logo

వేడుకలా విద్యాదీవెన నిర్వహిస్తాం

జగనన్న విద్యా దీవెన మూడో విడత సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 11న చేపడుతున్న బాపట్ల పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

Published : 10 Aug 2022 04:19 IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ

సభా వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, ఉప సభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల, న్యూస్‌టుడే : జగనన్న విద్యా దీవెన మూడో విడత సాయం పంపిణీ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 11న చేపడుతున్న బాపట్ల పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో హెలీప్యాడ్‌, ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కళాశాలలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మంత్రి మేరుగ నాగార్జున, ఉప సభాపతి కోన రఘుపతి, ఎంపీ నందిగం సురేష్‌, సీఎం కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం తొలిసారి బాపట్ల వస్తున్న సందర్భంగా జగనన్న విద్యా దీవెన మూడో విడత సాయం పంపిణీ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తామని చెప్పారు. జగన్‌ పర్యటనలో బాపట్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొత్త జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం కార్యక్రమం విజయవంతం చేయటంపై కలెక్టర్‌, ఎస్పీతో మంత్రులు, ప్రజాప్రతినిధులు చర్చించారు.

ఆదివాసీల అభ్యున్నతికి చిత్తశుద్దితో కృషి

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సత్యనారాయణ మాట్లాడారు. గిరిజన తండాలు, చెంచు గూడాల్లో విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున, ఉప సభాపతి రఘుపతి మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలను సమాజంలో అట్టడుగు వర్గాలకు అందేలా వైకాపా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. ఎంపీ నందిగం సురేష్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, పర్చూరు, అద్దంకి వైకాపా బాధ్యులు రావి రామనాథంబాబు, బాచిన కృష్ణ చైతన్య, ఆర్డీవో రవీందర్‌, డీటీవో, ఎంపీపీ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

నల్లమడ వాగు ఆధునికీకరణకు వినతి..

బాపట్ల, పల్నాడు జిల్లాలకు కీలకమైన నల్లమడ వాగు ఆధునికీకరణ, పర్చూరు వరకు గుంటూరు ఛానల్‌ పొడిగింపు పనులు ప్రభుత్వం సత్వరమే చేపట్టాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొట్టు సత్యనారాయణకు నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్‌ వినతిపత్రం అందజేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ 11న బాపట్ల వస్తున్న సందర్భంగా ఆయన్ను కలవడానికి అవకాశం కల్పించాలని కోరారు. వాగు ఆధునికీకరణ పనులు, గుంటూరు ఛానల్‌ పర్చూరు వరకు పొడిగించాల్సిన ఆవశ్యకతను సీఎంకు వివరిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని