logo

Vundavalli Sridevi : ఎమ్మెల్యే శ్రీదేవికి... మొదటి నుంచి ఇరకాటమే!

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా బహిష్కరించింది. 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున అనూహ్యంగా తాడికొండ సీటు సాధించి విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవికి ఎన్నికైన కొన్నాళ్ల నుంచే సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు మొదలయ్యాయి.

Updated : 25 Mar 2023 07:46 IST

అదనపు సమన్వయకర్తల నియామకంతో ఒత్తిడి
ఈనాడు-అమరావతి

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైకాపా బహిష్కరించింది. 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున అనూహ్యంగా తాడికొండ సీటు సాధించి విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవికి ఎన్నికైన కొన్నాళ్ల నుంచే సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. సొంత పార్టీ ఎంపీ నియోజకవర్గంలో జోక్యంపై ఉండవల్లి శ్రీదేవి అభ్యంతరం చెప్పడంతో మొదలైన వివాదం పెద్దదిగా మారింది. దీంతో నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనపై లేనిపోని అపవాదులు వేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి అప్పట్లో అంతర్గత సమావేశాల్లో చెప్పేవారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండకు ప్రాతినిధ్యం వహిస్తుండగా అదనపు సమన్వయకర్త పేరుతో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించింది. దీంతో ఒకే నియోజకవర్గంలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడి కార్యకర్తలు, నేతల్లో గ్రూపులు మొదలయ్యాయి.

పార్టీ కార్యక్రమాలు సైతం ఎవరికి వారుగా చేసుకోవడం, ఒకవర్గంపై మరో వర్గం ఆరోపణలు చేయడంతో ఉండవల్లి శ్రీదేవి సొంత పార్టీలోనే ఇరకాటానికి గురయ్యారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఏం చేయాలన్నా అడ్డంకులు ఏర్పడ్డాయి. నామినేటేడ్‌ పదవుల విషయంలోనూ వాగ్వాదాలు జరిగాయి. కొన్ని పదవులకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సమన్వయకర్తల ఒత్తిడితో తిరిగి ఉపసంహరించుకున్న సందర్భాలు ఉన్నాయి. డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు గుంటూరు జిల్లా బాధ్యతలు అప్పగించిన తర్వాత తాడికొండ నియోజకవర్గానికి కత్తెర సురేష్‌ను అదనపు సమన్వయకర్తగా నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ప్రాధాన్యత మరింత తగ్గింది.

నియోజకవర్గంలో శ్రీదేవి వర్గానికి ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి సీటు ఇవ్వరన్న ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా ఆమె అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు సైతం నియోజకవర్గంలో కత్తెర సురేష్‌ ఆధ్వర్యంలో జరుగుతుండటంతో ఉండవల్లి శ్రీదేవి వర్గానికి మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓటింగ్‌లో పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థికి 23 ఓట్లు వచ్చి విజయం సాధించడంతో వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాకు క్రాస్‌ ఓటింగ్‌ చేశారని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఉండవల్లి శ్రీదేవి పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని ఆమెను బహిష్కరించినట్లు ఆ పార్టీ ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని