటే 2011కి వచ్చేసరికి మొత్తం జనాభాలో పట్టణ జనాభా 33.81 శాతానికి చేరింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా గ్రామ పంచాయతీల్ని నగర పంచాయతీలు, పట్టణాలుగా మార్చి సేవలందిస్తున్నారు.


అతి తక్కువ పేదలు..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు.. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలువంటి సరళమైన సదుపాయాలు కొలమానంగా తాజాగా నీతిఆయోగ్‌ 2011లో రూపొందించిన బహుముఖ పేదరికం నివేదికలో రాష్ట్రంలోనే అతి తక్కువ పేదలు ఉమ్మడి జిల్లాలో ఉన్నట్లు వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం పేదరికం వివరాలిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని