logo

మద్యం అక్రమ విక్రయాలకు అడ్డేది?

ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం జిల్లాలో ఏరులై పారుతోంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు.

Published : 23 Mar 2023 05:39 IST

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సెబ్‌ అధికారులు
న్యూస్‌టుడే, బాపట్ల, చీరాల అర్బన్‌

చీరాల గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం (పాత చిత్రం)

తర రాష్ట్రాలకు చెందిన మద్యం జిల్లాలో ఏరులై పారుతోంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. కొంతమంది అధికారులు అక్రమార్కుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కొందరు సిబ్బందితో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

గోవా, పాండిచ్చేరి, తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సూర్యలంక వాయుసేన కేంద్రం నుంచి తక్కువ ధరకు మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బాపట్ల పట్టణంలో గత డిసెంబరులో ఓ రక్షణ శాఖ ఉద్యోగి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సెబ్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రక్షణశాఖ క్యాంటీన్‌ నుంచి తెచ్చి విక్రయించటానికి నిల్వ ఉంచిన 26 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న వాడరేవు రోడ్డులో రెండో పట్టణ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో స్థానిక గ్యాస్‌గోదాం సమీపంలో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి 58 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల ఒకటిన చీరాల మండలం బుర్లవారిపాలెం అడ్డరోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తి నుంచి 40 గోవా మద్యం సీసాలను ఈపురుపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల కారులో పాండిచ్చేరి నుంచి తీసుకొస్తున్న మద్యంను పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం వద్ద సెబ్‌ పోలీసులు 71 సీసాలను పట్టుకుని ఒకర్ని అదుపులోకి తీసుకున్నారు. మరోకరు పరారిలో ఉన్నారు.

జిల్లాలో ప్రధానంగా చీరాల, బాపట్ల తీరప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. వారాంతపు రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వచ్చి సేదదీరుతున్నారు. దీన్ని అక్రమార్కులు ఆసరాగా తీసుకొని గోవా, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి మద్యంను గుట్టుగా తీసుకొచ్చి విక్రయాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఎక్కడపడితే అక్కడ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. చిన్నబడ్డీ బంకుల్లో కూడా వీటిని విక్రయించడం వల్ల గొలుసు దుకాణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగులు ఎక్కువ మొత్తంలో వీటిని బయటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్టూరు మండలం బలరాం కాలనీలో దాదాపు 139 సీసాల మద్యంను స్వాధీనం చేసుకుని వారిని ప్రశ్నించగా ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తే వ్యక్తి నిల్వచేయమన్నాడని చెప్పడం గమనార్హం. దీనికితోడు ఇక్కడ విక్రయించే మద్యం కన్నా ఇతర ప్రాంతాల్లో నాణ్యమైనది తక్కువ ధరకు రావడంతో ఆ వైపుగా మందుబాబులు దృష్టి సారిస్తున్నారు. అందుకే ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం విక్రయాలు ఇక్కడ ఊపందుకున్నాయి. అందుకే అక్రమార్కులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని వివిధ మార్గాల ద్వారా జిల్లాకు తరలిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన సెబ్‌ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవరించడమే కాకుండా అక్రమార్కులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఇలా వ్యాపారాలు చేసే వారిని గుర్తించి తొలుత దాడులు చేయడం, తర్వాత  నెలవారీ మాముళ్లు తీసుకుంటూ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి.


విస్తృతంగా దాడులు చేస్తాం

నరసింహారావు, సెబ్‌ జిల్లా అధికారి

జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచి విస్తృతంగా దాడులు చేసి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తాం. బాపట్ల, చీరాల, రేపల్లె, మార్టూరు, అద్దంకి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రజలు సైతం అక్రమ మద్యంపై సమాచారం ఉంటే సెబ్‌ పోలీసులకు తెలియజేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని