logo

Kidnap: ప్రేమికుడితో కలిసి స్థిరపడేందుకు డబ్బు కోసం కుట్ర.. అన్నను కిడ్నాప్‌ చేయించిన చెల్లి

ప్రేమించిన యువకుడితో సంతోషంగా జీవించేందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమని భావించిన ఓ చెల్లెలు.. అన్నను కిడ్నాప్‌ చేయించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కరడుగట్టిన కిడ్నాప్‌ గ్యాంగ్‌తో చేతులు కలిపి రూ.2కోట్లు డిమాండ్‌ చేయించింది. తనకేమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది.

Updated : 08 Jan 2024 07:34 IST

కరడుగట్టిన కిడ్నాపర్ల గ్యాంగ్‌తో కలిసి పథకం
సోదరి, ఆమె ప్రియుడు సహా ముగ్గురి అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌-రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రేమించిన యువకుడితో సంతోషంగా జీవించేందుకు పెద్దమొత్తంలో డబ్బు అవసరమని భావించిన ఓ చెల్లెలు.. అన్నను కిడ్నాప్‌ చేయించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కరడుగట్టిన కిడ్నాప్‌ గ్యాంగ్‌తో చేతులు కలిపి రూ.2కోట్లు డిమాండ్‌ చేయించింది. తనకేమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది. చివరకు కథ అడ్డం తిరిగి కటకటాలపాలైంది. నగరంలో కలకలం రేపిన ప్రైవేటు ఉద్యోగి సురేందర్‌ కేసును రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌ సూత్రధారి.. బాధితుడి సోదరి నిఖిత, ఆమె ప్రియుడు బల్లిపార వెంకటకృష్ణ సహా కిడ్నాపర్లు మరో ముగ్గుర్ని ఆదివారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్లు మహేశ్‌, జేమ్స్‌బాబు, మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, అదనపు డీసీపీ నరసింహారెడ్డితో కలిసి డీసీపీ శ్రీనివాస్‌రావు ఆదివారం గచ్చిబౌలిలో కేసు వివరాలు వెల్లడించారు.

డబ్బు కోసం అన్న పేరు..!

మాచర్లకు చెందిన గుర్రం నిఖిత గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన బల్లిపార వెంకటకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గచ్చిబౌలిలో ఉండే వెంకటకృష్ణపై గతంలో వ్యభిచారం, డ్రగ్స్‌ కేసులున్నాయి. వెంకటకృష్ణ జైల్లో ఉన్న సమయంలో కరడుగట్టిన నేరగాడు, కిడ్నాపర్‌ అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేశ్‌ అలియాస్‌ సూర్య(31)తో పరిచయమేర్పడింది. తమ గ్యాంగ్‌ కిడ్నాప్‌లు చేస్తుందని ఎప్పుడైనా అవసరముంటే చెప్పాలని సురేశ్‌.. వెంకటకృష్ణకు చెప్పాడు. గత అక్టోబరులో వెంకటకృష్ణ.. తాను పనిచేసే సంస్థ ఎండీ శివశంకరబాబును సురేశ్‌ గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించాడు. అతని కుటుంబసభ్యుల నుంచి రూ.2లక్షలు వసూలు చేసి వదిలేశారు. డిసెంబరులో సురేశ్‌ తనకు డబ్బు అవసరముందని కిడ్నాప్‌ పని ఉంటే చెప్పాలని వెంకటకృష్ణ, నిఖితను సంప్రదించాడు. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచనలో ఉన్న వెంకటకృష్ణ, నిఖిత బాగా డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయిస్తే లాభం ఉంటుందని ఆశపడ్డారు. తన సొంత పెదనాన్న కుమారుడు, ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పనిచేసే సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని సూచించింది. సురేంద్రకు ఏటా రూ.కోటి జీతం వస్తుందని, ఆయన భార్య ఐటీ ఉద్యోగిని అని చెప్పింది. దీంతో సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు.

వేధిస్తున్నాడని పిలిపించి కిడ్నాప్‌..

పథకం ప్రకారం నిఖిత తన అన్న సురేంద్ర ఇల్లు, ఇతర వివరాలన్నీ కిడ్నాపర్లకు ఇచ్చింది. సురేశ్‌ గ్యాంగ్‌ సురేంద్ర ఇంటి దగ్గర రెక్కీ చేసినా కుదరలేదు. అతన్ని బయటకు తీసుకొస్తే పని తేలికవుతుందని నిఖితకు చెప్పాడు. ఈనెల 4న నిఖిత.. సురేంద్రకు ఫోన్‌ చేసి ఆఫీసులో ఒకరు వేధిస్తున్నారని ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని చెప్పింది. సురేంద్ర అక్కడికి వెళ్లి నిఖితతో మాట్లాడుతుండగా అప్పటికే కారులో సురేశ్‌, మెహిదీపట్నంకు చెందిన రామగల్ల రాజు అలియాస్‌ లడ్డు, శిందే రోహిత్‌, చందు, వెంకట్‌ ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా సురేంద్రను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇది గమనించిన అక్కడున్న ఇద్దరు డయల్‌ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా నిఖిత తన కళ్ల ముందే జరిగినట్లు చెప్పారు. అప్పుడు నిఖిత ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఎప్పటికప్పుడు కిడ్నాపర్లతో టచ్‌..!

సురేంద్రను తీసుకెళ్లిన నిందితులు ఆయన భార్యకు ఫోన్‌ చేసి రూ.2కోట్లు డిమాండ్‌ చేశారు. నిందితులు కడ్తాల్‌కు చేరుకున్నాక కారు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. నిందితులు సురేంద్రతో భార్యకు వాయిస్‌ మెసేజ్‌ పంపించి ఇంకో కారు పంపాలని చెప్పించారు. పథకం ప్రకారం తెలివిగా వెంకటకృష్ణ, నిఖిత ఇద్దరూ కారు తీసుకెళ్లి కడ్తాల్‌లో కిడ్నాపర్లకు అప్పగించారు. అనంతరం ఇద్దరూ కోళ్లు తరలించే వాహనంలో అర్ధరాత్రి హైదరాబాద్‌ తిరిగొచ్చారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో కిడ్నాపర్లలో ఒకడైన రోహిత్‌, బాధితుడు సురేంద్ర దొరికారు. మిగిలిన ముగ్గురు సురేశ్‌, రాజు, వెంకట్‌ పరారయ్యారు. సురేంద్ర చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో రాయదుర్గం పోలీసులు సురేశ్‌, వెంకటకృష్ణ, రాజు, నిఖితను అదుపులోకి తీసుకున్నారు. కారు వదిలిపోయిన తర్వాత నిందితుడు సురేశ్‌.. తనకు రూ.20లక్షలు పంపాలని బాధితుడి భార్యకు సందేశం పంపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు