logo

Palnadu: కళ్ల ముందే.. కనుపాప సజీవ దహనం

ఆ దంపతులకు వివాహమైన ఏడేళ్ల తరువాత కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.

Updated : 15 Jun 2023 08:56 IST

ఇంటికి నిప్పంటుకొని పసిబిడ్డ దుర్మరణం
కాపాడే ప్రయత్నంలో తల్లి, అమ్మమ్మకు గాయాలు
అచ్చంపేట మండలం పెదపాలెంలో విషాదం

పల్లవి (పాతచిత్రం)

ఆ దంపతులకు వివాహమైన ఏడేళ్ల తరువాత కూతురు జన్మించింది. ఎన్నో ప్రార్థనల ఫలితంగా పుట్టిన ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. కుమార్తె పుట్టిందన్న ఆనందం ఏడాదిలోనే ఆవిరైంది. వారుంటున్న ఇంటిని అగ్ని కీలలు చుట్టుముట్టడంతో ఏడాది వయసున్న ఆ పసిగుడ్డు మంటల్లో చిక్కుకొంది. ఆపదలో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి సర్వశక్తులు ఒడ్డింది. కానీ కళ్ల ముందే పసికూన మంటల్లో సజీవ దహనమైంది. తల్లి పొత్తిళ్లలో ఆటాలాడాల్సిన చిన్నారి ముద్దలా మారడం చూసి కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటన బుధవారం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెంలో చోటుచేసుకుంది.

గాయపడిన చిన్నారి అమ్మమ్మ మేరి

పెదపాలెం(అచ్చంపేట), న్యూస్‌టుడే: అచ్చంపేట మండలం పెదపాలెం ఎస్సీకాలనీకి చెందిన వెంకట్రావు, అదే కాలనీకి చెందిన అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహమైన ఏడేళ్ల తర్వాత బిడ్డ జన్మించింది. ప్రసవం అనంతరం అనిత బిడ్డతోపాటు పుట్టింటిలో ఉంటోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం కాలనీకి పడమర వైపున ఉన్న భూముల్లో ఎండిన పిచ్చి మొక్కలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆ మంటలు వ్యాపించి సమీపంలోని కాలనీని చుట్టుముట్టాయి. అనిత ఉంటున్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లోని సిలిండర్‌ పేలింది. ఆ ధాటికి ఊయలలో ఉన్న చిన్నారి పల్లవి(ఏడాది రెండు నెలల వయసు) మంచం మీద పడిపోయింది. మంటల్లో చిక్కుకొని ముద్దగా మారింది. బిడ్డను కాపాడే ప్రయత్నంలో అమ్మమ్మ మేరి, తల్లి అనిత మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు ఎండ వేడిమి, మరోవైపు ఈదురుగాలుల కారణంగా మంటలు కాలనీని తాకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 12 పూరిళ్లు, పాకలు, వసారాలు దెబ్బతిన్నాయి. 5 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. నిత్యావసరాలు, వంట పాత్రలు బూడిదయ్యాయి. అందరూ నిరాశ్రయులయ్యారు. మిగతా వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రెండు అగ్నిమాపక యంత్రాలు గ్రామానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌, సత్తెనపల్లి ఆర్డీవో బి.ఎల్‌.రాజకుమారి, తహసీల్దార్‌ సి.పద్మాదేవి సహాయక చర్యలు చేపట్టారు.

అగ్ని ప్రమాదంలో దగ్గమైన ఇల్లు

రోదిస్తున్న కుటుంబ సభ్యులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని