logo

గుంటూరు యార్డు ఆధునికీకరణకు రూ.125 కోట్లు

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో అతిపెద్ద కూడలిగా గుర్తింపు పొందిన గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు రూ.125.16 కోట్లు మంజూరు చేశారు.

Published : 09 Oct 2023 05:34 IST

టెండర్‌ ప్రక్రియ పూర్తి
ప్రాజెక్టు పూర్తయితే అదనంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడపొచ్చు

గుంటూరు జంక్షన్‌

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో అతిపెద్ద కూడలిగా గుర్తింపు పొందిన గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు రూ.125.16 కోట్లు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతిశక్తి ప్రాజెక్టు కింద ఈ నిధులు కేటాయించారు. దీంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. గుత్తేదారు ఎంపిక మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు మండల రైల్వే అధికారి రామకృష్ణ ప్రయత్నిస్తుండటం గమనార్హం.

రైళ్ల రాకపోకలు ఎలా?

యార్డు ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్లాట్‌ఫాం ఒకటి వద్ద ట్రాక్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైళ్ల రాకపోకలను సర్దుబాటు చేసేందుకు ఇబ్బంది కలిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏయే రైళ్లను మళ్లింపు మార్గంలో నడపాలి? వేటిని రద్దు చేయాలి? తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..!

గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా రోజూ 100 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ మొత్తం ఏడు ప్లాట్ ఫారాలు ఉన్నాయి. అయినా పూర్తి స్థాయిలో రైళ్లను నిలపడం ఇబ్బందికరంగా మారింది. రెండు ప్లాట్‌ ఫారాలు మినహా 24 బోగీలు నిలిపే స్థలం లేదు. పురాతన కాలంనాటి సిగ్నల్‌ వ్యవస్థ కావడంతో త్వరగా రైళ్లను స్టేషన్‌లోకి అనుమతించడం ఇబ్బందికరంగా తయారైంది.

కొత్తగా 8వ లైను

గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా అరండల్‌పేట వైపు కొత్తగా 8వ లైను నిర్మించనున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయితే అన్ని ప్లాట్‌ ఫారాల మీద 24 బోగీలు నిలిపే సౌకర్యం రానుంది. దీనివల్ల అదనంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడిపే వీలుంటుంది. కంప్యూటర్‌ ద్వారా సిగ్నల్స్‌ అందుతాయి. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో సమయం ఆదా అవుతుంది. ఖాళీగా ఉండే రైళ్లను నిలిపేందుకు అదనంగా రెండింటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సౌకర్యం లేనందున నల్లపాడు, సిరిపురం స్టేషన్లలో వాటిని నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్టేషన్‌లోని ప్రధాన మార్గం నుంచి లూప్‌లైన్‌ వరకు పాయింట్స్‌, క్రాసింగ్స్‌ను మార్చనున్నారు. గుంటూరు నుంచి కేసీకెనాల్‌ వైపు, తెనాలి మార్గం వైపు వెళ్లే రైళ్లు రెండు లైన్ల నుంచి ఒకేసారి వెళ్లే సదుపాయం కలగనుంది. దీనివల్ల సిగ్నల్‌ కోసం రైళ్లు వేచి ఉండాల్సిన సమయం తగ్గిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని