logo

జగనన్న కాలనీ సొగసు చూడరే!

రేపల్లె 18వ వార్డు శివారు జగనన్న కాలనీలో మౌలిక వసతుల సమస్యలతో ఇంటి నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు ప్రధాన, అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి.

Updated : 03 Oct 2022 10:37 IST

నడవాలన్నా నరకమే

రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే:

జగనన్న కాలనీలో రోడ్ల దుస్థితి

రేపల్లె 18వ వార్డు శివారు జగనన్న కాలనీలో మౌలిక వసతుల సమస్యలతో ఇంటి నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు ప్రధాన, అంతర్గత రహదారులు చిత్తడిగా మారాయి. దీనికితోడు ఇసుక, ఇటుక లోడు ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో రోడ్లపై గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారయ్యాయి. తాత్కాలికంగా వేసిన మట్టి, గ్రావెల్‌ రహదారులపై ఇంటి నిర్మాణ సామగ్రి వాహనాలు కూరుకుపోయి అవస్థలు ఎదుర్కొంటున్నారు.

రెండేళ్లయినా రహదారి లేదు

జగనన్న కాలనీలో స్థలం మంజూరైన లబ్ధిదారులు 18 నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని లేదంటే పట్టా రద్దు చేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. పట్టా రద్దవుతుందనే భయంతో 300 మంది పేదలు పునాది వేసి వదిలేశారు. మరికొందరైతే పట్టా రద్దయినా ఫర్వాలేదని ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.1.80 లక్షలకు మరో మూడు లక్షలుపైగా అప్పు చేయాల్సి వస్తోందని, పెరిగిన భవన నిర్మాణ సామగ్రి ధరలతో ఇల్లు కట్టుకోలేమని లబ్ధిదారులు వాపోతున్నారు. రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు కాలనీలో సరైన రహదారి సదుపాయం కల్పించలేదని విమర్శిస్తున్నారు. తీరా అప్పోసప్పో చేసి ఇళ్లు నిర్మించినా మౌలిక సదుపాయాలు ఎప్పటికి కల్పిస్తారోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


50శాతం పూర్తయితేనే..

జగనన్న కాలనీలో 50శాతం ఇళ్ల నిర్మాణం జరిగితే శాశ్వత రహదారుల సదుపాయం కలుగుతుంది. ఇప్పటి వరకు 35 శాతం వరకు ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. మరో నెలలో 50 శాతం పనులు పూర్తి చేసేలా దృష్టి సారించాం. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తోంది. పొదుపు సంఘ సభ్యులకు రూ. 35 వేల చొప్పున రుణం మంజూరు చేస్తోంది. రాయితీపై ఇనుము, సిమెంట్‌ సరఫరా చేస్తున్నాం. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటే సొంతిల్లు అమరుతుంది.

- ఏవీ సుబ్బారావు, డీఈ,  గృహ నిర్మాణశాఖ, రేపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని