logo

జగనన్నా.. ఎలా అడుగు పెట్టాలన్నా?

జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్లుగా అంతర్గత రహదారుల నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదు.

Updated : 29 Jul 2023 05:37 IST

కాలనీల్లో తటాకాల్లా అంతర్గత రోడ్లు.. రాకపోకలకు నరకయాతన
మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

ముంపు బారిన రేపల్లెలో జగనన్న కాలనీ

బాపట్ల, రేపల్లె అర్బన్‌ న్యూస్‌టుడే: జిల్లాలో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెండున్నరేళ్లుగా అంతర్గత రహదారుల నిర్మాణ విషయాన్ని పట్టించుకోలేదు. పేద లబ్ధిదారుల గొంతుపై కత్తి పెట్టి ఇళ్ల నిర్మాణం చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చిన వైకాపా పాలకులు కనీస వసతుల కల్పనలో ఘోరంగా విఫలమయ్యారు. రోడ్ల నిర్మాణానికి రూ.70 కోట్లకుపైగా నిధులు కావాల్సి ఉండగా రూపాయి విడుదల చేయలేదు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు జగనన్న కాలనీలు తటాకాల్లాగా మారిపోయాయి. మట్టి రోడ్లు చిత్తడిగా తయారై జగనన్న కాలనీల్లోకి పేదలు వెళ్లలేని దుస్థితి నెలకొని ఉంది. జిల్లా కేంద్రం బాపట్లలో నాలుగు జగనన్న కాలనీల్లో 3408 గృహాలు మంజూరు చేశారు. కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.18 కోట్ల వరకు నిధులు కావాలి. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పురపాలక అధికారులు ప్రతిపాదనలు పంపించారు. నిధులు విడుదల కాలేదు. మైనింగ్‌ నిధి నుంచి కేటాయించాలని భావించినా నిబంధనల మేరకు సాధ్యపడలేదు.  లబ్ధిదారులు నిర్మాణ సామాగ్రి తరలించడానికి తాత్కాలికంగా మట్టి రోడ్లు వేశారు.

* జిల్లాలో మొత్తం జగనన్న కాలనీలు: 298

* తొలి విడతలో మంజూరు చేసిన గృహాలు: 31,086

* పునాది దశలో ఉన్న ఇళ్లు: 10,850

* పునాది దశ దాటి గోడలు నిర్మించిన ఇళ్లు: 8067

* శ్లాబ్‌ దశలో ఉన్న ఇళ్లు: 1378

* శ్లాబ్‌ నిర్మించిన ఇళ్లు: 538

* నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లు: 9968

* నిర్మించని ఇళ్లు: 285

పేదలకు ఎన్ని కష్టాలో..

వ్యవసాయ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు. లబ్ధిదారులు అప్పులు చేసి మెరకలు వేసుకొని ఇంటి నిర్మాణం చేపట్టారు. మూడ్రోజులుగా కురిసిన వర్షాలకు రహదారులన్నీ చిత్తడి, చిత్తడిగా మారాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత దారుణంగా ఉన్నాయి. మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల చుట్టూ రెండు నుంచి మూడు అడుగుల లోతున నీరు నిలిచింది. ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇసుక, సిమెంటు, ఇటుక రాళ్లు తరలిస్తున్న వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. గుంతలు పడి బురదమయంగా మారిన రోడ్లలో నిర్మాణ సామాగ్రి తరలించడానికి ప్రైవేటు వాహనదారులు రావడం లేదు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు కనీస వసతులు కల్పించకపోవడంతో స్థానికంగా నివాసం ఉండలేకపోతున్నారు. నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తూ దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. రేపల్లె పట్టణంలోని జగన్న కాలనీ ముంపు బారినపడింది. అంతర్గత రహదారులు చిన్నపాటి చెరువులుగా కనిపిస్తున్నాయి.

పర్యటనలకే అధికారులు పరిమితం

డెల్టా ప్రాంతంలో అన్నిచోట్లా కాలనీల్లో నీరు నిలిచి సమస్య తీవ్రంగా ఉంది. కొల్లూరు, వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాల్లో జగనన్న కాలనీల్లో కనీస వసతులు లేవు. లోతట్టు ప్రాంతాల్లో మెరకలు వేయకుండా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీల్లో కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన వైకాపా ప్రభుత్వం ఆగస్టు 15లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటూ పేదలపై అధికారుల ద్వారా తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. అప్పులు తెచ్చి నిర్మించినా కాలనీల్లో ఉండలేని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు నిర్మించనిదే నిర్మాణ పనులు ముందుకు సాగేలా లేవు. జిల్లా ఉన్నతాధికారులు జగనన్న కాలనీలు సందర్శించి హడావుడి చేసి వెళ్లిపోతున్నారని మౌలిక వసతుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని లబ్ధిదారుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. డెల్టా ప్రాంతంలో పూర్తిగా వర్షాకాలం ముగిసే వరకు(డిసెంబరు) ఇళ్ల నిర్మాణ పనులు సాగే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం

జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే రోడ్ల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడతాం. 

రంజిత్‌బాషా, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు