logo

కలలు.. కల్లలయ్యాయి.. యువకుడి ప్రాణం తోడేసిన చిన్నగాయం

ఉన్నత విద్యావంతుడైన కుమారుడిని అత్యున్నత ఉద్యోగంలో చూడాలని ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ అతడే సర్వస్వంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది.

Updated : 19 Nov 2023 08:20 IST

బ్రెయిన్‌ డెడ్‌తో యువకుడి మృతి
ఉపాధ్యాయ కుటుంబంలో తీరని విషాదం

నిఖిల్‌ చక్రవర్తి (పాతచిత్రం)

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఉన్నత విద్యావంతుడైన కుమారుడిని అత్యున్నత ఉద్యోగంలో చూడాలని ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ అతడే సర్వస్వంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. సివిల్స్‌కు సిద్ధమవుతూ తండ్రికి స్వల్ప అనారోగ్య సమస్య రావడంతో దిల్లీ నుంచి వచ్చి ఆయన కోలుకునేలా చేసిన యువకుడు ఊహించని రీతిలో బ్రెయిన్‌ డెడ్‌తో మృత్యువాతపడ్డాడు. సేకరించిన వివరాల మేరకు..
సత్తెనపల్లి పట్టణంలోని మూడోవార్డు భీమవరం రోడ్డులో ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు బంకా వాసుబాబు, నాగమణి నివాసముంటున్నారు. వాసుబాబు అచ్చంపేట మండలంలోని వేల్పూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం. నాగమణి సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఒక్కగానొక్క కుమారుడైన నిఖిల్‌ చక్రవర్తి (28) అలియాస్‌ పండును ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడ్డారు. నిఖిల్‌ బీటెక్‌ పూర్తిచేసి సివిల్స్‌పై దృష్టి సారించాడు. దిల్లీలో ఉంటూ సివిల్స్‌ శిక్షణ పొందేవాడు. ఒకసారి ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఈసారి కచ్చితంగా సివిల్స్‌లో సత్తా చాటుతాననే ధీమాతో ఉన్నాడు. నెల క్రితం తండ్రికి అనారోగ్య సమస్య రావడంతో ఇంటికి వచ్చాడు. ఆసుపత్రిలో తండ్రి వెంట ఉంటూ సపర్యలు చేశాడు. తండ్రి ఆరోగ్యవంతుడు కావడంతో త్వరలోనే దిల్లీ వెళ్లాలని సిద్ధమవుతున్నాడు.

20 రోజుల క్రితం రైల్వేస్టేషన్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం నడుపుతూ నిఖిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. చేతులకు, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. చిన్న ప్రమాదనుకుని దాన్ని అశ్రద్ధ చేశాడు. ఈ నెల 11న స్నేహితులతో కలసి ఎడ్యుకేట్‌ ది సొసైటీ సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధులకు పండ్లు, రొట్టెల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. కళ్లు మసకగా కనిపిస్తుండటంతో 12న సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ల ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి ఒక్కడే వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేయించుకుని బయటకు వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రి బాధ్యులు అంబులెన్సులో అతడిని సత్తెనపల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు వెంటనే చేరుకుని మెరుగైన చికిత్స అవసరంగా వైద్యుడు చెప్పగా గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండ్రోజులపాటు వైద్యానికి సహకరించిన నిఖిల్‌ మెదడు తర్వాత పని చేయడం ఆగిపోయింది.

కాలికి అయిన గాయంతో రక్తం గడ్డకట్టి క్రమంగా శరీరంలోని అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ మెదడు పనితీరును ఆగిపోయేలా చేసిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఎలాగైనా తమ కుమారుడిని కాపాడాలని వైద్యుల్ని ప్రాధేయపడ్డారు. నిఖిల్‌ను సాధారణ మనిషిగా చేయాలని వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో అతడు మృతి చెందినట్లు శనివారం నిర్ధారించారు. దీంతో కన్నవారు ఒక్కసారిగా కూలిపోయారు. మా అబ్బాయి బంగారమయ్యా.. చీమకు కూడా హాని చేయని వాడిని ఇలా చేశావేంటయ్యా.. చేతికంది వచ్చిన కుమారుడు చేజారడయ్యా అంటూ వారు రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. నిఖిల్‌ సోదరి మేరి ఆమెరికాలో పీజీ చదువుతున్నారు. అన్న మరణవార్తను తెలుసుకుని ఆమె స్వదేశానికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. శాసనమండలి సభ్యురాలు కల్పలతారెడ్డి, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంఈవో శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు నిఖిల్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు