logo

తొలిరోజే తడబాటు

ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు ప్రక్రియలో తొలిరోజే తడబాటు ఎదురైంది. ఒకేసారి వేలాదిమంది విద్యార్థులు హాజరు నమోదుకు సిద్ధమవ్వడంతో సర్వర్‌ ఆగిపోయింది. సెల్ఫీ తీసుకున్న తరువాత హాజరు కొందరివి ఫెయిలవ్వగా..

Published : 17 Aug 2022 05:48 IST
ముఖఆధారిత హాజరు నమోదులో సాంకేతిక సమస్యలు
ఉపాధ్యాయుల అవస్థలు
యాప్‌లో లాగిన్‌ అవడానికి ఇబ్బందులు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి: ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదు ప్రక్రియలో తొలిరోజే తడబాటు ఎదురైంది. ఒకేసారి వేలాదిమంది విద్యార్థులు హాజరు నమోదుకు సిద్ధమవ్వడంతో సర్వర్‌ ఆగిపోయింది. సెల్ఫీ తీసుకున్న తరువాత హాజరు కొందరివి ఫెయిలవ్వగా.. చాలామందికి లాగిన్‌ అయ్యేందుకు కూడా అవకాశం రాలేదు. ఉదయం 9 గంటల్లోపు ఉపాధ్యాయుల హాజరు పూర్తి చేయాల్సి ఉండగా మధ్యాహ్నం 2 వరకు సర్వర్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో ఉపాధ్యాయుల హాజరు నమోదు ప్రక్రియ సవ్యంగా ముందుకు సాగలేదు. విలీన బడులు, డిప్యూటేషన్లపై పనిచేసే వారికి ఏపీటెల్‌ సేవలు అందుబాటులోకి రాలేదు.

* సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 25 మంది వరకు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లుగా పనిచేస్తున్నారు. స్కూల్‌ కాంప్లెక్సు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు నమోదుకు సర్వర్‌ అవకాశమివ్వలేదు.

* చాలామంది ఉపాధ్యాయుల వద్ద అప్‌డేటెడ్‌ చరవాణులు లేవు. లింకు ద్వారా హాజరు నమోదుకు చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందిపడ్డారు.

* ఎక్కువమంది ఉపాధ్యాయులు ఇంకా తమ చరవాణుల్లో స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌ 2.0ని రిజిష్టర్‌ చేసుకోలేదు. స్కూల్‌ కాంప్లెక్సు హెచ్‌ఏంలు తమ పరిధిలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. ఆ ప్రక్రియ పూర్తయిన వారిలోనూ హాజరు 7 నుంచి 15 శాతంలోపే ఉంది.


బయోమెట్రిక్‌.. ఐరిస్‌ పరికరాల్ని వాడుకలోకి తేవాలి
 - మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి

గతంలో పాఠశాలలకు విద్యాశాఖ బయోమెట్రిక్‌.. ఐరిస్‌ పరికరాల్ని సమకూర్చింది. వాటిని వాడుకలోకి తెచ్చి ఆ పరికరాల ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు ప్రక్రియ చేపట్టాలి. ఉపాధ్యాయుల్లో చాలామంది ఇప్పటికీ పాతకాలం ఫోన్లు వాడుతున్నారు. అలాంటివారు లింకుల్ని డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు నమోదు చేయాలంటే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. సర్వర్‌ సమస్యతో తొలిరోజు ఉపాధ్యాయుల హాజరు నమోదు తక్కువగా జరిగింది. ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయుల వివరాల్ని స్కూల్‌ కాంప్లెక్సు హెచ్‌ఏంలు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. పూర్తి కసరత్తు తర్వాత ముఖ ఆధారిత హాజరు చేపట్టినా ప్రయోజనం ఉంటుంది.


తప్పనిసరి తగదు
- ఎస్‌ఎం సుభాని, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ముఖ ఆధారిత హాజరు నమోదుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ పనిచేయక ఉపాధ్యాయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి పాఠశాలకు కొత్తగా ట్యాబ్‌లు ఇచ్చి వాటిద్వారా హాజరు నమోదు ప్రక్రియ చేపట్టాలి. ట్రయల్‌ రన్‌ కూడా వేయకుండా నేరుగా ముఖ ఆధారిత హాజరును ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయడం మంచి పద్ధతి కాదు. యాప్‌లలో వివరాల నమోదుతో బోధనకు అవరోధాలు తలెత్తుతున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని