logo

వీధి కుక్కల దాడితో 30 గొర్రెలు మృతి

అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెలు చనిపోగా.. మరో ఆరు గొర్రెలకు గాయాలయ్యాయి.

Published : 30 Mar 2023 05:28 IST

చనిపోయిన గొర్రెలను చూపుతున్న యల్లమంద

మాదల(ముప్పాళ్ల), న్యూస్‌టుడే: అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెలు చనిపోగా.. మరో ఆరు గొర్రెలకు గాయాలయ్యాయి. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మాదల గ్రామానికి చెందిన చిమటా యల్లమంద అలియాస్‌ ముసలయ్య గొర్రెల పోషణపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. యథావిధిగా మంగళవారం రాత్రి గొర్రెలను కొట్టంలో ఉంచి మేత, నీళ్లుపెట్టి ఇంటికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గొర్రెల అరుపులు వినిపించడంతో ఆయన భయాందోళనకు గురై వెంటనే అక్కడికి వెళ్లారు. అప్పటికే ఆరు కుక్కలు కొట్టంలోకి చొరబడి 30 గొర్రెల్ని చంపాయి. వెంటనే ఆయన కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కుక్కలు పారిపోయాయి. చనిపోయిన వాటిలో 15 పెద్దవి, మరో 15 చిన్న గొర్రెలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారి డాక్టర్‌ పుల్లారెడ్డి గ్రామానికి చేరుకుని గాయపడిన ఆరు గొర్రెలకు చికిత్స చేశారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ కాంతారావు ఘటనపై ఆరా తీశారు. రూ.2.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని, పశు నష్టపరిహారం అందజేసి తనను ఆదుకోవాలని బాధితుడు అధికారులను వేడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని