logo

ఎంతపని చేశావు తల్లీ!.. భర్తపై కోపంతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి..

తనతో భర్త గొడవ పడటాన్ని జీర్జించుకోలేకపోయిన ఆ మహిళ.. టీలో ఎలుకల మందు కలిపి భర్తతోపాటు పిల్లలకు ఇచ్చి, తానూ తాగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతోపాటు ఆమె మృత్యువాత పడగా.. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated : 07 Feb 2024 08:33 IST

మాచర్లలో మూడు రోజుల వ్యవధిలో నలుగురి మృతి

వసంత (పాత చిత్రం)

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: తనతో భర్త గొడవ పడటాన్ని జీర్జించుకోలేకపోయిన ఆ మహిళ.. టీలో ఎలుకల మందు కలిపి భర్తతోపాటు పిల్లలకు ఇచ్చి, తానూ తాగింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతోపాటు ఆమె మృత్యువాత పడగా.. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరెడ్డిపురంలో జరిగింది.  పోలీసుల కథనం మేరకు.. నారాయణరెడ్డిపురం గ్రామానికి చెందిన రమావత్‌ రవినాయక్‌ తన అక్క కూతురైన వసంతను 14 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి భానుప్రకాశ్‌ (12), కార్తీక్‌ప్రకాశ్‌ (7), కవలలు ఈశ్వర్‌, ఉమేశ్వర్‌ (రెండున్నరేళ్లు) సంతానం. రవినాయక్‌ హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ వారానికోసారి స్వగ్రామానికి వచ్చి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి అప్పులు అధికమయ్యాయి. దీంతో వసంతకు పుట్టింటివారు ఇచ్చిన ఒకటిన్నర ఎకరాల పొలం అమ్మి అప్పులు తీరుద్దామని  భార్యకు రవినాయక్‌ చెప్పారు. అందుకు ఆమె ససేమిరా అనడంతో తరచూ వారి మధ్య గొడవలు జరిగేవి. ఇదే విషయాన్ని రవినాయక్‌ తన అక్క సరస్వతికి చెప్పగా స్థలం విక్రయించేందుకు ఆమె కూడా అంగీకరించలేదు.

ఈ క్రమంలోనే ఈ నెల 4న (ఆదివారం) ఉదయం భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వసంత భర్తతోపాటు ముగ్గురు పిల్లలకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. కొంచెం టీ తాగిన తర్వాత చేదుగా ఉందంటూ భర్త కింద పడేశారు. ఆ సమయంలో రెండో కుమారుడు కార్తీక్‌ ప్రకాశ్‌ తాతగారి ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలకు వాంతులు కావడంతో వెంటనే మాచర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ టీలో విషం కలిపిన విషయం ఆమె చెప్పలేదు. పిల్లల పరిస్థితి విషమంగా మారడంతో ప్రైవేటు వైద్యుడి సూచనతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంటల సమయంలో తాను టీలో ఎలుకల మందు కలిపి తాగించానని ఆమె చెప్పడంతో అక్కడి సిబ్బంది సంబంధిత చికిత్స ఆరంభించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ఆసుపత్రికి పిల్లలను తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఈశ్వర్‌ మృతి చెందాడు. సోమవారం పిల్లలిద్దరినీ హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గమధ్యలో భానుప్రకాశ్‌ చనిపోయాడు. మంగళవారం గుంటూరు ఆసుపత్రిలో తల్లి వసంత, హైదరాబాద్‌లో కుమారుడు ఉమేశ్వర్‌ చికిత్స పొందుతూ మృతి చెందారు.  ప్రస్తుతం రవినాయక్‌ గుంటూరులో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు