logo

Fishing: కరెంటుతో చేపల వేట!

పల్నాడు జిల్లాలో మాచవరం మండలం మారుమూల ప్రాంతం. ఇక్కడ అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది.

Updated : 14 Sep 2023 09:03 IST

కృష్ణానదిలో మత్స్యసంపదకు తీరని నష్టం
అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు

చేపలను వేటాడుతున్న ప్రాంతమిదే..

మాచవరం, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో మాచవరం మండలం మారుమూల ప్రాంతం. ఇక్కడ అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. తెలంగాణ మద్యం నుంచి జూదం, మట్టి అక్రమ రవాణా, గంజాయి, గుట్కా, రేషన్‌ బియ్యం తరలింపు వంటి కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరు. లాభం వచ్చే ఏపనైనా అక్రమార్కులు వదలిపెట్టడం లేదు. తాజాగా గోవిందాపురం రేవు సమీపంలోని కృష్ణానదిలో విద్యుత్తు ప్రసరింపజేసి చేపలతోపాటు వాటి పిల్లలను చంపేస్తున్నట్లు వెలుగుచూసింది. ఏడాది నుంచి ఈ తంతు జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. అధికార పార్టీ నేతలు, స్థానిక యంత్రాంగానికి తెలిసే ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవిందాపురం పడవల రేవు సమీపంలో విద్యుత్తు ద్వారా చేపలను పట్టుకునే కొత్త పద్ధతికి కొందరు శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పద్ధతిలో పట్టుకుంటే చేపలు చిక్కవని, ఈవిధమైన అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రేవు సమీపంలో నివసించే ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఒడిశా నుంచి వచ్చిన కొందరు ఛార్జింగ్‌ బ్యాటరీలు, విద్యుత్తు పరికరాలతో రాత్రివేళ నదిలో వేటకు వెళుతున్నారు. విద్యుత్తు పరికరాన్ని నీటిలో వేయగా, ఆ పరిధిలోని పెద్ద చేపలతోపాటు పిల్లలు చనిపోతున్నాయి. నీటిపై తేలాడిన వెంటనే వాటిని పట్టుకుని పడవలో వేస్తున్నారు. అనంతరం ఒడ్డుకు చేర్చి, తెల్లవారాక ప్రత్యేక వాహనంలో మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ వ్యవహారం ఏడాది నుంచి జరుగుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. స్థానిక జాలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, చేపలు పట్టేవారు లెక్కచేయడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, నదిలో మత్య్స సంపద ఆవిరి అవుతుందని జాలర్లు వాపోతున్నారు. దీనివెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చేప పిల్లలను నీటిలో విడుదల చేస్తున్నా ఆశించిన ప్రయోజనం కలగడంలేదు. నదిలో అక్రమంగా చేపల వేట సాగించే వారిపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. దీనిపై మత్స్యశాఖ సహాయ పర్యవేక్షకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని