logo

ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై దాడులు

అద్దంకి పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న దుకాణ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు.

Published : 04 Feb 2023 06:29 IST

8.6 మెట్రిక్‌ టన్నుల సరకు సీజ్‌
5.45 మెట్రిక్‌ టన్నుల అమ్మకాలు నిలిపివేత

అద్దంకి ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న విజిలెన్స్‌, వ్యవసాయాధికారులు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు డీఏపీ ఎరువులు విక్రయిస్తున్న దుకాణ యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. దుకాణంలోని 8.60 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువుల్ని సీజ్‌ చేశారు. మరోచోట తయారీ కంపెనీ నుంచి అనుమతి లేకుండా విక్రయిస్తున్న 5.45 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేశారు. విజిలెన్స్‌ సీఐ శ్రీహరిరావు అందించిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల్ని అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు, స్టింగ్‌ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అద్దంకిలోని మూడు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో తమ సిబ్బందిని మారువేషంలో డీఏపీ కొనుగోలు చేయించామన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా గల నాగేశ్వర ట్రేడర్స్‌లో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధర రూ.1,350 ఉండగా రూ.1,400 వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా దుకాణంలోని 8.60 మెట్రిక్‌ టన్నుల డీఏపీ (రూ.72,236 విలువగల) ఎరువుల్ని సీజ్‌ చేసినట్లు ప్రకటించారు. పక్కనే గల వెంకటేశ్వర ట్రేడర్స్‌లో ఫ్యాక్ట్స్‌ కంపెనీ యూరియా అమ్మకాలకు ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ దుకాణ యజమాని వాటిని అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆమేరకు 5.45 మెట్రిక్‌ టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. వీటి విలువ సుమారు రూ.1.47 లక్షలు ఉంటుంది. ఆంజనేయ ట్రేడర్స్‌ దుకాణం తనిఖీ చేసినప్పటికీ ఎలాంటి వ్యత్యాసాలు గుర్తించలేదు. ఈ దాడుల్లో అద్దంకి ఏవో కె.వెంకటకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని