logo

అంతా మా ఇష్టం!

ఇరవై వేల ఎకరాలకు సాగు నీరందించే కీలకమైన ఎత్తిపోతల పథకం అది. ఇటీవల బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగడంతో పూర్తిస్థాయిలో పని చేసి తమ సాగు నీటి కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులంతా భావించారు.

Published : 01 Apr 2023 05:38 IST

ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ కాలువ పూడ్చివేత
గుండ్లకమ్మ రిజర్వాయరు వద్ద గుత్తేదారులదే రాజ్యం  
మేదరమెట్ల, న్యూస్‌టుడే

ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లోకి నీరు వెళ్లే కాలువను పూడ్చిన దారిపై వెళ్తున్న టిప్పరు

ఇరవై వేల ఎకరాలకు సాగు నీరందించే కీలకమైన ఎత్తిపోతల పథకం అది. ఇటీవల బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగడంతో పూర్తిస్థాయిలో పని చేసి తమ సాగు నీటి కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులంతా భావించారు. కాసులే పరమావధిగా ఇసుకను తవ్వుకుపోయే గుత్తేదారు అన్నదాతల కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఎత్తిపోతల పథకం కాలువను పూడ్చేశారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూడటంతో అంతా మా ఇష్టం అన్నట్లు ఇక్కడ వ్యవహారం సాగుతోంది.

గుండ్లకమ్మ రిజర్వాయరులో డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలకు గుత్తేదారులకు కొద్దిరోజుల క్రితం అనుమతులు ఇచ్చారు. వారు కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామం సమీపంలో రిజర్వాయరులో మూడు డ్రెడ్జర్లను నదిలోకి దించారు.  రాత్రి పగలు తేడా లేకుండా పెద్దమొత్తంలో ఇసుకను నది నుంచి తవ్వుతున్నారు. నదిలో తవ్విన ఇసుకను తరలించేందుకు రిజర్వాయరు పక్కనే దారి ఏర్పాటు చేసుకున్నారు. గుత్తేదారులు ఏర్పాటు చేసుకున్న దారి మధ్యలో రిజర్వాయరు నుంచి యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌కు నీరు చేరవేసే కాలువ ఉంది. గుత్తేదారులు ఆ కాలువ మధ్యలో పెద్ద పెద్ద రాళ్లతో పూడ్చి దారి ఏర్పాటు చేశారు. దీంతో పంప్‌హౌస్‌కు నీరు చేరే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన బడ్జెట్లో ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో రైతులకు ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ఆశ పడ్డారు. కానీ పంప్‌హౌస్‌కు నీరందించే కాలువ పూడ్చేందుకు పెద్ద రాళ్లు వేయడంతో కాలువ ఎక్కువ శాతం పాడయ్యే అవకాశం ఉంది. 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూపొందించిన ప్రాజెక్ట్‌ కాలువ పూడ్చి వేస్తున్న సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. కాలువ పూడ్చే వరకు కూడా అధికారులు నిద్ర నటిస్తున్నారు. 40 టన్నుల ఇసుక టిప్పరు ఈ కాలువపై ఏర్పాటు చేసిన దారిపై వెళ్తే కాలువ దెబ్బతినే అవకాశం ఉంది.

మరమ్మతులు చేయాలని గుత్తేదారులను అడుగుతాం.. రహదారి పూడ్చేయడంపై ఎత్తిపోతల పథకం డీఈ దివాకర్‌ను వివరణ అడగగా.. కాలువపై మట్టి వేసి దారి ఏర్పాటు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించామన్నారు. ఇసుక తవ్వకాలు పూర్తయిన తరువాత కాలువకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలని గుత్తేదారులకు తెలియజేశామన్నారు. వారి నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని